uddav thakre
జాతీయం రాజకీయం

షిండే వర్గానికే శివసేన

శివసేన కోసం పోరాటం చేసిన ఉద్దవ్‌ ఠాక్రేకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గమే నిజమైన శివసేన అని అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్ నార్వేకర్ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. అంతేకాదు. షిండే వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న ఉద్దవ్‌ వర్గం వాదనను స్పీకర్‌ తోసిపుచ్చారు. షిండే వర్గానిదే నిజమైన శివసేన అని ఈసీ కూడా స్పష్టం చేసిందన్నారు స్పీకర్‌. మెజారిటీ వర్గం ఎమ్మెల్యేలు షిండే వైపే ఉన్నారన్నారు. 2018 నాటి నాయకత్వ నిర్మాణం శివసేన రాజ్యాంగానికి అనుగుణంగా లేదని తెలిపారు. ‘2018 నాయకత్వ నిర్మాణం శివసేన పక్షప్రముఖ్‌ను అత్యున్నత పదవిగా పేర్కొందన్నారు. అయితే, శివసేన రాజ్యాంగంలో అత్యున్నత పదవి శివసేన ప్రముఖ్ , రాష్ట్రీయ కార్యకారిణి అత్యున్నత అధికారిగా పేర్కొన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏక్‌నాథ్‌ షిండేను తొలగించే అధికారం ఉద్ధవ్‌ ఠాక్రేకు లేదన్నారు స్పీకర్‌ నార్వేకర్‌..2013 నుంచి 2018 వరకు శివసేనలో సంస్థాగత ఎన్నికలు జరుగలేదని స్పీకర్‌ రాహుల్ నార్వేకర్ తెలిపారు.

అయితే, రెండు వర్గాలు సుప్రీంకోర్టుకు భిన్నంగా రాజ్యాంగాన్ని సమర్పించాయని చెప్పారు. ఎన్నికల సంఘం దగ్గర ఉన్న రికార్డులకే తాను పరిమితమైనట్లు తెలిపారు. శివసేన రాజ్యాంగానికి సంబంధించి ఈసీ నుంచి అందిన పత్రాల ఆధారంగా ఏక్‌నాథ్‌ షిండే వర్గమే నిజమైన శివసేన అని పేర్కొన్నారు. ఆ వర్గం ఎమ్మెల్యేల అనర్హత కోసం దాఖలు చేసిన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం అభ్యర్థనను స్పీకర్‌ తోసిపుచ్చారు. స్పీకర్ నిర్ణయంపై ఉద్దవ్‌ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ, అమిత్‌షా చెప్పినట్టు స్పీకర్‌ నడుచుకున్నారని విమర్శించారు ఉద్దవ్‌ వర్గం ఎంపీ ప్రియాంకా చతుర్వేది. మహారాష్ట్ర ప్రజలు మాత్రం తమవైపే ఉన్నారన్నారు.షిండే వర్గానిదే అసలైన శివసేన అని, 16మందిపై అనర్హత పిటిషన్‌ చెల్లదని స్పీకర్‌ నిర్ణయం ప్రకటించడంతో ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అయితే మహారాష్ట్ర స్పీకర్‌ రాహుల్‌ నార్వేకర్‌ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఉద్దవ్‌ వర్గం నేతలు వెల్లడించారు.