న్యూ ఇయర్ వేళ ఏపీలో విందు రాజకీయాలు.. గుప్పుమన్నాయి. అధికార వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలు.. సన్నిహితులు, మద్దతుదారులు, క్యాడర్‌తో ఆత్మీయ సమావేశాలు, విందులు ఏర్పాటు చేశారు. తమ బలాన్ని అధిష్ఠానానికి చూపించే ప్రయత్నం చేశారు. కొత్త ఏడాది తొలిరోజు కిర్లంపూడి రాజకీయాలు ఆసక్తి రేపాయి. ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. దీనికి కొనసాగింపుగా ముద్రగడ పద్మనాభం ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ ఆత్మీయ కలయికకు.. ముద్రగడ అభిమానులు, అనుచరులు, కాపు నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆత్మీయ కలయికకు వచ్చిన వారిని.. ముద్రగడతోపాటు ఆయన తనయుడు ఆప్యాయంగా పలకరించారు.గత ఏడాది ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారంటూ ఊహాగానాలు వినిపించాయి. దాంతో పాటు సీఎం వైఎస్ జగన్‌ను పలు అంశాల్లో అభినందిస్తూ ముద్రగడ పలు లేఖలు రాశారు. దీంతో ఇక ముద్రగడ వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో అనుచరులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయిక ఆ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. మరోవైపు ముద్రగడ కుటుంబం నుండి ఎవరు పోటీ చేసిన గెలిపించి తీరు తామంటున్నారు..ఆయన అనుచరులు.
మరోవైపు ప్రత్తిపాడు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కూడా.. న్యూ ఇయర్ వేళ అనుచరులు, ఆత్మీయులతో విందు భేటీ నిర్వహించారు. ప్రస్తుత ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ వ్యవహారంపై అధిష్ఠానానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయని..తనకు టికెట్ కేటాయిస్తే గెలిచి తీరుతానంటున్నారు వరుపుల సుబ్బారావు.అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టికెట్ల కేటాయింపును ముమ్మరం చేసింది వైసీపీ అధిష్ఠానం. ఈ క్రమంలో పలువురు ఆశావహులు..తమ బలాన్ని, బలగాన్ని చూపించుకునేందుకు పోటాపోటీగా ఆత్మీయ సమావేశాలు, విందు రాజకీయాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి వీటిని అధిష్ఠానం ఎంతవరకూ పరిగణనలోకి తీసుకుంటుందో చూడాలి.