మరో రెండు రోజుల్లో అయోధ్యలోని రామాలయ గర్భగుడిలో ఉంచిన బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ వేడుక చూసేందుకు వేలాది మంది చేరుకుంటారు. 100కుపైగా విమానాలు అయోధ్యలో ల్యాండ్ కానున్నాయి.మీడియా ద్వారా ఇప్పటికే దేశ ప్రజలంతా బాల రాముడి దివ్య రూపాన్ని చూసి తరించి ఉంటారు. నల్లరాయితో తయారు చేసిన దివ్య మూర్తి రూపం చిద్విలాసంతో ఆకట్టుకుంటోంది. దీన్ని ప్రస్తుతం గర్భగుడిలో ఉంచారు. రెండు రోజుల తర్వాత పవిత్రమైన ప్రదేశంలో ఉంచి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అనంతరం ఈ విగ్రహానికి దైవత్వం ఆవహిస్తుంది. పరమ పవిత్రమైన శిలగా పూజలు అందుకోనుంది. ఈ పవిత్రమైన వేడుక కోససం యావత్ దేశం వెయి కళ్లతో ఎదురు చూస్తోంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ప్రధాని మోడీ సహా పలువురు బడా నేతలు పాల్గొంటున్నారు. ఈ ప్రతిష్ఠా కార్యక్రమానికి వీవీఐపీ అతిథులు క్యూ కట్టనున్నారు. ఇలా భారీగా తరలి వచ్చే రామ భక్తుల భద్రత ఇప్పుడు అధికారులకు పెద్ద టాస్క్ అందుకే అయోధ్యపై పూర్తి నిఘా పెట్టాయి భద్రతా బలగాలు, వీఐపీ మూమెంట్ ఉన్నందున డేగ కళ్లతో కాపలా కాస్తున్నారు. రామ మందిరాన్ని, భక్తులను కాపాడేందుకు సైనికులు, ఎన్ఎస్జీ కమాండోలతోపాటు ఎన్నో హైటెక్ గ్యాడ్జెట్లు వినియోగిస్తున్నారు.
రామ్ లల్లా ప్రతిష్ఠాపనను న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇది పెద్ద ఈవెంట్ కావడంతో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వస్తోంది. అందుకే పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం అనేక హైటెక్ గ్యాడ్జెట్లు వినియోగిస్తోంది.
క్లాష్-రేటెడ్ బొలార్డ్స్
బొల్లార్డ్స్ పెద్ద వాహనాల దాడి నుంచి ఏ భవనాన్ని అయినా రక్షిస్తాయి. ఆలయ ఆవరణలో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే బలార్డ్స్‌ను వినియోగిస్తున్నారు. ఎక్కడికక్కడ వీటిని మోహరించి ప్రమాదాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా వీటిని ఉపయోగిస్తారు. జన్మభూమి మార్గం గుండా వెళ్లే ప్రతి వాహనాన్ని ఇవి స్కాన్ చేస్తాయి. అనుమానం ఉన్న వెహికల్స్‌ను గుర్తించి అలర్ట్ చేస్తాయి.
టైర్ కిల్లర్స్
అనధికారిక వాహనాలను దూరం నుంచి ఆపి ఆలయం సమీపంలోకి రాకుండా నియంత్రించేందుకు ఈ టైర్ కిల్లర్స్‌ను వినియోగిస్తున్నారు.
ఏఐ సీసీటీవీలు
అయోధ్యలో రామ మందిర భద్రత కోసం 10 వేలకుపైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల్లో కొన్ని ఏఐని ఉపయోగించారు. అనుమానాస్పద వ్యక్తులను అక్కడికక్కడే గుర్తించగలవు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా 90 రోజుల వరకు రికార్డింగ్స్ భద్రపరుచుకోవచ్చు.
యాంటీ డ్రోన్ టెక్నాలజీ
రామ మందిర సముదాయం, దాని చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని నో డ్రోన్ జోన్‌గా ప్రకటించారు. యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ఆలయాన్ని సంరక్షిస్తున్నారు. ఏదైనా అనధికార డ్రోన్ లేదా వేరే ఏమైనా ఎగురుతున్నట్లు కనిపిస్తే రేడియో ఫ్రీక్వెన్సీ సహాయంతో అక్కడికక్కడే కూల్చివేస్తారు. కమాండ్ ప్రోటోకాల్స్ ఆధారంగా వ్యక్తిగత డ్రోన్ నమూనాలను కూడా ఈ టెక్నాలజీ గుర్తించగలదు
ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్
ఈ మొత్తం కార్యక్రమం సజావుగా సాగేందుకు అయోధ్య చుట్టుపక్కల 20 చోట్ల ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ వ్యవస్థ ఉపయోగించనున్నారు. ఇందులో భాగంగా అన్ని రకాల కదలికలపై నిఘా పెట్టారు. వీవీఐపీల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ బూత్లు ఏర్పాటు చేసి నేరుగా కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి ఉన్నారు. ఏదైనా తప్పు జరుగుతున్నట్టో… అనుమానం వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ లను ఉపయోగిస్తారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి జన సంచారం, భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ లోపాలు సవరించుకుంటూ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ మొత్తం కార్యక్రమంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించనున్నాయి.