galla family
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పాలిటిక్స్ నుంచి గల్లా ఫ్యామిలీ దూరం

దాదాపు 5 దశాబ్దాలకు పైగానే చిత్తూరు జిల్లా పాలిటిక్స్ లో కీలకంగా వ్యవహరించిన గల్లా ఫ్యామిలీ 2024 సార్వత్రిక ఎన్నికలకు ఎందుకు దూరమైంది. రాజగోపాల్ నాయుడు నుంచి గల్లా జయదేవ్ వరకు సాగిన పొలిటికల్ ప్రయాణం ఎందుకు అర్థంతరంగా ఆగింది. అసలు గల్లా ఫ్యామిలీ ఆంతర్యమేంటి..? ఇదే ఇప్పుడు గల్లా కుటుంబం అనుచరుల్లో, జిల్లా ప్రజల్లో ఆసక్తికర చర్చ అయ్యింది. దశాబ్దాలకు పైగా రాజకీయ చరిత్ర కలిగిన గల్లా కుటుంబం రాజకీయాలకు దూరం కావడమే పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనంగా మారింది.ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన గల్లా ఫ్యామిలీ పాటూరు రాజగోపాల్ నాయుడు నుంచి గల్లా జయదేవ్ వరకు సాగింది. మాజీ ఎంపీ రాజగోపాల్ నాయుడు నుంచి రాజకీయ వారసత్వాన్ని అందుకున్న కూతురు గల్లా అరుణ కుమారి ఆ తరువాత కొడుకు జయదేవ్ కు భాద్యతలు అప్పగించింది. రాయలసీమ పాలిటిక్స్ లో రాణించిన గల్లా అరుణ కుమారి నుంచి పొలిటికల్ ఓనమాలు నేర్చుకున్న గల్లా జయదేవ్ ఆంధ్రా ప్రాంతంలో పాలిటిక్స్ లో సక్సెస్ అయ్యారు.

2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి నుంచి బరిలో దిగి గుంటూరు ఎంపీగా గెలుపొందారు. ఇలా 5 ధశాబ్దాలకు పైగా రాజకీయం చేసిన మూడు తరాల కుటుంబం ఇప్పుడు పాలిటిక్స్ కే గుడ్ బై చెప్పడం ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది.రూ. వేల కోట్ల ఆస్తులతోపాటు రాజకీయాల్లో రాణించే సత్తా ఉన్న ఫ్యామిలీ నో పాలిటిక్స్ అంటోంది. ఈ నిర్ణయమే కేడర్ లోనూ పెను దుమారమైంది. రాజకీయాలకు ఇక సెలవని ప్రకటించిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ప్రకటన ఆ పార్టీకే కాదు అనుచర గణాన్ని నివ్వెరపరిచేలా చేసింది. గల్లా జయదేవ్ తల్లి మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి సైతం 2014 ఎన్నికల్లో ఓటమి తరువాత దాదాపు దూరంగానే ఉండిపోయారు. కొన్నేళ్లుగా రాజకీయాలకే డిస్టెన్స్ పాటిస్తున్న గల్లా అరుణ ఇప్పుడు కొడుకు నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేశారని తెలుస్తోంది.1955లో పాటూరు రాజగోపాల్ నాయుడు ఎమ్మెల్యేగా రాజకీయాల్లోకి వచ్చిన కుటుంబం సుదీర్ఘ రాజకీయమే చేసింది. ఎన్ జీ రంగా సహచరుడుగా పాటూరు రాజగోపాల్ నాయుడు 1950 ఆ మద్య కాలంలో రాజకీయాల్లో అడుగుపెట్టి రాణించాడు.

