మరో రెండు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఏపీలో జిల్లాల విభజన, కొత్త జిల్లాలకు పేర్లు, కొత్త జిల్లాలకు కేంద్రాల విషయం మరోసారి చర్చకు వస్తోంది. 2014 రాష్ట్ర విభజన తర్వాత.. 13 జిల్లాలుగా ఉన్న ఏపీని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మరిన్ని జిల్లాలుగా మార్చింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామని ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు.. మరో 13 జిల్లాలను ఏర్పాటు చేశారు. వాస్తవానికి 25 పార్లమెంటు స్థానాలే ఉన్నాయి. అయితే అరకు.. పెద్ద నియోజకవర్గం కావడంతో దీనిని రెండుగా విభజించారు. దీంతో మొత్తంగా 26 జిల్లాలు ఏర్పడ్డాయి. ఇది ఒక సంచలనంగా అప్పట్లో వైసీపీ ప్రచారం చేసుకుంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనూ.. దీనినే ప్రచారం చేసుకుంటోంది. వైసీపీ వచ్చిన తర్వాతే.. కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేశామని.. దీంతో ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య దూరం తగ్గిందని.. పాలన ప్రజలకు చేరువైందని వైసీపీ నాయకులు చెబుతున్నారు.
ఇంతవరకు బాగానే ఉంది. అయితే.. ఇదేసమయంలో కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి. ఇవి ఎన్నికలపై ఎంత వరకు ప్రభావం చూపుతాయనేది కూడా.. వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను విభజించి ఏర్పాటు చేసిన ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలనేది కాపు సామాజిక వర్గం డిమాండ్‌గా ఉంది. అప్పట్లోనూ వీరు ఉద్యమించారు. కానీ, వైసీపీ పట్టించుకోలేదు. కానీ, టీడీపీ అదినేత చంద్రబాబు నిర్వహించిన బాదుడే -బాదుడు సభల్లో ఈ డిమాండ్‌పై స్పందిస్తూ.. తాము అధికారంలోకి వచ్చాక.. పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఈ వర్గం.. ఈ విషయాన్ని తరచుగా ప్రస్తావిస్తూనే ఉంది. ఇక, తూర్పుగోదావరి జిల్లాను విభజిస్తూ.. కొత్తగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును పెట్టారు.
ఈ క్రమంలో ఓ కీలక సామాజిక వర్గం యువత రెచ్చిపోయి.. దాడులు, విధ్వంసాలకు దిగింది. ఏకంగా మంత్రి ఇంటికే నిప్పు పెట్టింది. ఎమ్మెల్యే ఇల్లు, పోలీస్ స్టేషన్ కు కూడా నిప్పు పెట్టి విధ్వంసాలకు దిగింది. ఈ కేసులను ఇటీవలే వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే.. ఇలా ఓ కీలక సామాజిక వర్గానికి మేలు చేస్తూ.. సర్కారు తీసుకున్న నిర్ణయంపై మెజారిటీ ఎస్సీ నాయకులు, ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ఈ ప్రభావం కూడా.. వచ్చే ఎన్నికల్లో వైసీపీపై పడుతుందనే అంచనా కనిపిస్తోంది. అదేవిధంగా ఉమ్మడి గుంటూరును విభజించి.. పల్నాడు జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ జిల్లాలోనిమెజారిటీ ఎస్సీ సామాజిక వర్గం మాత్రం.. జిల్లాకు.. కవి జాషువా( పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ ఉద్యమాలు చేశారు. లేకపోతే.. బ్రహ్మనాయుడు పేరు పెట్టాలని కొందరు సూచించారు. తాజాగా ఈ విషయాలు మరోసారి చర్చకు వచ్చాయి.
ఇక, రాయచోటి కేంద్రంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు…. రాజంపేట ను కేంద్రంగా చేయాలని ఇక్కడి వారు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేశారు. ఎమ్మెల్యే కుటుంబం సభ్యులు సైతం ఈఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎన్నికల ముంగిట ఈ విషయం కూడా చర్చగా మారింది. మొత్తంగా చూస్తే.. వైసీపీకి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామన్న పేరు ఉన్నా.. అంతర్గత వ్యతిరేకతతో ఇక్కడ ఎన్నికలు ప్రభావితం అవుతాయనే చర్చ సాగుతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.