t-cong
తెలంగాణ రాజకీయం

టీ కాంగ్రెస్  టిక్కెట్లకు ఫుల్ డిమాండ్

పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధమయింది. జాతీయ  పార్టీకి అవసరమైన లోక్ సభ సీట్లను అంచనాలకు తగ్గట్లుగా అందించి  హైకమాండ్ వద్ద మరింత నమ్మకం  పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో పది కంటే ఎక్కువ స్థానాలు గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఊహించని స్థాయిలో బలపడుతుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మఖ్య నేతలంతా  లోక్‌సభ సీట్లలో గెలుపును అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకుంటున్నారు.  2024 లోక్‌సభ ఎన్నికలు మునుపెన్నడూ లేనంత ఉత్కంఠగా జరగబోతున్నాయి.  ఫిబ్రవరి నెలాఖరు, మార్చి ప్రారంభంలో ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని అంతా అను కుంటున్నారు. తెలంగాణపై ఈ సారి కాంగ్రెస్ కేంద్ర పార్టీ గట్టి ఆశలు పెట్టుకుంది. కనీసం పది లోక్ సభ సీట్లు తెలంగాణ నుంచి దక్కుతాయని ఆశిస్తున్నారు.  

తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. ఈ దిశగా తమ టార్గెట్ ను నిర్ణయించుకున్నారు. బలమైన అభ్యర్థుల ఎంపిక చేయాలని అనుకుంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీలకు అభ్యర్థుల విషయంలో సమస్యలు ఉన్నాయి. కానీ ఆ పార్టీల్లో ఉన్న వారు కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తే .. పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే బలమైన అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఇవ్వాలని ఈ విషయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించిన స్ట్రాటజీనే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో సునీల్ కనుగోలు టీం ప్రత్యేకమైన నివేదికలు రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఏఐసీసీ స్ట్రాటజిస్టు సునీల్ కనుగోలు సర్వే ఆధారంగానే సీట్లను ఎంపిక చేస్తున్నారు.. అయితే   టీపీసీసీ, ఏఐసీసీ సమన్వయంతో ఓ జాబితాను తయారు చేస్తున్నారు. దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత టీ పీసీసీ కమిటీ స్క్రీనింగ్ చేస్తుంది.  సీఎం రేవంత్ రెడ్డి కూడా అభ్యర్తుల అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.  ఇటీవల ఎమ్మెల్యే టికెట్లు పొందలేని నేతలతో పాటు పోటీ చేసి ఓడిపోయినోళ్లు, కాంగ్రెస్ పార్టీలో మొదట్నుంచి పనిచేస్తున్న నేతలంతా ఎంపీ టికెట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

కొందరు సీఎం, మంత్రుల చుట్టూ టికెట్ల కోసం తిరుగుతుంటే, మరికొందరు ఏకంగా ఢిల్లీలోనే మకాం వేసి తమ దైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్‌లో ఉన్నందున ఈసారి ఎంపీ టికెట్లకు ఎక్కువ పోటీ నెలకొన్నది. 17 ఎంపీ సీట్లు ఉండగా  హైదరాబాద్ విషయంలో ఆశలు పెట్టుకునే అవకాశం లేదు. ఆదిలాబాద్ కూడా ఆశల్లేని నియోజకవర్గంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి భారీ తేడా రావడంతో రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.   ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు.  ఇంద్రవెల్లి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించిన ఆయన సీఎం అయిన తర్వాత కూడా తొలి సభను అక్కడే నిర్వహించబోతున్నారు.

ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతి వనానికి శంఖుస్థాపన చేయనున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలి సభ కావడం పార్లమెంట్ ఎన్నికల సన్నాహాకం కావడంతో  అందరి దృష్టి ఉంది. ఈ సభ తర్వాత  ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ రేసులోకి వస్తుుందని నమ్ముతున్నారు. మొత్తంగా 10 నుంచి 12 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఏ జిల్లాల్లో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలిచాం..? పార్టీ ఎక్కడెక్కడ వీక్ ఉన్నది? వంటి అంశాలను ఎప్పటికప్పుడు కాంగ్రెస్ వార్ రూమ్ రిపోర్టు తయారు చేస్తోంది.  అసెంబ్లీ ఎన్నికల్లో   13 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ అసెంబ్లీ స్థానాలు సాధించింది. మిగతా చోట స్పల్ప ఓటింగ్ శాతంతో సీట్లను కోల్పోయింది. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని వార్ రూమ్ టీమ్ ఓ ప్రణాళికను రెడీ చేస్తున్నది. పార్లమెంట్‌ ఎన్నికల్లోన కాంగ్రెస్ సత్తా చాటేందుకు ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్‌కు ఓ రాష్ట్ర మంత్రి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుంగా, ఒక్కో ఏఐసీసీ నేత పార్లమెంట్ అబ్జర్వర్‌గా కొనసాగుతున్నారు. టిక్కెట్ల కోసం  ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, భువనగిరి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది.

ఈ సెగ్మెంట్లలో సులువుగా గెలుస్తామనే భరోసాతో నేతలంతా టికెట్ల కోసం ట్రై చేస్తున్నారు. ఇక పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాద్, చేవెళ్ల సీట్లలోనూ కొంత కష్టపడితే గెలవచ్చని పార్టీ భావిస్తున్నది.  నిజామాబాద్, మెదక్‌లో ఎక్కువ అసెంబ్లీ సీట్లు బీఆర్ఎస్ సాధించినా.. గ్రౌండ్ కేడర్‌ను  చేర్చుకోవడం వల్ల   ఈ రెండు సీట్లలోనూ విజయం సాధించవచ్చనే అభిప్రాయంలో పార్టీ ఉన్నది.  సారి కాంగ్రెస్ పార్జీకి పాజిటివ్ వాతావరణం ఉండటంతో చాలా మంది సీనియర్లు తమ కుటుంబసభ్యులను బరిలోకి  దించాలనుకుంటున్నారు. భార్యలను.. తమ్ముళ్లను.. ఇతర బంధువుల్ని ఎంటర్ టెయిన్ చేసే పరిస్థితి లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అభ్యర్థులు అందరూ సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారని.. పార్టీ బలానికి వారి బలం కూడా తోడయ్యేలా అభ్యర్థులు ఉంటారని చెబుతున్నారు.