చిత్తూరు జిల్లాలోని తవణంపల్లె నియోజకవర్గం నుంచి 1955లో కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థిగా, 1962లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు పాటూరు రాజగోపాల్ నాయుడు. 1972లో శాసన మండలి సభ్యుడుగా పనిచేశారు. అలాగే చిత్తూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి 1977లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 1980లో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు రాజగోపాల్ నాయుడు. జిల్లాలో అనేక సామాజిక కార్యక్రమాలతో జనం లో నిలిచిన రాజగోపాల్ నాయుడును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా తన రాజకీయ గురువుగా చెప్పుకుంటారు.రాజగోపాల నాయుడు రాజకీయ వారసురాలిగా గల్లా అరుణకుమారి దాదాపు 35 ఏళ్ల క్రితం రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1989 లో తొలిసారిగా చంద్రగిరి నుంచి శాసనసభలో అడుగుపెట్టారు. నాలుగు సార్లు గల్లా అరుణ చంద్రగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించి, రెండుసార్లు ఓటమి చెందింది. వై ఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల హయంలో మంత్రి కూడా పనిచేశారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌కు దూరమై టీడీపీలో చేరిన అరుణ కుమారి చంద్రగిరి నుంచి పోటీ చేసి, 2014లో ఓటమిని చవిచూశారు.

అదే ఎన్నికల్లో కొడుకు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.గుంటూరు పార్లమెంటుకు పోటీ చేసిన గల్లా జయదేవ్ ఎంపీగా లోక్ సభలో అడుగు పెట్టారు. 2019 ఎన్నికల్లోనూ జయదేవ్ గెలవగా ఆ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా రాజకీయాలకు దూరంగా ఉండిపోయిన గల్లా అరుణకుమారి ఆ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమయ్యారు. అయితే వరుసగా రెండుసార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన జయదేవ్ మూడోసారి పోటీకి చేయడానికి సుముఖత చూపకపొగా ఏకంగా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తండ్రి, ప్రముఖ పారిశ్రామిక వేత్త గల్లా రామచంద్ర నాయుడుకు రిటైర్మెంట్ ఇచ్చిన అమరరాజా కంపెనీ కోసం పూర్తి స్థాయిలో పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాజకీయాలకు వీడ్కోలు పలికారు.గల్లా కుటుంబం రాజకీయాలకు గుడ్ బై చెప్పడం వెనుక రాజకీయ కారణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక గల్లా కుటుంబానికి చెందిన అమరరాజా సంస్థ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రూ. వేలకోట్ల టర్నోవర్ కలిగిన సంస్థకు ప్రభుత్వం నుంచి చిక్కులు ఎదురు కావడం గల్లా కుటుంబాన్ని బాధించింది.

టీడీపీ ఎంపీగా పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీని ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’ అంటూ చేసిన స్పీచ్‌లు కూడా ఒక కారణమే అన్న చర్చ నడుస్తోంది. సంస్థ మనుగడ, విస్తరణ కు రాజకీయాలు అడ్డంకి కాకూడదని భావించిన జయదేవ్ రాజకీయాలకు దూరంగా ఉందాలన్న నిర్ణయాన్ని ప్రకటించారని తెలుస్తోంది. పలు పారిశ్రామిక దిగ్గజాలు రాజకీయాలకు దూరంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్న జయదేవ్, ఇకపై నో పాలిటిక్స్ అని తేల్చి చెప్పారు. రాజకీయ ఇబ్బందులు, ఒత్తిళ్లు తో పాటు సొంత వ్యాపారాల కోసం రాణించిన పాలిటిక్స్ ను కాదనుకుంది గల్లా ఫ్యామిలీ.మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో 5 దశాబ్దాలకు పైగా క్రియాశీలక పాత్ర పోషించిన గల్లా కుటుంబం రాజకీయాలకు దూరమైనా అనుచ గణం మాత్రం రాజకీయంగా రాణించేందుకు గల్లా కుటుంబం ఆశీస్సుల కోసం తాపత్రయపడుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలోని పొలిటికల్‌గా ఎదిగేందుకు గల్లా ఫ్యామిలీ సపోర్టును ఆశిస్తోంది. రాబోయే ఎన్నికల్లో టికెట్స్ కోసం ప్రయత్నిస్తున్న ఆశావాహులు పొలిటికల్ గా సైలెన్స్ ను పాటిస్తున్న గల్లా ఫ్యామిలీ అండదండల కోసం ఆశపడుతుండగా గల్లా ఫ్యామిలీ అంతర్యమెంటో మాత్రం అర్థం కాకపోతోంది. మిలియన్ డాలర్స్ ప్రశ్నగా కేడర్ లో మిగిలిపోయింది..!