harish-revanth
తెలంగాణ రాజకీయం

రేవంత్ అబద్దాల సీఎం

నీటి పారుదలశాఖలో అవకతవకలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ మీడియా సమావేశంలో హరీశ్ రావు చేసింది వితండవాదం తప్ప మరేమీ లేదని అన్నారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని విమర్శించారు. సీఎం చెప్పినట్లుగాతాము పదవుల కోసం పెదవులు మూసుకోలేదని అన్నారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నది రెవంత్ రెడ్డి, ఆయన మంత్రుల్లో ఇప్పుడు ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే అని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడుకు కన్నం పెట్టి శ్రీశైలం నీరు ఆంధ్రా ప్రాంతానికి తరలించిన సమయంలో ఇచ్చిన జీవోకు తాము అందుకు వ్యతిరేకంగా అసెంబ్లీని స్తంభింపజేశామని అన్నారు. సోమవారం (ఫిబ్రవరి 5) హరీశ్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు.తాము మంత్రులుగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు జీవో వచ్చిందని సీం రేవంత్ రెడ్డి అన్నారని, అది తప్పని హరీశ్ రావు కొట్టిపారేశారు. తాము రాజీనామాలు చేసిన మూడు నెలలకు ఆ జీవో వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణకు అన్యాయం చేస్తుంటే పదవులను గడ్డిపోచలుగా వదిలేశామని అన్నారు.

పోతిరెడ్డిపాడు కోసం వైఎస్ 2005లో సెప్టెబరు 13న జీవో తెచ్చారని.. ఆ తర్వాత మూడు నెలలకు మరో జీవో ఇచ్చారని అన్నారు. తాము అదే ఏడాది జులైలోనే బయటకు వచ్చేశామని అన్నారు. ప్రాజెక్టులను అప్పగిస్తూ కేసీఆరే సంతకం చేశారని సీఎం చెప్పిన విషయాన్ని  హరీశ్ రావు గుర్తు చేశారు. అసలు కేఆర్ఎంబీ సమావేశానికి కేసీఆర్ హాజరు కాలేదని అన్నారు. ఇంతకంటే అబద్ధాల ముఖ్యమంత్రి ఉంటారా అని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై కేసీఆర్ స్పందించలేదని సీఎం చెప్పారని.. రాయలసీమ ఎత్తిపోతలపై స్టే తీసుకొచ్చిందే బీఆర్ఎస్ కదా అని అన్నారు. సీఎం నోరు జారినా.. రెచ్చగొట్టినా మేం రెచ్చిపోబోమని అన్నారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడేందుకు తాము సిద్ధమని అన్నారు. తాము అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షమే అని అన్నారు. విషయం తెలియని వారే విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 420 హామీలను చెప్పిన సమయానికి చెప్పినట్లుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సీఎం సన్నద్ధత సమావేశం కాకుండా మీడియా సమావేశం పెట్టారని అన్నారు. సన్నద్ధత కాకుండా వస్తే అడ్డంగా దొరికిపోతారని అన్నారు. రాజకీయాలకంటే రాష్ట్ర ప్రయోజనాలే బీఆర్ఎస్ ప్రాధాన్యం అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో కలిసి వస్తామని అన్నారు. అఖిలపక్షం ఏర్పాటు చేస్తే ఢిల్లీకి కలిసి వెళ్దామని అన్నారు. బేషజాలకు పోకుండా ప్రజలకు సీఎం క్షమాపణలు చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ అధికారులు డ్యాంపైకి వెళ్లాలంటే కేఆర్ఎంబీ అనుమతి కావాలని.. ప్రాజెక్టుల నిర్వహణ కేఆర్ఎంబీకి ఇవ్వడానికి అధికారులు ఒప్పుకున్నారని అన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారని పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయని అన్నారు. వార్తలు తప్పు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వివరణ ఇవ్వలేదని అన్నారు. ప్రాజెక్టుల అప్పగింత నిజం కాకపోతే ఉద్యోగల జీతాల ప్రస్తావన ఎందుకని అన్నారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని చెప్పారు. ఈ రెండు నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టారని అన్నారు