sharmila-jagan
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

అన్నా, చెల్లెళ్ల మధ్య పొలిటికల్ వార్

జగనన్న వదిలిన బాణం షర్మిల. 2012లో మరో ప్రజా ప్రస్థానం పేరుతో జరిగిన పాదయాత్రలో షర్మిల పదే పదే వల్లె వెసిన డైలాగ్ ఇది. ఆ బాణం ఇప్పుడు అటు ఇటు తిరిగి జగనన్న మీదకే రావడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి పరిణామంగా చెప్పవచ్చు. తను విడిచిన బాణం తన మీదకే రావడం నిజంగా జగన్ కు మింగుడు పడని విషయమే. అయితే ఏపీ రాజకీయల్లో తిరిగి అడుగుపెటుతున్న తరుణంలో షర్మిల రాజకీయ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూద్దాం.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్తానం పాదయాత్ర ఓ రికార్డు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3,800 కిలోమీటర్లు నడిచిన మహిళగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కీలక పాత్ర పోషించిన షర్మిల. ఆ తర్వాత అన్న జగన్ తో ఏర్పడిన రాజకీయ, కుటుంబ పరమైన విబేధాల కారణంగా తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకునేందుకు సిద్ధమయింది. జులై 8, 2021న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది.

తెలంగాణలో  ఉద్యమ పార్టీగా పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను, ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. తెలంగాణలో పాద యాత్ర నిర్వహించారు. చాలా చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు, వైఎస్ఆర్టీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంతో పోలీసులు ఆ యాత్రకు బ్రేక్ వేశారు.  తెలంగాణలో దూకుడైన రాజకీయాలు చేసేందుకు షర్మిల ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. పరుష పదజాలంతో అప్పటి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. కాని 2023 ఎన్నికల్లో అనూహ్యమైన నిర్ణయాన్ని షర్మిల తీసుకున్నారు. తమ పార్టీ పోటీ చేస్తే ఓట్లు చీలి బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుతుందని అందుకే పోటీ చేయబోమని చెప్పిన షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. దీంతో వైఎస్ఆర్ టీపీ పార్టీ నేతలు , కార్యకర్తలు కొందరు ఆ పార్టీని వీడి వివిధ పార్టీల్లో చేరారు. అప్పటి వరకు తమను తిప్పించుకుని తీరా ఎన్నికల సమయంలో నట్టేట ముంచారంటూ నాయకులు విమర్శించారు. చివరకు షర్మిల తన నిర్ణయానికి గాను  పార్టీ నేతలకు, కార్యకర్తలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ ప్రభావం ఏ మాత్రం లేదని తెలిసి ముందుగానే షర్మిల కాడి వదిలేశారా అన్న చర్చ నేడు సాగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓవైపు బలంగా ఉంటే, కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అనూహ్యంగా బలోపేతం అయింది. బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ అవతరించింది. బీజేపీ తన  బలం మేరకు సీట్లు గెల్చుకునే దిశగా ఎన్నికల నాటికి అడుగులు వేస్తున్నాయి. ఈ తరుణంలో ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటు గెల్చుకోకపోతే పార్టీ దుకాణం మూయాల్సిన పరిస్థితి. పాలేరులో పోటీ చేస్తానని ప్రకటించిన షర్మిల  అక్కడ గెలవకపోతే పార్టీ అధ్యక్షురాలిగా  తన నాయకత్వంపై   ఎవరికీ నమ్మకం లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ తో పొత్తు ఉంటే కనీసం పాలేరులో పోటీ చేసి గెలవచ్చు అనుకున్న వైఎస్ ఆర్టీపీ అధినేతకు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు పొత్తు పెట్టుకోవడానికి అభ్యంతరాలు చెప్పడంతో తన పార్టీతో పాటు తాను ఎన్నికల బరి నుండి తప్పుకుని, కాంగ్రెస్ కు సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించింది. తన పార్టీని తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయించినా, తాను స్వయంగా పాలేరులో పోటీ చేసి ఓడిపోయినా  ఆ తర్వాతి ఎన్నికల ఫలితాలు తనకు రాజకీయ సమాధి కట్టే అవకాశాలు ఉండటం తోనే కాంగ్రెస్ కు మద్ధతు ఇచ్చి  ఎన్నికల పోటీ నుండి విరమించుకున్నట్లు తెలుస్తోంది.  

తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం షర్మిలతో జట్టు కట్టేందుకు సిద్ధపడకపోవడం, రానున్న రోజుల్లో షర్మిల పాత్ర తెలంగాణలో ఉండటం, పార్టీకి నష్టదాయకమని తెలంగాణ నేతలంతా ముక్తకంఠంతో కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పడంతో షర్మిల తన రాజకీయ భవిష్యత్తు విషయంలో అయోమయంలో పడిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణలో షర్మిల రాజకీయాలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అడ్డు చెప్పడంతో కాంగ్రెస్ అధిష్టానం తన వ్యూహాన్ని మార్చింది. తెలంగాణలో కాకుండా ఏపీ రాజకీయాల్లో షర్మిలను దింపేందుకు రంగం సిద్దం చేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను కూడా ఒప్పించింది. తెలంగాణలో పార్టీని వీలినం చేసి, ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ  బాధ్యతలు చేపట్టాలని సూచించింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తెలంగాణలో  ప్రభావం చూపింది. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ ప్రభావం ఏపీపైన ఎంతో కొంత ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.

