dastagiri-viveka
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

అలా చెప్తే రూ.20 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లిస్తాం..

వివేక హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని మరోసారి ప్రలోభానికి గురిచేశారు. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ కొట్టి అప్రూవర్‌గా మార్చాడని చెప్పాలంటూ తీవ్ర ఒత్తిడి చేశారు. అలా చెబితే ఏకంగా రూ.20 కోట్లు అడ్వాన్స్‌గా ఇస్తామంటూ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి ఆఫర్ చేశారు. దస్తగిరి జైలులో ఉన్న సమయంలో చైతన్య రెడ్డి డాక్టర్‌గా వెళ్లి జైల్లో ప్రలాభాలకు గురిచేశాడని బయటపడింది. వివేక పీఏ కృష్ణారెడ్డి ఎలా అయితే ఎస్పీ రాంసింగ్‌పై ఆరోపణలు చేశారో అదేవిధంగా చెప్పాలంటూ దస్తగిరిని ఒత్తిడి చేశారు. ఈ విషయాన్ని దస్తగిరి స్వయంగా సీబీఐ కోర్టుకు వెళ్లడించాడు. ప్రలోభాలకు గురిచేసిన వారిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని సీబీఐని దస్తగిరి కోరారు. నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో సీబీఐ కోర్టుకు హాజరైన సందర్భంగా ఈ విషయానలను దస్తగిరి బయటపెట్టాడు. కాగా దస్తగిరి రీకాల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు అనుమతించింది. మరోవైపు తాను త్వరలో రాజకీయరంగ ప్రవేశం చేయబోతున్నట్టు దస్తగిరి తెలిపాడు.

పులివెందల నియోజకవర్గంలో సీఎం జగన్‌పై పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ వెల్లడించాడు.‘‘వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి, మనోహర్ రెడ్డి. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వివేక హత్య కేసులో సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనను కొట్టి అప్రూవర్‌గా మార్చాడని నా నోట చెప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. రామ్ సింగ్‌పై వివేక పీఏ కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలే నన్ను కూడా చేయాలని బెదిరిస్తున్నారు. అలా నేను చెప్పడం వల్ల కేసు నీరు గారి పోతుందని వాళ్లు భావిస్తున్నారు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్‌లో వివేక హత్య కేసు ద్వారా ఎఫెక్ట్ అవుతామని భావిస్తున్నారు. రూ.20 కోట్లు అడ్వాన్స్ తీసుకోవాలని దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి ప్రలోభానికి గురిచేశాడు. నేను జైల్లో ఉన్న సమయంలో డాక్టర్ లాగా లోపలికి వచ్చి డబ్బులు ఆఫర్ చేశాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడంతో నేను నాంపల్లి సీబీఐ కోర్ట్ విచారణకు హాజరయ్యాను. నేను అరెస్టు కాకుండా సీబీఐ కోర్టులో రీకాల్ పిటిషన్ వేశాను. కోర్టు అనుమతించింది. వివేక హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైనది.

ఆ కేసును నీరు గార్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి’’ అని దస్తగిరి పేర్కొన్నాడు.‘‘ వైసీపీ ప్రభుత్వంపై ఈ హత్య కేసు ప్రభావం చూపుతోందని నన్ను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. తెలంగాణ పోలీసులతో నాకు భద్రత కావాలని కోర్టును ఆశ్రయిస్తాను. తెలంగాణ ప్రభుత్వం భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. పులివెందులలో అరెస్ట్ అయిన వ్యవహారంపై సీబీఐ అధికారులకు అన్ని వివరాలను వెల్లడించాను. నన్ను ప్రలోభాలకు గురిచేసిన వారి వివరాలన్నింటినీ సీబీఐకి అందించాను. పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీబీఐని కోరాను. నాకు 2 + 2 గన్‌మెన్లు ఉన్నప్పుడు నేను ఎలా కిడ్నాప్ చేస్తాను. నాకు ఎస్కార్ట్ వెహికల్ కూడా ఉంది. కక్షపూరితంగానే నాపైన కిడ్నాప్ కేసు పెట్టి జైలుకు పంపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ కోర్టు, సీబీఐ అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. త్వరలో రాజకీయ ప్రవేశం చేయబోతున్నాను. పులివెందులలో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని దస్తగిరి వివరించాడు.