ఆంధ్రప్రదేశ్ రాజకీయం

జనసేన గూటికి బొత్స లక్ష్మణరావు...?

వలస రాజకీయంలో ఇదో పెద్ద ట్విస్టు.. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఊహించని మార్పు. రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఉత్తరాంధ్ర నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి ఓ కీలక నేత జనసేనలో చేరనున్నాడనే సమాచారం ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లు కుటుంబమే బొత్సకు బలం అనుకుంటుండగా, ఆ కుటుంబం నుంచి ఒకరు బొత్సను ధిక్కరించి రాజకీయంగా విభేదించి జనసేనలో చేరతానని ప్రకటించడం పొలిటికల్‌గా హీట్‌ పుట్టిస్తోంది. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో బొత్స కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఓడించేలా ఆయన సొంత సోదరుడే పావులు కదిపాడనే ప్రచారం కూడా కాక రేపుతోంది. ఈ పరిస్థితుల్లో ఇన్నాళ్లు ఊహాగానమే అనుకున్నా.. బొత్స ఫ్యామిలీ వార్‌ నిజమని తేలిపోయిందని అంటున్నారు. ఉత్తరాంధ్ర లీడర్లలో బొత్సకు ఎదురులేదని చెబుతుంటారు. గత ఎన్నికల్లో ఓడినా అధిష్టానం వద్ద పరపతితో గత నెలలో జరిగిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుపొందారు. ఇక అదనపు బోనాంజాగా మండలిలో ప్రతిపక్ష నేత పోస్టును కొట్టేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్‌గా పనిచేసిన బొత్స…. ఒకానొక సమయంలో ముఖ్యమంత్రి రేసులో ఉన్నాననే సంకేతాలిచ్చారు. ఇలా సాధారణ కార్యకర్త నుంచి కీలక నేతగా ఎదిగిన బొత్సకు కుటుంబమే పెద్ద బలం. దాదాపు మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న బొత్సకు ఆయన కుటుంబ సభ్యుల అండదండలు పుష్కలంగా ఉండేవి.దాదాపు పది మంది వరకు బొత్స సోదరులు, సోదరీమణులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపుతుంటారు. చుట్టాలు, బంధువులుతో జిల్లా వ్యాప్తంగా బొత్సకు బంధుగణం ఉంటుంది. అందుకే ఆయన స్ట్రాంగ్‌ లీడర్‌గా ఎదిగారు. సొంత సోదరులు, సోదరీమణులతోపాటు దూరపు బంధువులు కూడా బొత్సకు వ్యతిరేకంగా నడిచే పరిస్థితి ఇంతవరకు ఎదురుకాలేదు. కానీ, తొలిసారిగా ఆయన సొంత సోదరుడే ధిక్కార స్వరం వినిపించడం చర్చనీయాంశంగా మారిందంటున్నారు.సీనియర్‌ నేత బొత్సకు మూడో సోదరుడైన లక్ష్మణరావు చాలా కాలంగా రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఉబలాట పడేవారని చెబుతారు.

అయితే బొత్స, ఆయన భార్య ఝాన్సీలక్ష్మి, బొత్స సోదరుడు అప్పలనరసయ్య, వరసకు సోదరుడైన నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించి లక్ష్మణరావుకు అవకాశం లేకుండా చేశారంటారు. కానీ, ఆయన ఎప్పుడూ అలాంటి అసంతృప్తికి లోనుకాకుండా అన్న చెప్పిన విధంగా నడుచుకునే వారంటారు. కానీ, రాజకీయంగా ఎదగాలనే ఆశ మాత్రం తీరని కోరికగా మిగిలిపోవడంతో గత ప్రభుత్వంలో తెర వెనుక నుంచి తెరపైకి రావాలని ప్రయత్నించారని అంటారు.ఈ క్రమంలోనే నెల్లిమర్ల నియోజకవర్గంపై ఫోకస్‌ చేసిన లక్ష్మణరావు… తన కంటూ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఐతే ఇప్పటికే బొత్స కుటుంబంలో నలుగురైదుగురు ఎమ్మెల్యే, ఎంపీలుగా పనిచేయడంతో లక్ష్మణరావుకి వైసీపీలో చాన్స్‌ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదనే టాక్‌ ఉంది. ఇక నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడితోనూ బొత్స లక్ష్మణరావుకి గ్యాప్‌ ఉందంటున్నారు. ఈ ఇద్దరి పంచాయితీని బొత్స కూడా పరిష్కరించకపోవడంతో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అయిన కుటుంబ సభ్యుడు అప్పలనాయుడిని ఓడించేలా బొత్స లక్ష్మణరావు పనిచేశారని చెప్పుకొంటున్నారు.

ఎన్నికల్లో వైసీపీకి పనిచేయలేదనే ప్రచారం జరుగుతున్న సమయంలోనే లక్ష్మణరావు జనసేనలో చేరనున్నట్లు ప్రకటన చేయడంతో ఇన్నాళ్లు జరిగిన ప్రచారం నిజమని తేలిపోయిందని అంటున్నారు. తనకు అవకాశం ఇచ్చే విషయంలో అన్న నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఇన్నాళ్లు తెరచాటుగా జనసేనతో కలిసి పనిచేసిన లక్ష్మణరావు.. అధికారికంగా జనసేన కండువా కప్పుకోవాలని డిసైడ్‌ అయ్యారంటున్నారు. దీంతో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న బొత్సకు ఈ పరిణామంతో షాక్‌ తగిలినట్లైంది. వాస్తవానికి బొత్స కుటుంబంలో అంతా ఒక్కటిగా కనిపించినా, బొత్స మేనల్లుడు, విజయనగరం జడ్పీ చైర్‌పర్సన్‌ మజ్జి శ్రీనివాస్‌ అలియాస్‌ చిన్నశ్రీనుతో కుటుంబానికి గ్యాప్‌ ఉందనే ప్రచారం ఉంది. ఐతే అది ఆ కుటుంబ వ్యవహారం కావడంతో ఎవరూ పెద్దగా దృష్టి పెట్టలేదు.కానీ, ఇప్పుడు లక్ష్మణరావు అన్నతో విభేదించి జనసేనకు వచ్చేయాలని నిర్ణయం తీసుకోవడంతో బొత్స ఫ్యామిలీలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది.

ఇక నుంచి బొత్స వైసీపీలో, ఆయన సోదరుడు జనసేనలో కొనసాగి ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధపడతారా? అనే ఉత్కంఠ ఏర్పడుతోంది. ఐతే బొత్స కుటుంబంలో నుంచి ఒకరు బయటకు వచ్చారంటే… అందులో ఇంకేదో దాగుందని.. ఇది భవిష్యత్‌ రాజకీయ మార్పులకు సంకేతం కావచ్చేనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఏదిఏమైనా బొత్స ఫ్యామిలీ వార్‌ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ మార్పు ఒక్క బొత్స లక్ష్మణరావు వరకే పరిమితం అవుతుందా? లేక బొత్స ఫ్యామిలీ నుంచి మరికొందరు బయటకు వస్తారా? అనేదే చూడాల్సివుంది.