guntur-poli
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

గుంటూరులో గరం…గరం

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అధికార వైసీపీ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రతిపక్ష పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది. అధికార పార్టీ మైనార్టీ అభ్యర్థి నూరి ఫాతిమా ప్రచారంలో ముందున్నారు. కాగా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ టికెట్ ఎవరికి? అన్నది మాత్రం ఇంతవరకు తేలలేదు.గుంటూరు జిల్లాలోని ప్రతిష్టాత్మక నియోజకవర్గాలలో గుంటూరు తూర్పు ఒకటి. ఎప్పటి నుంచో ఇక్కడ ముస్లిం మైనార్టీలు పోటీ పడుతున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థి ముస్తఫా గెలిచారు. ఈసారి ఆయన తప్పుకుని తన కూతురు నూరి ఫాతిమాకు టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో పార్టీలోని అసమ్మతి వర్గం కూడా వెనుకడుగు వేసింది. దీంతో ఫాతిమా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. అందరినీ కలుపుకుని ప్రచారానికి నడుంకట్టారు. ఇది ఇలా ఉంటే.. ఫాతిమాపై ఎవరిని పోటీకి దింపాలి అనేదానిపై ప్రతిపక్ష టీడీపీలో ఇంకా స్పష్టత రాలేదు.

1994, 1999 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ విజయం సాధించింది. టీడీపీ సీనియర్ నేత లాల్ జాన్ భాషా తమ్ముడు జియావుద్దీన్ ఇక్కడి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2004 నుంచి గెలుపు కోసం టీడీపీ తంటాలు పడుతున్నా ఫలితం దక్కడం లేదు. 2004లో నంబూరి సుబానీ, 2009లో మస్తాన్ వలీ కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో ముస్తఫా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో అప్పటివరకు వైసీపీలో ఉన్న నసీర్ అహ్మద్ ను టీడీపీలో చేర్చుకుని బరిలోకి దింపినా ఫలితం లేకపోయింది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు తిరిగి టికెట్ దక్కటం కష్టమే అని టీడీపీ వాళ్లే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో ముస్లిమేతర అభ్యర్థిని బరిలోకి దించుతారనే ప్రచారం జరుగుతోంది.టీడీపీ తరపున తనకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే గుంటూరు అర్బన్ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ చంద్రబాబును అడిగారు. ఆయన సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. పార్టీలో పలు పదవులను నిర్వహించారు. కాపు సామాజికవర్గానికి చెందిన ఆయనకు మంచి అనుచరగుణం ఉంది. ఫార్మా రంగంతో పాటు ఆయనకు ఆసుపత్రులు కూడా ఉన్నాయి.

2014లోనూ టీడీపీ వైశ్య సామాజికవర్గానికి చెందిన మద్దాలి గిరిని బరిలోకి దింపింది. గట్టి పోటీ ఇచ్చిన గిరి కొద్ది ఓట్ల తేడాతో ముస్తఫా చేతిలో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండటంతో పాటు ప్రభుత్వంపై వ్యతిరేక ఓటు కలిసి వస్తుందన్న ఆశతో టీడీపీ ఉంది. దీంతో ముస్లిమేతర అభ్యర్థి అయినా గుంటూరు తూర్పు నుంచి గెలుపొందుతారన్న ఆలోచనలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి.ఈ క్రమంలోనే టీడీపీ అధిష్టానంపైన డేగల ప్రభాకర్ ఒత్తిడి పెంచుతున్నారు. ఆర్థిక దండు కూడా బాగానే ఉండటంతో తాను గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నట్లు ప్రభాకర్ వాదిస్తున్నారు. ఇతర నియోజకవర్గాల్లో ముస్లింలకు టికెట్ ఇచ్చి గుంటూరు తూర్పులో మాత్రం ముస్లిమేతరుడైన తనకు టికెట్ ఇవ్వాలంటున్నారు. అయితే, అధిష్టానం మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. మరోపక్క టీడీపీ అభ్యర్థి ఖరారయ్యే లోపే వైసీపీ అభ్యర్థిని ఫాతిమా తొలి విడత ప్రచారం ముగిసేలా ఉంది.