24 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వైసీపీ హిట్ లిస్ట్ ఇప్పుడు ఉమ్మడి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పుట్టిస్తోంది. 2019 ఎన్నికల్లో కుప్పం మినహా జిల్లా అంతటా వైసీపీ జెండాను ఎగరవేసిన అధికార పార్టీ, ఇప్పుడు వై నాట్ 175 అంటోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. సర్వేలు, సామాజిక సమీకరణలు, బలాబలాలు పరిగణలోకి తీసుకుంటోంది వైసీపీ అధిష్టానం. ఇప్పటికే మూడు జాబితాలను విడుదల చేసిన వైసీపీ హై కమాండ్ నాలుగో లిస్ట్ పై కసరత్తు ప్రారంభించింది.వైసీపీ మూడో విడత జాబితా విడుదలతో కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం తెలిపోగా, మిగతా స్థానాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ కొనసాగుతోంది. తిరుపతి పార్లమెంట్ తో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు మదనపల్లి చిత్తూరు పూతలపట్టు నియోజకవర్గాలపై వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చేసింది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని సత్యవేడు రిజర్వర్డ్ అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించిన వైసీపీ అధిష్టానం సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తిరుపతి పార్లమెంట్ ఇన్‌చార్జిగా ప్రకటించింది.
ఇక చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ను తప్పించి విజయానంద రెడ్డికి, మదనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ భాషను తప్పించి నిషార్ అహ్మద్ కు, పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబును తప్పించి డాక్టర్ సునీల్ కుమార్ ను వైసీపీ అధిష్టానం సమన్వయకర్తలుగా చేసిందిఇక మిగతా నియోజకవర్గాలపై క్లారిటీ ఇవ్వని వైసీపీ అధిష్టానం సిట్టింగుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేల్లో వైసీపీ నెక్స్ట్ జాబితా కలవర పెట్టిస్తోంది. పుంగనూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి, ఇక ఇప్పటికే ప్రకటించిన కుప్పం స్థానాలు మినహా అన్నిచోట్లా వైసీపీ ఎమ్మెల్యేల్లో గందరగోళం నెలకొంది. కుప్పం సమన్వయకర్తగా ఉన్న ఎమ్మెల్సీ భరత్‌కు ఏ డోకా లేకపోగా, ఇప్పటికే తిరుపతి సమన్వయకర్తగా భూమన అభినయ్, చంద్రగిరి సమన్వయకర్తగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్లను ప్రకటించిన అధిష్టానం, మిగతా వారిపై ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో పేర్లను ప్రకటించేంతవరకు ఎమ్మెల్యేలు, మంత్రుల్లో టెన్షన్ వీడేలా లేదు.సిట్టింగ్ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, వెంకటే గౌడ, బియ్యపు మధుసూదన్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తోపాటు మంత్రులు ఆర్కే రోజా, నారాయణ స్వామి టికెట్ల విషయంలోనూ అయోమయం నెలకొంది.
వైసీపీ రెండు రోజుల క్రితం విడుదల చేసిన మూడో జాబితాలో శ్రీకాళహస్తి సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి పేరు ఉంటుందని భావించినా జాబితాలో మాత్రం కనిపించలేదు. ఇక పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ విషయంలో మార్పులు ఉండకపోవచ్చన్న ప్రచారం జరుగుతున్నా వాళ్లని కంటిన్యూ చేస్తున్నట్లు వైసీపీ హై కమాండ్ ప్రకటన చేస్తే తప్ప టెన్షన్ వీడేటట్లు లేదు.మంత్రి ఆర్కే రోజా కూడా మూడోసారి పోటీకి వైసీపీ అధిష్టానం ఛాన్స్ ఇచ్చేలా కనిపిస్తుండగా, గంగాధర నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విషయం ఇంకా దోబూచులాడుతూనే ఉంది. స్వామికి టికెట్ ఇవ్వద్దని ఆయన వ్యతిరేకవర్గం గట్టిగా పట్టుబడుతుండడంతో వైసీపీ పునరాలోచిస్తోంది. స్వామిని చిత్తూరు ఎంపీగా పంపాలా లేక నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మిని గంగాధర నెల్లూరు సమన్వయకర్తను చేయాలా అన్నదానిపై కసరత్తు చేస్తోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరి పనితీరు బాగా లేదన్న సర్వేలు, సామాజిక సమీకరణలు, క్యాడర్‌లో ఉన్న వ్యతిరేకతలను పరిగణలోకి తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తున్న వైసీపీ హై కమాండ్ నో లాబింగ్ అన్నట్లు వ్యవహరిస్తుండడం సిట్టింగ్ లను కలవర పెట్టిస్తోంది. దీంతో ఎడతెగని పంచాయితీ కొనసాగుతోంది. వైసీపీ విడుదల చేసే 4వ జాబితాలో కొత్త ముఖాలు తెర మీదికి వస్తాయా లేక ఉన్న వాళ్ళేకే ఛాన్స్ దక్కుతుందా అన్న విషయం తేలిపోనుండగా కట్టలు తెంచే ఉత్కంఠ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెంచుతోంది.
