mrg registrat
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

కొత్తగా వివాహం చేసుకునే వారికి ప్రభుత్వం షాక్

ఏపీలో కొత్తగా వివాహం చేసుకునే వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వివాహాల నమోదుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచింది. వివాహ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 ఉండగా.. దానిని ఇప్పుడు రూ.500కు పెంచారు. దంపతుల అభ్యర్థనతో కార్యాలయం బయట జరిగే వివాహ వేదిక దగ్గరకు సబ్ రిజిస్టార్ వస్తే.. ఇప్పటివరకు ఉన్న రూ.210 ఫీజును రూ. 5 వేలకు పెంచారు. వివాహాల రికార్డు పరిశీలనకు రూపాయి గా ఉన్న ఫీజును రూ.100కు పెంచారు. సెలవు రోజుల్లో వివాహాల నమోదుకు రూ.5 వేలకు పెంచారు.1955 హిందూ వివాహ రిజిస్ట్రేషన్ చట్టానికి సంబంధించి 1965 మార్చిలో జారీచేసిన ఫీజులను.. ఇటీవల సవరించిన వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజుల విషయంలో కఠినంగా వ్యవహరించిన సర్కార్.. వివాహ రిజిస్ట్రేషన్ ను మరింత సులభతరం చేయనుంది. ఆన్ లైన్ నమోదు ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఆన్ లైన్ వివాహ రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలో పూర్తిస్థాయిలో ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో మాన్యువల్ విధానంలో వివాహాల నమోదు ప్రక్రియ జరిగేది.

ఇప్పుడు ఆన్ లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభించనుండడంతో వివాహ రిజిస్ట్రేషన్ నమోదు సేవలు సులభతరం కానున్నాయి.www.regestrations.ap.gov.in లో హిందూ వివాహాలు, ప్రత్యేక వివాహాలు అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. అందులో హిందూ వివాహమైతే దానిపై క్లిక్ చేసి మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ద్వారా ఓటిపితో లాగిన్ కావచ్చు. అనంతరం ఆన్ లైన్ లోనే ఫామ్ ను పూర్తి చేసి, ఆధార్ కార్డులు, పెళ్లి ఫోటోలు, పదో తరగతి సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత రిజిస్టార్ ఆఫీస్ కి వెళ్లేందుకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సిఎఫ్ఎంఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్ లైన్ లో చలానా ద్వారా కట్టే అవకాశం కూడా కల్పించారు. ఆ తర్వాత ఆన్ లైన్ లో నమోదు చేసిన దరఖాస్తును సబ్ రిజిస్టార్ కు అందిస్తే ఆయన దాన్ని పరిశీలిస్తారు.

సాక్షులతో సంతకాలు పెట్టించుకుని వెంటనే సర్టిఫికెట్ ను జారీ చేస్తారు. ఇటీవల రేషన్ కార్డులతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడంతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ కారణాల దృష్ట్యా వివాహ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపుతో పాటు సేవలను సైతం ప్రభుత్వం సరళీకృతం చేసింది. అయితే ఫీజులను భారీ స్థాయిలో పెంచడం విమర్శలకు తావిస్తోంది.