వైసీపీలో మంత్రి రోజాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది. ఆమెను సొంత పార్టీ శ్రేణులు టార్గెట్ చేసుకుంటున్నాయి. సరిగ్గా ఎన్నికల ముంగిట తమ స్వరం వినిపిస్తున్నారు. ఏకకాలంలో ముప్పేట దాడి చేస్తుండడంతో.. రోజా వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఆమెకు టికెట్ లేదన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. కానీ తనకు టికెట్ తప్పకుండా లభిస్తుంది అన్న ధీమాతో రోజా ఉన్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే రోజాను టార్గెట్ చేసుకొని నగిరి నియోజకవర్గ వైసిపి ప్రజాప్రతినిధులు తీవ్ర ఆరోపణలు చేస్తుండడం సంచలనం కలిగిస్తోంది. ఇదంతా రోజాకు టిక్కెట్ ఎగ్గొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నమని ప్రచారం జరుగుతోంది.పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన ఓ మహిళా దళిత కౌన్సిలర్ తిరుపతిలో రోజాకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని డబ్బులు తీసుకున్నారని.. కానీ రోజా ఇవ్వలేకపోయారని ఆరోపణలు చేశారు. కనీసం తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వీటికి సంబంధించిన కొన్ని వీడియోలను సైతం ప్రదర్శించడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు చిత్తూరు జడ్పీ సమావేశంలో నగిరి నియోజకవర్గానికి చెందిన జడ్పిటిసిలు మంత్రి రోజా తీరుపై మండిపడ్డారు. అభివృద్ధి పనులకు సంబంధించి సహకరించడం లేదని ఆరోపణలు చేశారు. ఆమెకు మరోసారి నగిరి టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని కూడా ఛాలెంజ్ చేశారు.వాస్తవానికి మంత్రి రోజా వ్యవహార శైలి సొంత పార్టీ శ్రేణులకే మింగుడు పడడం లేదు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల ప్రజా ప్రతినిధులతో ఆమెకు గిట్టడం లేదు. నియోజకవర్గంలోని ఏ ఒక్క నేతతో ఆమెకు సంబంధాలు ఉండవు. దీంతో ఆమె అభ్యర్థిత్వాన్ని ఎక్కువ మంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. పైగా అసమ్మతి నేతలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోత్సాహం ఉంది. చాలామంది రోజాతో పని లేకుండానే మంత్రి పెద్దిరెడ్డితో పనులు చేయించుకుంటున్నారు.
పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి తాజాగా ఆర్కే రోజాపై తీవ్ర ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం రోజా డబ్బు డిమాండ్ చేశారని ఆరోపించారు. రోజా తనను రూ.70 లక్షలు డిమాండ్ చేశారని.. చివరికి తాను రూ.40 లక్షలు ఇచ్చానని ఆరోపించారు. మంత్రి రోజా సోదరుడు కుమారస్వామి రెడ్డి పంపించిన వ్యక్తికి తాను మూడు విడతల్లో రూ.40 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఆఖరికి మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇవ్వకపోగా.. డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని భువనేశ్వరి ఆరోపించారు.మరోవైపు, చిత్తూరు ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అనంతరం వడమాల పేట, నిండ్ర జడ్పీటీసీలు మురళీధర్ రెడ్డి, మల్లేశ్వరి మంగళవారం మీడియాతో మాట్లాడారు. మంత్రి రోజా గురించి చెబుతూ తమ ఆవేదనను వెలిబుచ్చారు. కక్ష సాధింపుతో రోజా తమను ఇబ్బందులకు గురి చేశారని.. ఆఖరికి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనులకు కేటాయించిన జడ్పీ నిధులకు రోజా ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా చేస్తున్నారని అన్నారు. భవనాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు జడ్పీటీసీలకు ప్రత్యేక గదులు కేటాయించలేదని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమకు జరుగుతున్న అన్యాయాలపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఛైర్మన్‌ను నిలదీశామని వడమాల పేట, నిండ్ర జడ్పీటీసీలు జడ్పీటీసీలు మాట్లాడారు.సరిగ్గా వైసిపిలో అభ్యర్థులను మార్చుతున్న క్రమంలోనే రోజాను టార్గెట్ చేసుకుంటూ నగిరి వైసీపీ ప్రజాప్రతినిధులు రచ్చ చేస్తుండడం విశేషం. గత ఎన్నికల్లో సైతం ఆమె స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు. ఈసారి మాత్రం ఆమెకు ఓటమి తప్పదని సంకేతాలు వస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో సొంత పార్టీ శ్రేణులు సైతం హెచ్చరిస్తుండడంతో హై కమాండ్ పునరాలోచనలో పడే అవకాశం ఉంది. నగిరి నియోజకవర్గ టికెట్ ఎట్టి పరిస్థితుల్లో రోజాకు దక్కదని వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. కానీ రోజా మాత్రం జగన్ పై విధేయత కనబరుస్తూనే తప్పకుండా తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి అధినేత జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.