అందుకు వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా షర్మిలను బరిలోకి దింపి కాంగ్రెస్ ను బలోపేతం చేయాలన్న వ్యూహంతో  పార్టీ షర్మిలను దగ్గరకు తీసుకుంటుందని ఏపీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వై.ఎస్ బొమ్మతో రాజకీయాలు చేస్తోన్న జగన్ ను అడ్డుకోవాలన్నా, టీడీపీ- జనసేన వంటి పార్టీలను ఎదుర్కోవాలన్నా కాంగ్రెస్ కు వై.ఎస్  కుమార్తెగా షర్మిల పని చేస్తుందన్నది కాంగ్రెస్ యోచన. అందుకే పీసీసీ చీఫ్ బాధ్యతలు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.రాజకీయాల్లో భాగంగా షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. తాను తెలంగాణ కోడల్ని అని పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే అని, తాను తెలంగాణ పక్షపాతినని చెప్పుకున్న తీరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో షర్మిల ప్రయాణానికి ఆటకం అవుతుందేమో అన్న భయం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. అంతే కాకుండా తాను తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తానని చెప్పడం, పోలవరం అయినా, పులిచింతల అయినా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతానని వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు ఏపీ ప్రజలకు తాను ఏపీ ప్రయోజనాల కోసం పోరాడతానని ఎలా చెప్తుందన్న ప్రశ్నలు తలెస్తుతున్నాయి.

అంతే కాకుండా వైఎస్ ఆర్టీ పీ ఏర్పాటు సమయంలో తన అన్న పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాడుతున్నారని, కేసీఆర్ కు వ్యతిరేకంగా తాను పోరాడుతున్నట్లు చెప్పారు. అప్పుడు చంద్రబాబును పొగుడుతూ మాట్లాడటం, ఇటీవల లోకేష్ కు క్రిస్మస్ కానుకలు పంపడంతో షర్మిల తీరు ఏంటో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబుకు మద్ధతుగా రాజకీయాలు ఉంటాయా అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏపీలో కాంగ్రెస్ జీరో అయింది. ఆ పార్టీలోని నేతలంతా వైఎస్ ఆర్సీపీ పార్టీలో చేరారు. మరి కొందరు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లన్నీ  జగన్ వెంట తరలి వెళ్లాయి. 2014 నుండి ఇప్పటి దాకా ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ ఉనికే లేని పరిస్థితి. ఈ క్రమంలో జగన్ టార్గెట్ గా కాంగ్రెస్ షర్మిలను దింపుతుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఓటు బ్యాంకు టీడీపీకి ఏలానో ఉంది. కాంగ్రెస్ కు తిరిగి లీడర్లు, క్యాడర్,  ఓటు బ్యాంకు తరలి రావాలంటే అది జగన్ పార్టీ నుండే అని విశ్లేషిస్తున్నారు. ఇదే టార్గెట్ గా షర్మిల పని చేయనుందని… ఇది టీడీపీ పార్టీకి లాభిస్తుందని విశ్లేషిస్తున్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్, కుమార్తెగా  షర్మిల  ఏపీలో చేసే రాజకీయాలు ఎలా ఉంటాయన్న ఆసక్తి ఇప్పుడు సర్వత్రా నెలకొంది. అన్న చెల్లెళ్ల పోరాటం టీడీపీకి లాభిస్తుందని విశ్లేషిస్తున్నారు.ఈ ఎన్నికల్లో షర్మిల రాకతో కాంగ్రెస్ కు లాభిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే వైఎస్సార్ కుమార్తెగా షర్మిల చేసే ప్రచారం ఎంతో కొంత వైఎస్ ఆర్సీపీకి నష్టం చేకూర్చుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా జగనన్న విడిచిన బాణం తిరిగి జగన్ మీదకే రావడం మాత్రం వైచిత్రమనే చెప్పాలి. ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీని,సీఎంగా ఉన్న వ్యక్తినే టార్గెట్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది. ఈ తరుణంలో తన అన్నపై ఎలాంటి ఆరోపణలను షర్మిల సంధిస్తుంది. దానికి జగన్ కౌంటర్ ఎలా ఉంటుందన్న అంశంపైన చర్చ సాగుతోంది. రానున్న రోజుల్లో అన్న చెళ్లేళ్ల పొలిటికల్ వార్ రాజకీయంగా ఉంటుందా..లేకా వ్యక్తిగత పోరుగా మారుతుందా వేచి చూడాల్సిందే.  ఓవైపు జగన్…మరో వైపు చంద్రబాబు… మధ్యలో పవన్ కళ్యాణ్, ఇప్పుడు షర్మిల వీరి మధ్య  ఎన్నికల రాజకీయం ఈ దఫా రంజుగా మారతాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.