ktr-tweet
తెలంగాణ రాజకీయం

కేటీఆర్ ట్వీట్ వైరల్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్  ట్విట్టర్ వేదికగా శుక్రవారం సంచలన పోస్ట్ చేశారు. ‘పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారు’ అనే క్యాప్షన్ పెట్టి.. సుమతి శతకంలో బద్దెన రాసిన ‘కనకపు సింహాసనమున శునకమును గూర్చుండబెట్టిన శుభ లగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణ మేలమాను? వినురా సుమతీ’ అనే పద్యాన్ని షేర్ చేశారు. అయితే, ఇందులో ఎవరి పేరును ప్రస్తావించలేదు. ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా.. సీఎం రేవంత్ రెడ్డి గురువారం బూత్ లెవల్ కన్వీనర్ల సదస్సులో చేసిన కామెంట్స్ కు కౌంటర్ గానే ఇలా పోస్ట్ చేసినట్లు నెట్టింట చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో దీనిపై కామెంట్స్ చేస్తున్నారు.కాగా, హైదరాబాద్ తెలంగాణ భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చినా అసహనంతోనే ఉన్నారని ఎద్దేవా చేశారు.

ఇప్పటికీ మేమే అధికారంలో ఉన్నామని వారు చెబుతున్నారని తెలిపారు. మేం అధికారంలో ఉన్నట్లుగా.. కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నట్లుగా వారు భావిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీల గవర్నర్ కోటాలో గవర్నర్ నిర్ణయం కాంగ్రెస్, బీజేపీలను ఉలిక్కి పడేలా చేసిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ఇచ్చిన కాంగ్రెస్ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అన్నీ అమలయ్యేంత వరకూ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.అయితే, గత కొద్ది రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీల నేతలు పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా, ‘గుంపు మేస్త్రీ’ అంటూ తనను సంభోదించడంపై సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. తాను తెలంగాణను ‘పునఃనిర్మించే మేస్త్రీ’ని అంటూ వ్యాఖ్యానించారు.

‘ఘోరీ కడతాం.. త్వరలోనే ఇంద్రవెల్లి సభకు వస్తా’ అంటూ సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలపైనా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎంకు కౌంటర్ ఇచ్చారు.రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగంపైనా కేటీఆర్ అభ్యంతరం తెలిపారు. గవర్నర్ పక్షపాత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను గత ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే రాజకీయ సంబంధ కారణాల పేరుతో వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారని విమర్శించారు. కానీ, ఇప్పుడు ఓ రాజకీయ పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాంను ఎలా ఆమోదిస్తున్నారని ప్రశ్నించారు. గవర్నర్.. సీఎం రేవంత్ రెడ్డికి బాధ్యులు కాదని, రాష్ట్ర ప్రజలకు బాధ్యులనే విషయం గుర్తించుకోవాలని హితవు పలికారు. ఈ నామినేషన్ల అంగీకారం కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని తెలియజేస్తుందని మండిపడ్డారు. అలాగే, ప్రజల తరఫున ఎన్నికైన సర్పంచుల పదవీ కాలం పొడిగించాలని.. ప్రత్యేక ఇంఛార్జీలను పెట్టొద్దని కేటీఆర్ డిమాండ్ చేశారు.