kesineni nani-ycp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఓసీ రాగంలో వైసీపీ…

విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నానిని గత వారం వైఎస్సార్సీపీ ప్రకటించింది. వైసీపీ తరపున 2014లో పారిశ్రామికవేత్త కోనేరు రాజేంద్రప్రసాద్‌, 2019లో సినీ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్ పోటీ చేశారు. రెండు సార్లు స్వల్ప మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కేశినేని నాని గెలుపొందారు. 2014లో 74వేల ఓట్లతో గెలిచిన నాని 19లో 8726ఓట్ల ఆధిక్యత సాధించారు.కేశినేని నాని కంటే ముందు విజయవాడ ఎంపీగా కాంగ్రెస్‌ పార్టీ తరపున లగడపాటి రాజగోపాల్ గెలిచారు. 2004,2009 ఎన్నికల్లో రాజగోపాల్‌ ఎంపీగా పనిచేశారు. 1999లో టీడీపీ తరపున గద్దె రామ్మోహన్‌ గెలిచారు. అంతకు ముందు 1996,1998లో కాంగ్రెస్‌ తరపున పర్వతనేని ఉపేంద్ర ఎంపీగా గెలిచారు.1991లో వడ్డే శోభనాద్రీశ్వరరరావు, 1989లో చెన్నుపాటి విద్య, 1984లో వడ్డే శోభనాద్రీశ్వరరావు, 1980లో చెన్నుపాటి విద్య విజయవాడ ఎంపీలుగా గెలిచారు. 1980 నుంచి విజయవాడలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు మాత్రమే గెలుపొందుతూ వస్తున్నారు.

రాజకీయ పార్టీలు ఏవైనా విజయవాడలో పోటీ చేసే అభ్యర్థి మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారినే బరిలోకి దింపాలనే ఆనవాయితీని కొనసాగిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచే పార్టీ మారినా వాటి తరపున పోటీ చేసే అభ్యర్థి సామాజిక వర్గంలో మాత్రం మార్పు ఉండట్లేదు.43ఏళ్లుగా ఒకే సామాజిక వర్గానికి విజయవాడ పార్లమెంటు స్థానాన్ని కేటాయించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బలమైన సామాజిక, ఆర్ధిక నేపథ్యం ఉండటంతో పాటు గ్రామాల్లో తిరుగులేని పట్టుండటంతో పార్లమెంటుకు వెళ్లే అభ్యర్థిగా ఒకే కులానికి ప్రాధాన్యత దక్కుతోంది.కృష్ణా, గుంటూరు రాజకీయాల్లో రిజర్వేషన్‌ లేకున్నా, అప్రకటితంగా కొనసాగుతున్న రాజకీయ పరంపరకు వైసీపీ ముగింపు పలుకుతుందని ఆ పార్టీ కొంత కాలంగా ప్రచారం చేస్తోంది. 2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారని ఇన్నాళ్లు చెబుతూ వచ్చారు.

గత కొద్ది రోజులుగా టీడీపీలో నెలకొన్న రాజకీయ విభేదాల నేపథ్యంలో కేశినేని నాని ఆ పార్టీని వీడటం ఆ వెంటనే వైసీపీలో చేరిపోవడం చకచకా జరిగి పోయాయి.ఇన్నాళ్లు బీసీ, ఎస్సీ అని ప్రచారం చేసి ఇప్పుడు మళ్లీ కమ్మ సామాజిక వర్గానికి విజయవాడ పార్లమెంటు స్థానాన్ని కట్టబెట్టడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఇన్నాళ్లు టీడీపీలో ఉండగా కేశినేని నానిని రాజకీయ ప్రత్యర్థిగా భావించి పోరాడితే, ఇప్పుడు అదే వ్యక్తి పార్టీ మారగానే ఎలా నెత్తిన పెట్టుకోవాలనే సందేహం వైసీపీ క్యాడర్‌లో ఉంది.కేశినేని నానికి వైసీపీ ఎంపీ అభ్యర్ధిత్వం ఖరారైన నేపథ్యంలో విజయవాడ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో మిగిలిన సామాజిక వర్గాలకు అనివార్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థుల్ని మాత్రమే ఎన్నికల్లో గెలిపించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ సారి ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారనేది ఆసక్తికరంగా మారింది.