koneti adimulam
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

టీడీపీ గూటికి మరో ఎమ్మెల్యే

 వైసీపీకి మరో ఎమ్మెల్యే ఝలక్ ఇచ్చారు. ఎమ్మెల్యేను తప్పించి ఎంపీగా అవకాశం ఇచ్చినా సదరు నేత పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇస్తే ఎమ్మెల్యేఅవకాశం ఇవ్వండి.. లేకుంటే తన దారి తాను చూసుకుంటానని హెచ్చరికలు పంపారు. ఇప్పుడు అనుకున్నంత పని చేశారు. ఎంపీగా అవకాశం ఇచ్చినా తనకు వద్దంటూ టిడిపిలో చేరేందుకు సిద్ధపడ్డారు. దీంతో అధికార వైసిపికి చుక్కెదురు అయ్యింది. ఎంపీగా అవకాశం ఇచ్చినా సదరు నేత మొగ్గు చూపకపోవడంతో వైసిపి నాయకత్వం తల పట్టుకుంటుంది. మొన్న గుమ్మనూరు జయరాం ఇలా చేస్తే.. తాజాగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వైసిపి అగ్రనాయకత్వానికి ఝలక్ ఇచ్చారు.
సత్యవేడు ఎమ్మెల్యేగా ఆదిమూలం ఉన్నారు. ఈసారి ఆయనకు తప్పించారు. ఆయన స్థానంలో తిరుపతి ఎంపీ గురుమూర్తికి అవకాశం ఇచ్చారు. ఎంపీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలంను ఎంపిక చేశారు. అయితే తాను ఎంపీగా వెళ్ళనంటూ ఆదిమూలం తేల్చి చెప్పారు. అయినా సరే వెళ్లాల్సిందేనంటూ హై కమాండ్ తేల్చి చెప్పింది. అయితే తన మార్పునకు మంత్రి పెద్దిరెడ్డి కారణమంటూ ఆదిమూలం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఆధిపత్యం కొనసాగుతోందని.. పేరుకే తాము ఎమ్మెల్యేలం కానీ.. పెత్తనం పెద్దిరెడ్డిదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సైకిల్ పై తిరిగే పెద్దిరెడ్డి ఈ స్థాయికి ఎలా వచ్చారో అందరికీ తెలుసునని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కోనేటి ఆదిమూలం వైసీపీలో కొనసాగరని తేలిపోయింది.సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సడన్ గా హైదరాబాదులో ప్రత్యక్షమయ్యారు. కుమారుడుతో కలిసి నారా లోకేష్ ను కలుసుకున్నారు. ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టిడిపిలోకి మారే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.

లోకేష్ తో బేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా ఆదిమూలం మనస్తాపంతో ఉన్నారు. వైసీపీలో ఎంతో నమ్మకంగా పనిచేస్తే.. రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి వైసిపి తిరుపతి ఎంపీ సీటును ఆఫర్ చేసినా ఆదిమూలం తిరస్కరించారు. సత్యవేడు నియోజకవర్గంలో తాను బాగానే పనిచేశానని.. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒత్తిడితోనే తనను మార్చుతున్నారని ఆదిమూలం అనుమానిస్తున్నారు. అందుకే తిరుపతి పార్లమెంట్ స్థానానికి వెళ్లేది లేదని అధిష్టానానికి తేల్చి చెప్పారు. మరోవైపు ఆదిమూలం తీరుపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆయన తెలుగుదేశం నేతలతో ముందుగానే మాట్లాడుకున్నారని.. అందుకే ఎంపీ సీటును వదులుకున్నారని చెబుతున్నారు. అయితే టిడిపి సత్యవేడు అసెంబ్లీ సీటు ఇస్తుందా? లేకుంటే ప్రత్యామ్నాయ అవకాశాలు చూపుతోందా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.