kavitha
తెలంగాణ రాజకీయం

కవితకు జ్యూడిషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు  మరోసారి షాక్ తగిలింది. ఆమె జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. మంగళవారంతో ఆమె కస్టడీ ముగియగా.. ఈడీ, సీబీఐ అధికారులు ఆమెను వర్చువల్ గా కోర్టు ముందు హాజరు పరిచారు. కస్టడీ పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరడంతో న్యాయస్థానం అందుకు అంగీకరించింది. మే 7 వరకూ కవితకు కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కావేరీ బవేజా తీర్పు వెలువరించారు. అటు, ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సైతం మే 7 వరకూ న్యాయస్థానం కస్టడీ పొడిగించింది. దీంతో అప్పటివరకూ వీరిద్దరూ తీహార్ జైలులోనే ఉండనున్నారు. కవిత బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని.. కేసు విచారణ పురోగతిపైనా ప్రభావం ఉంటుందని ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. ఆమె అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగిందని కోర్టుకు వివరించారు.

మరోవైపు, కవితకు కస్టడీ పొడిగింపు అవసరం లేదని, ఈడీ కొత్తగా ఏ అంశాలను జత చేయలేదని ఆమె తరఫు న్యాయవాది రాణా తెలిపారు. సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజు నుంచి ఆరోపిస్తున్నారని.. కొత్తగా ఏమీ చెప్పడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, కేసు దర్యాప్తునకు సంబంధించి వివరాలను ఈడీ కోర్టుకు అందజేసింది. 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జ్ షీట్ సమర్పిస్తామని కోర్టుకు తెలిపింది. లిక్కర్‌ స్కాం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తీహార్‌ జైలులో కవిత ఉన్నారు. మళ్లీ ఏప్రిల్‌ 11న సీబీఐ కూడా అదే కేసులో ఆమెను అరెస్టు చేసింది. ప్రశ్నించిన అనంతరం కోర్టులో హాజరు పరచగా కస్టడీ విధించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. మంగళవారంతో జ్యుడీషియల్ కస్టడీ ముగియగా ఆమెను వర్చువల్ గా కోర్టు ముందు హాజరు పరిచారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు ఆమెకు కస్టడీ పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది. మరోవైపు, ఈ కేసుకు సంబంధించి కవితను సీబీఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది. దీనిపై ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా మే 2న తీర్పు వెల్లడి కానుంది.