ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టి ఆపై మంత్రి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆయన.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన ఆకాంక్షలను నీరుగారుస్తూ పార్లమెంటుకు వెళ్లాలని సూచిస్తున్నారు. సీఎం మాట కాదనలేక.. ఎన్నాళ్ళ నుంచో ఉన్న కోరికను తీర్చుకోలేక ఆ కీలక నేత తీవ్రంగా మదన పడుతున్నారు. ఆ నేతే విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను.విజయనగరం జిల్లా రాజకీయాలను కొన్నాళ్లుగా శాసిస్తూ వస్తున్న బొత్స సత్యనారాయణ మేనల్లుడుగా కొన్నాళ్లపాటు తెర వెనక రాజకీయాలు నడిపిన చిన్న శ్రీను గడిచిన ఎన్నికల్లోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. జడ్పిటిసి గా ఎన్నికైన ఆయనను సీఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా నియమించారు. ఇన్నాళ్లు తెరవెనక రాజకీయాలు నెరుపుతూ వచ్చిన శ్రీనివాసరావు తొలిసారి ప్రత్యక్ష రాజకీయాలు చేయడంతోపాటు అధికారికంగా అధికారాన్ని చెలాయిస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని అనుచరుల వద్ద అనేకమార్లు చిన్న శీను చెప్పినట్లు చెబుతారు.
అందుకు అనుగుణంగానే నేత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. విజయనగరం జిల్లాలోని ఎస్ కోట నియోజకవర్గంతోపాటు, శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి చిన్న శ్రీను బరిలోకి దిగుతారని అనుచరులు చెబుతూ వచ్చారు. ఆయా నియోజకవర్గాల నేతలతో నిత్యం టచ్ లో ఉంటూ చాప కింద నీరులా కార్యకలాపాలను నిర్వర్తిస్తూ వస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలకు తన రాక ఇబ్బందిగా పరిణమించకుండా ఉండేలా సీఎం జగన్ మోహన్ రెడ్డి తో వారికి భరోసా ఇప్పించేందుకు ప్రణాళికలు వేశారు. అనూహ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిన్న శ్రీనును పార్లమెంటు బరిలోకి దించాలని యోచించారు. ఇదే ఇప్పుడు ఆ నేతకు మింగుడు పడడం లేదు.విజయనగరం జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. వీరిలో ఒకరు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కాగా, మరో మంత్రి పీడిక రాజన్న దొర ఉన్నారు. అయితే వీరిద్దరి కంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి తో చిన్న శ్రీను కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. విజయనగరం జిల్లాలో ఏ కార్యక్రమాన్ని సీఎం చేపట్టిన.. దానికి సంబంధించిన పనులన్నింటినీ చక్కబెట్టేది మజ్జి శ్రీనివాసరావే.
సీఎంతో ఉన్న సంబంధాలు కారణంగానే తాను వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో ఉంటానని సన్నిహితులు వద్ద పలుమార్లు చెప్పారు. కానీ, అనూహ్యంగా విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించాలని అధిష్టానం యోచించడమే కాకుండా.. అందుకు అనుగుణంగానే సిగ్నల్స్ అందించారు. ఇదే ఇప్పుడు ఆ నేతకు మింగుడు పడడం లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగుపెట్టి.. అధికారంలోకి వస్తే వెంటనే మంత్రి పదవి దక్కించుకొని ఆ అధికార దర్పాన్ని కూడా ప్రదర్శించాలని భావిస్తూ వచ్చిన చిన్న శ్రీను తాజా నిర్ణయంతో నిరాశలో కూరుకుపోయినట్లు చెబుతున్నారు. పార్టీ ఆదేశాలను పాటించడమే తప్ప చేసేదేమీ లేదు అంటూ సన్నిహితులు వాపోతున్నారు.జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును విజయనగరం పార్లమెంటు అభ్యర్థిగా పోటీకి దించాలని పార్టీ నిర్ణయించింది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ ఉన్నారు. ఈయనకు ప్రత్యామ్నాయం చూపించడకుండా మజ్జి శ్రీనివాసరావును ఖరారు చేస్తే ఇబ్బందులు వస్తాయని పార్టీ భావిస్తోంది.
బెల్లాన చంద్రశేఖర్ ను అసెంబ్లీకి పంపించే ఆలోచనలో అధిష్టానం ఉందని చెబుతున్నారు. అన్నీ కుదిరితే ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానాన్ని బెల్లానకు కేటాయించే అవకాశం ఉంది. అక్కడ లోకల్ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ ప్రస్తుతం ఉన్నారు. ఈ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. వీరిద్దరిలో ఎవరికో ఒకరికి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించి.. మరొకరికి నామినేటెడ్ పోస్ట్ అందిస్తామని హామీ ఇచ్చే దిశగా వైసిపి ముఖ్య నాయకులు చర్చలు జరుపుతున్నారు. ఈ సీటు వ్యవహారం తేలక పోవడం వల్లే విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని వైసిపి ప్రకటించలేదు. ఇప్పటికే విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తో వైవి సుబ్బారెడ్డి చర్చలు జరిపారు. ఇక్కడ జరిపిన చర్చలు విఫలం కావడంతో సీఎం వద్దకు వెళ్లారు. సీఎంతో చర్చలు ముగిసిన తర్వాతే అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం దక్కనున్నట్లు ఎంపీ బెల్లాన సన్నిహితులతో చెప్పినట్లు చెబుతున్నారు.