ktr-press meet
తెలంగాణ రాజకీయం

పందులను వదలని గులాబీ నేతలు

మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయాం. ప్రజలు అనవసరంగా భారత రాష్ట్ర సమితిని ఓడించారు. కెసిఆర్ ను ఓడించి పెద్ద తప్పు చేశారు. కాంగ్రెస్ 420 హామీలతో అధికారంలోకి వచ్చింది. వంద రోజుల్లో అవి అమలు చేయకపోతే ప్రజలు ఆ పార్టీని బొంద పెడతారు. పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల మాదిరి కాకుండా.. భిన్నమైన ఫలితాలు రావాలి. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ వాణిని వినిపించాలి అంటే భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను పార్లమెంటుకు పంపించాలి. ఇదీ నిన్న కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు. సరే రాజకీయ నాయకుడు అన్నాక అలాంటి మాటలు మాట్లాడాల్సిందే. పైగా తన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది కాబట్టి.. ఒక పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కాబట్టి.. పార్టీ క్యాడర్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి అంటే అలాంటి మాటలు మాట్లాడాల్సిందే.

కానీ ఇక్కడ కేటీఆర్ మర్చిపోతోంది ఏంటంటే తన ప్రభుత్వ హయాంలో.. ముఖ్యమంత్రి కార్యాలయంలో కొందరు అధికారులు ఎలా తిష్ట వేసుకున్నారో.. వారి కోర్టు కేసులకు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎలా చెల్లించారో… తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ విభాగం నుంచి తీసుకున్న అప్పును ఓ ఎమ్మెల్యే తిరిగి చెల్లించకుండా ఎలాంటి కథలు పడుతున్నాడో.. ఓ ఎమ్మెల్యే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన లేవి బియ్యం ఇవ్వకుండా ఎలా బయట అమ్ముకున్నాడో.. చివరికి ఓ మున్సిపల్ చైర్మన్ చివరికి పందులను కూడా వదలకుండా అమ్ముకొని.. ఎలా సొమ్ము చేసుకున్నాడో.. వీటన్నిటిని ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. పైగా ప్రభుత్వం ఏర్పడి నెల కూడా కాలేదు. సహజంగా కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల పాటు ఒక హనీమూన్ పీరియడ్ అంటూ ఉంటుంది. అంతటి కేసీఆర్ కూడా ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని అన్నాడు. అయితే కేటీఆర్ మాట్లాడిన మాటలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేయాల్సిన సమయంలో ఆయన మాటలు హద్దు దాటాయి. కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చిందంటున్న కేటీఆర్.. మరి బీఆర్ఎస్ కూడా అలాంటి హామీలనే ఎన్నికల ముందు ఇచ్చింది.

మరి వాటిని ఎలా అమలు చేసేది?పదేపదే భారత రాష్ట్ర సమితి నాయకులను పార్లమెంటు పంపించాలి అని చెప్పిన కేటీఆర్.. క్షేత్రస్థాయిలో కొన్ని విషయాలను ఇప్పటికీ మర్చిపోతున్నారు.. వారి ప్రభుత్వ హయాంలో భారత రాష్ట్ర సమితి నాయకుల దోపిడీ తాలూకూ పర్వాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. చివరికి ఆ పార్టీ నాయకులు పందులను కూడా వదలలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీలో మున్సిపాలిటీ చైర్ పర్సన్ భర్త ఏకంగా అక్కడి ప్రజల పందులనే అమ్ముకున్నాడు. మున్సిపాలిటీలో పందుల బెడద వల్ల ఆమె ఇబ్బంది పడుతున్నామని ప్రజలు ఫిర్యాదు చేయడంతో.. పందుల పెంపకం దారులను పోలీసుల సహాయంతో నిర్భందించి ఆ పందులను విడుదలవారీగా అమ్మాడు. మొత్తం 1.2 కోట్లు వెనకేసుకున్నాడు.. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిన తర్వాత పందుల పెంపకం దారులు అసలు జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో ఆ ఎమ్మెల్యే విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం మున్సిపల్ చైర్ పర్సన్ భర్త మీద కేసు నమోదయింది.

అయితే ఈ కేసు ఎటు పోతుందో తెలియదు గానీ.. ప్రస్తుతానికి అయితే చైర్పర్సన్ కుర్చికి మాత్రం ఎసరు వచ్చింది. అయితే దీనిపై చైర్ పర్సన్ భర్త మాత్రం ప్రజలు మొరపెట్టుకున్నందువల్లే పందులను అమ్నాల్సి వచ్చిందనే వాదనకు దిగాడు. ప్రజలకు ఇబ్బంది ఉంది అంటే వాటిని బయటకి తరలించాలి గానీ.. ఇలా అమ్మడం ఏంటి అనే ప్రశ్నకి ఆయన వద్ద సమాధానం లేదు. ఇక్కడ కేటీఆర్ అండ్ కో మర్చిపోతున్నది ఏంటంటే.. భారత రాష్ట్ర సమితి నాయకులు ఈ 10 సంవత్సరాలలో సొసైటీ మీద అడ్డగోలుగా దోచుకున్నారు. దేనిని కూడా వదిలిపెట్టలేదు. చివరకు ప్రజల పందులను కూడా అమ్ముకున్నారు. ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకుని.. పార్టీలో ఉంచుకుని.. కాంగ్రెస్ ను 420 అని కేటీఆర్ అంటున్నాడు అంటే ఏమనుకోవాలి?! ఇందు కోసమేనా తెలంగాణ వాదాన్ని వినిపించాలి అని అనేది?!