తిరుమల శ్రీవారి దర్శనం ప్రతి ఒక్క హిందువుకు ఎంతో ముఖ్యం. పుట్టిన రోజు నాడు అయినా .. జీవితంలో ఏదైనా సాధించిన రోజు అయినా.. దూర ప్రాంతంలో ఉండి సొంత రాష్ట్రానికి వచ్చినా ముందుగా శ్రీవారి దర్శనం చేసుకోవాలని అనుకుంటారు.అందుకే తిరుమల కొండలపై ఎప్పుడూ విపరీతమైన రద్దీ ఉంటుంది. 300 దర్శనం టిక్కెట్లను మూడు నెలల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వీఐపీ దర్శన టిక్కెట్లకు అయితే రాజకీయ నేతల సిఫారసు లేఖలు అవసరం. అయితే రాజకీయ నేతల సిఫారసు లేఖలు అవసరం లేకుండానే శ్రీవారి పథకం ద్వారా వీఐపీ దర్శన టిక్కెట్లు కొనుగోలు చేసే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఎయిర్ పోర్టునూ ఈ ఫెసిలిటీ ఉంది. రేణిగుంట విమానాశ్రయంలో దిగిన వెంటనే శ్రీవాణి టిక్కెట్లు కొనుగోలు చేసి వీఐపీ దర్శనానికి వెళ్లవచ్చు. ఇప్పటి వరకూ ఉన్న శ్రీవాణి టికెట్ల సంఖ్య పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. రేణిగుంట విమానాశ్రయంలో ప్రతిరోజూ జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల సంఖ్యను టీటీడీ 100 నుండి 200 కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో మాత్రమే ఈ ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేస్తారు. అలాగే తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపు ఉన్న శ్రీవాణి టికెట్ కౌంటర్ లో ఆఫ్ లైన్ లో జారీ చేస్తున్న టికెట్ల సంఖ్యను 900 నుండి 800 కు తగ్గించారు. మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఈ టికెట్లను జారీ చేస్తారు. అంటే రోజుకు వెయ్యి మంది వరకూ వీఐపీ దర్శనం చేసుకోవచ్చు. ఈ దర్శనం టిక్కెట్ రూ. 10వేలు ఉంటుంది. ఇప్పటి వరకూ శ్రీవాణి ట్రస్ట్ కు పదివేలు విరాళం ఇచ్చే వారికి రూ. 500 కలిపి మొత్తం పదివేల ఐదు వందలకు ఈ టిక్కెట్ ఇస్తున్నారు. నిధులన్నీ శ్రీవారి ట్రస్టుకు వెళ్లేవి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రూల్స్ మార్చారు. తిరుమలలో కొత్త టీటీడీ బోర్డు ఏర్పడిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుటున్నారు. ఈ క్రమంలో రాజకీయ నేతల వద్దకు వెళ్లడం కన్నా ఇలా శ్రీవాణి టిక్కెట్లు కొనుగోలు చేయడం మంచిదని భావించే వారి కోసం ఈ ఏర్పాటు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వీఐపీ టిక్కెట్ల పేరుతో రాజకీయ నేతలు టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
మాస్టర్ ప్లాన్ కు అనుగణంగా లేని అభివృద్ధి
టీటీడీ మాస్టర్ ప్లాన్ 2019లో రూపొందించినా దానికి అనుగుణంగా అభివృద్ధి పనులు, నిర్మాణాలు జరగలేదని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. చారిత్రాత్మక చరిత్ర ఉట్టిపడేలా నిర్మాణాలు జరగడం లేదని అభిప్రాయపడ్డారు. పవిత్రత అనేది లేకుండా భవన నిర్మాణాలు చేశారని, తిరుమలలో కట్టిన నిర్మాణాలు సొంత పేర్లు ఉండకూడదని స్పష్టం చేశారు.తిరుమలలో పలువురు ప్రైవేట్ వ్యక్తులకు టీటీడీ భూమి కేటాయించడం ద్వారా స్వామి వారి భక్తుల కోసం వసతి గృహాలను నిర్మించి వాటిని టీటీడీకి అప్పగించే పద్థతి ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలో కొందరు టీటీడీ కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపట్టి వాటికి సొంత పేర్లను పెట్టుకోవడాన్ని గుర్తించారు. అలాంటి నిర్మాణాలకు టీటీడీ నుండి కొన్ని పేర్లు ఇస్తామని అవే పేర్లను ఆయా గెస్ట్ హౌస్‌లకు పెట్టుకోవాలని ఈవో స్పష్టం చేశారు. తిరుమలలో కట్టే టౌన్ ప్లానింగ్ ప్రకారం నిర్మించాలని, ఎలాంటి ప్లానింగ్ లేకుండా తిరుమలలో నిర్మాణాలు కట్టేశారని, సరైన నిబంధనలు లేకుండా కట్టినవారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తిరుమలలో నూతన టౌన్ ప్లాన్ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. వచ్చే 25 సంవత్సరాలకు సంబంధించిన విజన్ డాక్యుమెంటరీ తయారు చేస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు. తిరుమలలో మల్టిలెవల్, స్మార్ట్ పార్కింగ్, పుట్ పాత్ లు నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. బాలాజీ బస్టాండ్‌ను వేరేచోటకు తరలించాల్సి ఉందన్నారు.