వేటు తప్పదా
సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది వైసీపీ అధిష్టానం. ఈ నెల 17న లేదా 18న నాలుగో జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. సర్వేల నివేదికల ద్వారా మరో 8 నియోజకవర్గాల్లో మార్పులు చేస్తూ నాలుగో జాబితాను రిలీజ్ చేయబోతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మార్కాపూరం(నాగార్జున రెడ్డి), గిద్దలూరు(అన్నా రాంబాబు), తిరువూరు(రక్షణ నిధి), గంగాధర నెల్లూరు(నారాయణ స్వామి), యలమంచిలి(కన్నా బాబు రాజు), సూళ్లూరుపేట(సంజీవయ్య), నందికొట్కూరు (తొగూరు ఆర్ధర్), సింగనమల(జొన్నలగడ్డ పద్మావతి) నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను మార్చబోతున్నట్లుగా తెలుస్తోంది.మార్కాపురంలో ఎమ్మెల్యే నాగార్జున రెడ్డికి కాకుండా జంకె వెంకట రెడ్డికి టికెట్ ఇవ్వాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. తిరువూరులో రక్షణ నిధిని కాదని టీడీపీ నుంచి చేరిన స్వామి దాస్ కు టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. యలమంచిలిలో కన్నబాబు రాజును తప్పించి గుడివాడ అమర్నాథ్ ను బరిలో దింపే ఛాన్స్ ఉంది. ఇదే చివరి జాబితా అని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. మిగిలిన వారంతా యధావిధిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
వైసీపీ ఇంఛార్జీల మార్పునకు సంబంధించి కసరత్తు దాదాపుగా కొలిక్చి వచ్చింది. దాదాపు 60 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాలని జగన్ నిర్ణయించారు. ఆ దిశగా 50 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు ప్రకటించారు. మరో 8 స్థానాల్లో మార్పులకు సంబంధించి ప్రకటన సంక్రాంతి తర్వాత అంటే ఈ నెల 17న లేదా 18వ తేదీన ఉండబోతోందని సమాచారం. ఆ నియోజకవర్గాల ఇంఛార్జీలు, ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనూ సంప్రదింపులు చేశారు జగన్. కొత్త వాళ్లు ఎవరు వస్తారు అనే క్లారిటీతో వైసీపీ అధిష్టానం ఉంది. ఇన్ని రోజులు పక్కన పెడుతూ వచ్చిన ప్రధానమైన నియోజకవర్గాలకు సంబంధించి క్లియరెన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
* మార్కాపురం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాగార్జున రెడ్డిని తప్పించి జంకె వెంకటరెడ్డికి అవకాశం ఇవ్వనున్నారు. జంకె వెంకట రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో మారిన సమీకరణాల నేపథ్యంలో సీఎం జగన్ వెంకటరెడ్డిని పక్కన పెట్టారు. ఇప్పుడు మరోసారి ఆయనకు టికెట్ ఇవ్వనున్నారు.
* గిద్దలూరు.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నా రాంబాబు ఉన్నారు. నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, రాజకీయాల్లో ఉండటం లేదు అని ఇప్పటికే ఆయన ప్రకటించారు. పార్టీ కోసం పని చేస్తాను తప్ప ఎన్నికల రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నా అని చెప్పారు. కాగా గిద్దలూరు స్థానం హాట్ టాపిక్ గా మారింది. సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన వర్గానికి చెందిన వ్యక్తికే గిద్దలూరు టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. గిద్దలూరికి ఎవరిని తీసుకొస్తారు అనేది హాట్ టాపిక్ అయ్యింది. దర్శి ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ ని ఇప్పటికే అక్కడి నుంచి తప్పించారు. ఆయనను గిద్దలూరుకి పంపిస్తారా? లేదంటే.. సిద్ధా రాఘవయ్య కుమారుడికి అవకాశం ఇస్తారా? లేక బాలినేని శ్రీనివాస్ రెడ్డి సూచించిన వ్యక్తికే గిద్దలూరు టికెట్ ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
* కృష్ణా జిల్లా తిరువూరు.. సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధిని తప్పించనున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన పార్టీ కార్యక్రమాలకు, అధినాయకత్వానికి దూరంగా ఉన్నారు. 4 రోజుల క్రితం టీడీపీ నుంచి వైసీపీలో చేరిన స్వామి దాస్ కు తిరువూరు టికెట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. స్వామి దాస్ కేశినేని నాని వర్గీయుడు.
* గంగాధర నెల్లూరు.. సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణ స్వామి. డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మంత్రి. ఆయన స్థానంలో ఆయన కూతురు కృపా లక్ష్మికి టికెట్ ఇచ్చే ఛాన్స్.
* యలమంచిలి.. అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ అమర్నాథ్ కి యలమంచిలి టికెట్ ఇచ్చే ఛాన్స్.
* సూళ్లూరుపేట.. సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవయ్య.. ఆయనను మార్చబోతున్నారు. కొత్త వారికి అవకాశం.
* నందికొట్కూరు.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్.. ఆయనను తప్పించబోతున్నారు.. బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డితో విభేదాలు. బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి ఎవరి పేరు చెబితే వారికే టికెట్ ఇచ్చే అవకాశం. నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఆర్థర్ ఉన్నప్పటికీ.. ఆ నియోజకవర్గ ఇంఛార్జిగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఉన్నారు. ఆయన వర్గానికి చెందిన వారికే టికెట్ ఇచ్చే అవకాశం.
* శింగనమల.. సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. టికెట్ లేదని చెప్పేసిన జగన్.. కొత్త వారికి టికెట్ ఇచ్చే అవకాశం