ఎన్నికలు సమీపిస్తున్నాయి.. అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీలు సీరియస్ కసరత్తులు చేస్తున్నాయి. ఆ క్రమంలో అంగ బలం, అర్థం బలం ఉన్నవాళ్లకు ఆ యా పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయితే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లి వచ్చిన వారి పేర్లను సైతం అభ్యర్థులుగా ప్రకటించే పనిలో పార్టీలు ఉన్నాయనే ఓ ప్రచారం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. నెల్లూరు లోక్‌సభ వైసీపీ అభ్యర్థిగా శరత్ చంద్రారెడ్డిని ఎంపిక చేసినట్లు ఇప్పటికే అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సమీప బంధువు. అంతేకాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రధాన నిందితుల్లో ఆయన ఒకరు. అయనపై సీబీఐ, ఈడీ కేసు నమోదు చేశాయి. ఈ కేసులో ఆయన తీహార్ జైలుకు వెళ్లి, అప్రూవర్‌గా మారి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇదే స్కామ్‌లో సౌత్ గ్రూప్ తరపున ఆయన అన్నీ తానై వ్యవహరించారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. అయితే.. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నఅనిల్ కుమార్ యాదవ్‌ను నరసారావుపేట ఎంపీగా బరిలో దిగుతుండగా, నెల్లూరు జిల్లాలోని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసి.. తెలుగుదేశంలోకి జంప్ కొట్టేశారు.
అలాగే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బాబాయి రూప్ కుమార్‌తో పాటు పలువురు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు సైతం.. వైసీపీకి బై బై గుడ్ బై చెప్పేసి.. త్వరలో తమ రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తామని ప్రకటించేశారు. ఇక జగన్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీని వీడడంతో.. నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి పూర్తి ఆధ్వానంగా మారిపోయింది. దాంతో ఎంపీగా శరత్ చంద్రారెడ్డిని బరిలో దింపేందుకు తాడేపల్లి ప్యాలెస్‌లోని పెద్దలు పావులు కదుపుతోన్నట్లు తెలుస్తోంది.నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి ఇలా ఉంటే.. ఆ పక్కనే ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. వైసీపీకి రాం రాం చెప్పేయడమే కాదు, రానున్న ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీగా బరిలో దిగుతున్నారని.. అయితే ఆయన ఏ పార్టీ తరఫున బరిలో దిగేది త్వరలో వెల్లడిస్తామని ప్రకటించారు. ఇక ఈ మాగుంట రాఘవరెడ్డి కూడా ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పీకల్లోతూ ఇరుక్కొని ఉండడమే కాదు.. ఆయన కూడా ఈ కేసులో తీహార్ జైలుకు వెళ్లి వచ్చారు. అయితే ఈ కేసులో తన కుమారుడిని బయటకు తీసుకు రావడంలో అధికార జగన్ పార్టీ ప్రత్యేక శ్రద్ద పెట్ట లేదంటూ.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆడపా దడపా తన అనుచరుల వద్ద గోడు వెళ్ల బోసుకోనే వారని.. ఆయన వైసీపీకి రాజీనామా చేయడానికి అది కూడా ఒక కారణమని పోలిటికల్ సర్కిల్‌లో ఓ ప్రచారం జరుగుతోంది.
మరో వైపు.. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డికి టికెట్లు కేటాయిస్తే.. వారు గెలుస్తారా? అనే ఓ చర్చ సైతం వాయువేగంతో పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. ఎందుకంటే, తెలంగాణ మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత.. ఇదే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిండా మునిగిపోవడం… అందులోభాగంగా ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు సైతం తీహార్ జైలుకు వెళ్లి.. రావడం..జరిగిందని.. కానీ ఇదే కేసులో పలుమార్లు ఈడీ, సీబీఐ విచారణకు వెళ్లి వచ్చిన కల్వకుంట్ల కవిత మాత్రం.. నేటికి జైలుకు వెళ్ల లేదు, అయితే ఆమె జైలుకు వెళ్లక పోవడం వెనుక బీఆర్ఎస్, బీజేపీలు తెరచాటు ఒడంబడిక కారణమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయాన్ని తెలంగాణ ఓటర్లు పసిగట్టే.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్‌కు సాగనంపారని.. అలాంటి పరిణామాలు చోటు చేసుకొంటున్న క్రమంలో.. రానున్న ఎన్నికల్లో శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి బరిలో దిగితే.. ఆయా నియోజకవర్గ ప్రజలు.. వారికి ఓటు వేసి గెలిపిస్తారా? లేకుంటే స్కామర్లు, అవినీతి పరులకు ఓటు వేసేది లేదు.. వారిని ఇంటికి సాగనంపుతామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు… తమ ఓటు హక్కు ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారా? అన్న చర్చ కూడా పోలిటికల్ సర్కిల్‌లో జోరుగా సాగుతోంది.