drones-pakistan
జాతీయం రాజకీయం

ఈ ఏడాది 100 పాకిస్తాన్ డ్రోన్ల‌ను ధ్వంసం..

భార‌త్ – పాకిస్తాన్ స‌రిహ‌ద్దుల్లో పాక్‌కు చెందిన డ్రోన్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిరోధించ‌గ‌లిగామ‌ని బీఎస్ఎఫ్ ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. ఈ ఏడాది 100 పాకిస్తాన్ డ్రోన్ల‌ను ధ్వంసం చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఈ డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భారత భూభాగంలోకి అక్రమంగా రవాణా చేయడానికి ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలిపారు. భారత భూభాగంలోకి మాదకద్రవ్యాల‌ తరలింపును అరికట్టే ప్రయత్నంలో భాగంగా త్రిముఖ వ్యూహాన్ని రూపొందించామ‌న్నారు.డ్రోన్ల ద్వారా డ్ర‌గ్స్‌, ఆయుధాల‌ను సుల‌భంగా త‌ర‌లించొచ్చ‌న్న ఉద్దేశంతోనే స్మ‌గ్ల‌ర్లు వీటిని ఎంచుకున్నార‌ని బీఎస్ఎఫ్ ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు. కానీ వాటిని విజ‌య‌వంతంగా ధ్వంసం చేసిన‌ట్లు చెప్పారు.

పాకిస్థాన్ డ్రోన్ భారత గగనతలంలోకి సోమ‌వారం ప్ర‌వేశించే ప్ర‌య‌త్నం చేయ‌డంతో.. బీఎస్ఎఫ్ ద‌ళాలు రంగంలోకి దిగాయి. అమృత్‌స‌ర్‌లోని రానియ‌న్ గ్రామం వ‌ద్ద‌ ఆ డ్రోన్‌ను ధ్వంసం చేశారు. ఆ డ్రోన్ ద్వారా పంపిన 434 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. డ్రోన్ ద్వారా డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ చేస్తున్నార‌ని భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు ప‌క్కా స‌మాచారం అంద‌డంతో ఆప‌రేష‌న్ చేప‌ట్టి, దాన్ని ధ్వంసం చేశారు.