2024 ఎన్నికలు చాలా కీలకం. త్యాగులు చేయాలి. సర్వేల ఆధారంగా ప్రజల్లో ఉన్న ఆదరణ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. తర్వాత ఎవరు ఏమనుకున్నా నేను చేసేది ఏమీ లేదు’ టీడీపీ అధినేత కొన్ని రోజులుగా చెబుతున్న మాటలు ఇవీ. కానీ తాజాగా ఎంపిక చేసిన అభ్యర్థుల ఎంపిక జాబితా చూస్తే.. ఈ సర్వేలన్నీ సైడ్ చేసినట్లు కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక లేక్కలు వేరే ఉన్నాయన్న చర్చ టీడీపీలోనే జరుగుతోంది. ఆయన చెప్పినట్లు ఒక్కటి కూడా జరుగడం లేదని గుసగుసలాడుతున్నారు. గుండుగుత్తాగా పాతకాపులకే టికెట్లు ఇచ్చారని అంటున్నారు. తొలి జాబితాలో రెండు మూడుసార్లు ఓడిపోయిన నేతల పేర్లు కూడా ఉండడం ఇందుకు కారణం.
– సర్వేపల్లి(నెల్లూరు) నియోజకవర్గంలో వరుసగా ఓటమి కోసమే పోటీ చేస్తున్నట్లు అనిపిస్తున్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ఇప్పటి వరకు ఆయన ఐదుసార్లు ఓడిపోయారు. ఇలాంటి చోట మార్పు ఉంటుందని టీడీపీ నాయకులు భావించారు. కానీ, తాజాగా సోమిరెడ్డికే టికెట్ ఇచ్చింది టీడీపీ. దీంతో ఇక్కడ వైసీపీ మళ్లీ గెలవడం ఖాయమన్న అభిప్రాయం టీడీపీలోనే వ్యక్తమవుతోంది.
– ఇదిలా ఉంటే చింతపూడి నియోజకవర్గంలో కొత్త ముఖానికి అవకాశం ఇచ్చారు. సోమా రోషన్‌ను ఇక్కడ నిలబెడుతున్నట్లు టీడీపీ తొలి జాబితాలో ప్రకటించింది. కానీ చింతలపూడిలో కొత్తవారిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. ఇక్కడ పీతల సుజాత పోటీ చేస్తుందని తొలుత ప్రచారం జరిగింది. ఆమెకు టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ, ఆమెకు టికెట్ ఇవ్వకుండా కొత్త వ్యక్తిని నిలబెట్టింది. ఈయన అసలు పార్టీలో కానీ, నియోజవర్గంలో కానీ కనిపించలేదు.
-విజయవాడ తూర్పు టికెట్ పాతకాపు గద్దె రామ్మోహన్‌కే ఇచ్చారు. వాస్తవానికి ఈయన గ్రాఫ్ ఎప్పుడో పడిపోయింది. అయినా చంద్రబాబు ఆయనకే టికెట్ ఇచ్చారు. ఇక్కడ కూడా వైసీపీకి లైన్ క్లియర్ అయినట్లే అన్న చర్చ టీడీపీలో జరుగుతోంది.
– నూజివీడు టికెట్ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావును పక్కన పెట్టింది టీడీపీ. ఇంకా పార్టీలో చేరని పార్థసారధికి ఇక్కడ టికెట్ ఖరారు చేశారు. మరి ఏ సర్వే ఆధారంగా ఆయనకు టికెట్ ఇచ్చారన్న ప్రశ్న టీడీపీలో వినిపిస్తోంది.– మైదుకూరులోనూ ఇదే పరిస్థితి. వరుసగా ఓడిపోతున్న పుట్టా సుధాకర్‌యాదవ్‌కు మరోసారి టికెట్ ఇచ్చారు. ఇక్కడ ఆయన గెలిచిన దాఖలాలు లేవు. ఆయనకు టికెట్ ఇవ్వొద్దని స్థానిక నేతలు కోరుతున్నా.. చంద్రబాబు ఆయనకే మొగ్గు రూపారు. ఏ సర్వేల ఆధారంగా టికెట్ ఇచ్చారో ఆయనకే తెలియాలి.ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు చెప్పిన సర్వేలు అన్నీ ఉత్తమాటలే అన్నట్లు టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సర్వే ఆధారంగా ఒక్క సీటు కూడా ఖరారు చేసినట్లు కనిపించడం లేదు.