gslv
అంతర్జాతీయం టెక్నాలజీ

ఇస్రో మరో ప్రయోగం..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. షార్‌లోని బ్రహ్మ ప్రకాష్‌ హాలులో మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ(ఎంఆర్‌ఆర్‌)ను గురువారం అధికారులు నిర్వహించారు. అనంతరం ప్రయోగ పనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు(ల్యాబ్‌)కు అప్పగించారు. అనంతరం లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు చైర్మన్‌ అర్ముగం రాజ రాజన్‌ ఆధ్వర్యంలో మరోసారి ల్యాబ్‌ సమావేశాన్ని నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంంటలు ననుంచి 27.30 గంటల కౌంట్‌ డౌన్‌ అనంతరం జీఎస్‌ల్‌వీ-14ను ప్రయోగించనున్నారు. మొత్తం 2,272 కిలోలు బరువు కలిగిన ఇన్‌శాట్‌-3డీఎస్‌ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలో మీటర్లు ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టేలా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని డిజైన్‌ చేశారు. షార్‌ కేంద్రం నుంచి ఇప్పటి వరకు అనేక ప్రయోగాలను ఇస్రో నిర్వహించింది.

తాజాగా ప్రయోగిస్తున్న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 ఇక్కడ నుంచి జరుగుతున్న 92వ ప్రయోగం. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 16వ ప్రయోగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్‌ ఇంజన్లు తయారు చేసుకుని చేస్తున్న పదో ప్రయోగం ఇది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ ఏడాది పీఎస్‌ఎల్వీ-58 విజయంతో కొత్తగా ఏడాదిని ఘనంగా ప్రారంభించిన ఇస్రో.. మరో ప్రతిష్టాత్మక విజయాన్ని దీని ద్వారా దక్కించుకోవాలని భావిస్తోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఈ నెల 17న ఈ రాకెట్‌ ప్రయోగించనుంది. ఈ రాకెట్‌ ప్రయోగంతో కమ్యూనికేషన్‌ వ్యవస్థను బలోపేతం చేసే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్వీ ఎఫ్‌-14 నింగిలోకి దూసుకెళ్లనుంది. శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభం కానున్న కౌంట్‌ డౌన్‌ 27.30 గంటలపాటు కొనసాగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.