సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తున్న ఏపీలో రాజకీయ పార్టీలన్ని దూకుడు పెంచాయి. అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే లో కాంగ్రెస్ పార్టీలో కూడా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్.షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వా త పార్టీ కార్యక్రమాల్లో దూకుడు పెరిగింది.దాదాపు పదేళ్లుగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిస్తేజమై పోయింది. పార్టీ క్యాడర్ మొత్తం చెల్లాచెదురైపోయింది. ఒకప్పటి కాంగ్రెస్ శ్రేణులన్నీ వైసీపీ వెంట వెళ్లిపోయాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని వెన్నంటి ఉన్న వర్గాల్లో చాలా వరకు జగన్ వెంట నడిచాయి. కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకులుగా ఉన్న మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను జగన్ తన వైపు తిప్పుకోవడంలో విజయం సాధించారు.ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అనూహ్యంగా ఏపీ కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల వచ్చారు.
జనవరిలో ఆమె పిసిసి పగ్గాలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. జిల్లా పర్యటనలతో పార్టీలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.పదునైన విమర్శలతో ప్రభుత్వంపై విరుచుకు పడుతున్న షర్మిల రాజకీయంగా కూడా వేడి పుట్టిస్తున్నారు. షర్మిల రాకతో ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తుందా లేదా అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీతో తెలంగాణలో రెండేళ్ళ క్రితమే క్రియాశీల రాజకీయాల్లో అడుగు పెట్టినా ఇప్పటి వరకు ఒక్క ఎన్నికలో కూడా పాల్గొనలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను దెబ్బ తీయకూడదనే ఉద్దేశంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆమె ఏపీకి తిరిగి వచ్చేశారు. ఏపీ కాంగ్రెస్‌లో తన రాజకీయ అస్తిత్వాన్ని వెదుక్కుంటున్నారు.
షర్మిల ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా విషయంలో ఆ పార్టీ ముఖ్య నాయకుల్లో కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షాలైన వైసీపీ, టీడీపీ వైఫల్యాలను ఎండగడుతున్న షర్మిల వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది అందరిలో ఆసక్తి కలిగిస్తోంది.కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో షర్మిలకు రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందని ప్రచారం జరిగింది. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో ఆమెకు అవకాశం దక్కలేదు. దీంతో ఏపీలో జరిగే ఎన్నికల్లో షర్మిల పాల్గొంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.ఏపీ కాంగ్రెస్‌లో ప్రస్తుతం వన్ వే కమ్యూనికేషన్ మాత్రమే నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు భిన్నంగా షర్మిల వ్యవహార శైలి ఉందనే ప్రచారం కూడా ఉంది. రఘువీరా రెడ్డి, కేవీపీ వంటి ఒకరిద్దరికి మాత్రమే షర్మిల అందుబాటులో ఉంటారని పార్టీలో ఇతర నాయకులు ఎవరికి ఆమెతో చర్చించే అవకాశం కూడా ఉండదని ప్రచారం జరుగుతోంది.పార్టీ కార్యక్రమాల నిర్వహణపై షర్మిల సిబ్బంది నుంచి అందే సమాచారం ఆధారంగా మిగిలిన వారు సమన్వయం చేసుకుంటున్నారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తే మిగిలిన వారికి కూడా ఉత్సాహాన్నిస్తుందని చెబుతున్నారు.
మరోవైపు షర్మిల ప్రచారానికే పరిమితం కావొచ్చనే వాదన కూా ఉంది.కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న షర్మిల కుమారుడి వివాహం పూర్తైన వెంటనే నేరుగా విజయవాడ వచ్చారు. గురువారం చలో సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునివ్వడంతో విమానాశ్రయం నుంచి నేరుగా ఆంధ్రరత్న భవన్‌కు వచ్చారు.కుమారుడి వివాహం అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వైఎస్ షర్మిల మొదట కేవీపీ ఇంటికి వెళ్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత సడెన్‌గా రూట్ మార్చేశారు. తొలుత అంపాపురంలోని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు నివాసానికి వెళ్లాలని భావించారు.పోలీసులు అనుసరిస్తున్నారని తెలియడంతో కాంగ్రెస్ నేతలు వెంటనే రూట్ మార్చి విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్‌కు తీసుకున్నారు. షర్మిల, కాంగ్రెస్ నేతలంతా ఆంధ్ర రత్న భవన్‌కు వెళ్లారు.
అక్కడి నుంచే ఛలో సెక్రటేరియట్‌కు వెళ్లాలని నిర్ణయించారు.ఆంధ్రరత్న భవన్‌కు చేరుకున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ రాత్రి పార్టీ కార్యాలయంలోనే బస చేశారు. ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. తొలుత షర్మిల కేవీపీ నివాసానికి వెళితే అక్కడ ఆమెను హౌజ్ అరెస్ట్ చేయాలని భావించారు. అలర్ట్ అయిన షర్మిల, కాంగ్రెస్ నేతలు.. ఆంధ్రరత్న భవన్‌కు చేరుకున్నారు. ముందస్తు అరెస్ట్‌ల నేపథ్యంలో రాత్రికి ఆంధ్రరత్న భవన్‌లోనే బస చేశారు.