ఏపీలో ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏటా మెగా డీఎస్సీ ప్రకటిస్తానని జగన్ చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లలో అస్సలు పట్టించుకోలేదు. సరిగ్గా ఎన్నికల ముంగిట 6100 ఉపాధ్యాయ పోస్టులకు జగన్ సర్కార్ నోటిఫికేషన్ జారీచేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభించాలని నిర్ణయించింది. అంతకుముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించడానికి డిసైడ్ అయ్యింది. కానీ ఈ నియామక ప్రక్రియలో నిబంధనలు పాటించలేదంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో డీఎస్సీ నియామక ప్రక్రియ కొనసాగుతుందా? లేదా? అన్న ఆందోళన నెలకొంది.గతంలో డీఎస్సీ తో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ను నిర్వహించేవారు. ఈసారి మాత్రం వేర్వేరుగా నిర్వహించడానికి నిర్ణయించారు. టెట్లో వచ్చిన మార్కులను 20 శాతం వెయిటేజీతో డీఎస్సీ లో కలపనున్నారు.
అయితే సరిగ్గా ఎన్నికలకు నెల రోజుల వ్యవధి ముందు డీఎస్సీ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు పోస్టుల సంఖ్య తగ్గించడంపై కూడా పెద్ద దుమారమే రేగుతోంది. జగన్ విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు సర్కార్ 7,100 ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్లో జగన్ ఇవి ఒక పోస్టులేనా అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కేవలం 6,100 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడంపై విమర్శలు చుట్టుముడుతున్నాయి.మరోవైపు ఎస్ జి టి టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రకాశం జిల్లా కు చెందిన బొల్లా సురేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషన్ లో పేర్కొన్నారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడం ద్వారా లక్షలాదిమంది డిఈడి అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని చెప్పుకొచ్చారు.
ఎన్ సి టి ఈ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని కూడా ఆరోపించారు. తప్పులతడక నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలకు ఏపీ ప్రభుత్వం ఆడుకుంటుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై రేపు కోర్టు వాదనలు విననుంది. ఒకవేళ పిటిషనర్ అభిప్రాయంతో ఏకీభవిస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.