ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుకు నమస్కారం పెట్టి తన సంస్కారాన్ని బయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే

తెలుగుదేశం అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భారీ వర్షాలు, వరద ధాటికి రాయలసీమ ప్రాంతం అతలాకుతలం అయ్యింది. ఈ నేపధ్యంలో రాయల సీమ జిల్లాల పర్యటనలో ఉన్న చంద్రబాబును చూసి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి నమస్కారం చేసి..తన సంస్కారాన్ని బయటపెట్టారు.

రామచంద్రాపురం మండలంలో కోతకు గురైన రాయలచెరువును టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం పరిశీలించారు. మరమ్మతులు చేసిన ప్రాంతాన్ని పరిశీలించి.. చెరువు ప్రస్తుత పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో పటిష్ట చర్యలు చేపట్టాలని లేకపోతే ప్రజల ప్రాణాలకే ముప్పు వస్తుందని చంద్రబాబు చెప్పారు.

అయితే.. కాన్వాయ్‌లో రాయలచెరువు ప్రాంతానికి చేరుకుంటున్న చంద్రబాబుని చూసి.. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లేచి నిలబడి చంద్రబాబుకు నమస్కారం చేశారు. అయితే చంద్రబాబు ..చెవిరెడ్డి ని చూసాడా ? లేడా ? అనేది వీడియో లో క్లారిటీగా కనిపించలేదు. మొత్తానికి ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. గత వారం ఏపీ అసెంబ్లీ లో తనను , తన భార్య ను వైసీపీ నేతలు అవమానించారని చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటన అందర్నీ బాధపెట్టింది. వైసీపీ నేతల తీరుపై అంత ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎప్పుడు మీడియా ముందుకు రాని నందమూరి ఫ్యామిలీ సభ్యులు సైతం మీడియా ముందుకు వచ్చి మరోసారి ఇలాంటివి జరిగితే బాగొదంటూ హెచ్చరికలు జారీచేశారు.