heirs
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

టీడీపీలోకి వారసులొస్తున్నారు…

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎవరికి వారే తమ రాజకీయాలకు పదును పెడుతున్నారు నేతలు. నాడు రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో తల్లితండ్రులు కీలకంగా వ్యవహరిస్తే, నేడు వారి వారసులు కదంతొక్కుతున్నారు. ఎన్నికల వేళ వారు మరింత యాక్టివ్ అయ్యి తమ నియోజకవర్గాల్లో అంతా తామై వ్యవహారిస్తూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. జనంలోకి దూసుకుపోతున్నారు.ఎన్నికల వేళ తమ రాజకీయాలకు పదును పెడుతున్నారు నేతలు. తమతో పాటు తమ వారసులు సైతం నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. వారసులు కొందరు గత ఎన్నికల్లో పోటీ చేయగా, మరికొందరు రానున్న ఎన్నికల్లో బరిలో దిగేందుకు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం జిల్లా సుప్రీం అశోక్ గజపతిరాజు వారసురాలు అదితి ముందు వరుసలో ఉన్నారు. గత 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలైన అదితి ప్రస్తుతం నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నానని చెప్తూ పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే అధిష్టానం అదితి కి ఛాన్స్ ఇస్తుందా లేక అశోక్ గజపతి రాజును బరిలోకి దించుతుందా అన్నదీ క్లారిటీ రావల్సి ఉంది.

ఇక మరో యువ నాయకుడు కిమిడి నాగార్జున. తండ్రి కిమిడి గణపతిరావు మాజీ ఎమ్మెల్యేగా, తల్లి మాజీ జడ్పీ చైర్ పర్సన్, మాజీ మంత్రి గా పనిచేశారు. ప్రస్తుతం నాగార్జున విజయనగరం జిల్లా అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో చీపురుపల్లి నుండి పోటీ చేసి మంత్రి బొత్స సత్యనారాయణ చేతిలో ఓటమి పాలైన నాగార్జున రానున్న ఎన్నికల్లో మరోసారి పోటీకి దిగనున్నారు. ఇక కిమిడి రామ్ మల్లిక్. ఇతను మాజీ మంత్రి, మాజీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు తనయుడు. రానున్న ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. తన రాజకీయ వారసుడిగా అవకాశం కల్పించాలని అధిష్టానంను అడుగుతున్నారు కళా వెంకటరావు. కిమిడి కళా వెంకటరావు రిక్వెస్ట్ ను పార్టీ హైకమాండ్ పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.మరో యువనేత కావలి గ్రీష్మ.. ఈమె మాజీ మంత్రి, తొలి మహిళ స్పీకర్ కావలి ప్రతిభ భారతి కూతురు. ఈమె కూడా రాజకీయాల్లో యాక్టివ్‌గా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.

ఇలా తెలుగుదేశం పార్టీలో నాటి నుండి నేటి వరకు కీలకంగా వ్యవహరించిన సీనియర్స్ ఎలాగైనా తమ వారసులను చట్టసభల్లో చూడాలని ముచ్చటపడుతున్నారు. ఓ వైపు సీట్ల కోసం ప్రయత్నిస్తూనే, మరో వైపు సొంత నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా చట్టసభల్లో అడుగు పెట్టాలని తీవ్ర కసరత్తే చేస్తున్నారు. అయితే, వీరందరికీ సీట్లు దక్కుతాయా? లేక మరోసారి సీనియర్స్ కే అవకాశం కల్పిస్తారా? అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నదీ ఉత్కంఠగా మారింది.