నేను ఎవరి భూములు కబ్జా చేయలేదు.. నా దగ్గర రికార్డులు ఉన్నాయి.. కమాన్ రేవంత్.. చూసుకుందాం.. నీ చరిత్ర, నా చరిత్ర” అప్పుడు ఇలానే కదా పాల మల్లారెడ్డి అలియాస్ కార్మిక శాఖ మాజీ మంత్రి మల్లారెడ్డి సవాల్ చేసింది. అలా సవాల్ చేసిన కొద్ది సంవత్సరాలకే మంత్రి మల్లారెడ్డి కాస్త ఎమ్మెల్యే అయితే అయ్యారు కానీ మాజీ మంత్రి అయ్యారు. అప్పటి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకేముంది ఆట మొదలుపెట్టారు.. మల్లారెడ్డి హెచ్ఎండీఏ భూములను ఆక్రమించి నిర్మించిన రోడ్డును తొలగించారు. అది జరిగి మూడు రోజులు కాకముందే గురువారం మరో చర్యకు పాల్పడ్డారు.
దుండిగల్ ప్రాంతంలో మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి ఎంఎల్ఐటీ పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఈ కాలేజీ దుండిగల్ ప్రాంతంలో ఉన్న చిన్న దామరచెరువును కబ్జా చేసి కట్టారని ఎప్పటి నుంచో అభియోగం ఉంది. ఈ కాలేజీ నిర్మాణపై గతంలో మల్లారెడ్డి అల్లుడు పై రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆధారాలతో సహా ఆరోపణలు చేశారు. అప్పట్లో అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు.
కానీ మల్లారెడ్డి మంత్రిగా ఉండడం, భారత రాష్ట్ర సమితి అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో చర్యలు తీసుకోలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో.. వారు రంగంలోకి దిగారు. గత కొద్దిరోజులుగా కీలక రికార్డులను పరిశీలించి.. గురువారం చర్యలకు ఉపక్రమించారు. దుండిగల్ ప్రాంతంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఎంఎల్ఐటీ, ఏరోనాటికల్ కాలేజీ భవనాలను కూల్చేశారు. పెద్ద పెద్ద బుల్డోజర్లతో అధికారులు ఉదయమే అక్కడికి చేరుకొని ఆ భవనాలను నేలమట్టం చేశారు. ఈ భవనాలను కూల్చి వేస్తున్నప్పటికీ అక్కడికి సంబంధిత కళాశాల యాజమాన్యం రాకపోవడం విశేషం.ఈ కూల్చివేతలను ఆ కళాశాల విద్యార్థులు అడ్డుకోవడం గమనార్హం. అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు.. సాయంత్రం వరకు కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో ఓ వర్గం మీడియా మల్లారెడ్డికి వంత పాడటం విశేషం.మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రె్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సమావేశం అయ్యారు.
దుండిగల్ చెరువును ఆక్రమించి నిర్మించిన .. మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన భవనాలను ఉదయం నుంచి కూల్చి వేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు .. అక్రమ కూల్చివేతలని అంటున్నారు. వారం రోజుల కిందటే నోటీసులు ఇచ్చారని కనీసం తమకు సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదని అంటున్నారు. ఈ క్రమంలో వారు సీఎం సలహాదారుతో సమావేశం కావడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కాలేజీకి చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. దుండిగల్‌లోని చిన్న దామరచెరువు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లో మర్రి రాజశేఖర్‌రెడ్డికి సంబంధించిన ఐఏఆర్‌ఈ, ఎంఎల్‌ఆర్‌ఐటీఎం కళాశాలలకు చెందిన రెండు శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లు కూల్చివేశారు. మొత్తం 8.24 ఎకరాల చెరువు (ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్) ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు.
ఈ మేరకు వారం రోజుల క్రితం యాజమాన్యానికి నోటీసులిచ్చారు. తాజాగా మేడ్చల్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. మల్లారెడ్డికి ఇటీవలే అధికారులు షాక్ ఇచ్చారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లే అవుట్ లో ఆయనకు సంబంధించిన కాలేజీ రోడ్డును అధికారులు తొలగించారు. ఇక్కడ 2,500 గజాల భూమిని ఆయన ఆక్రమించి రోడ్డు నిర్మించారని ఆరోపణలున్నాయి. దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. తన కాలేజీ కోసమే అప్పట్లో మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నారని ఆరోపించారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూమి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మేరకు హెచ్ఎండీఏ స్థలం ఆక్రమణలపై కలెక్టర్ దృష్టి సారించారు. అక్రమంగా వేసిన రోడ్డును తొలగించాలని అధికారులను ఆదేశించగా.. ఆ రోడ్డును అధికారులు తొలగించారు. అయితే, అధికారులు తన కాలేజీ రోడ్డును తొలగించడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తనను కావాలనే కొంత మంది టార్గెట్ చేశారని అన్నారు. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని మండిపడ్డారు.
హెచ్ఎండీఏ అధికారుల అనుమతి తీసుకునే అప్పట్లో కాలేజీకి రోడ్డు వేశామని స్పష్టం చేశారు. 2,500 గజాల స్థలానికి ప్రత్యామ్నాయంగా స్థలాన్ని మున్సిపాలిటీకి ఇచ్చామని చెప్పారు. మరో వైపు మర్రి రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు కేసులు పెట్టారు. ఉచిత ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలంటూ.. బీఆర్‌ఎస్ శ్రేణులు అల్వాల్ సర్కిల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అక్కడ పోలీసు అధికారితో వాగ్వాదానికి ిగంతో ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారంటూ..ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అల్వాల్ సర్కిల్ కార్యాలయానికి ఉదయాన్నే వెళ్లిన డీసీ శ్రీనివాస్ రెడ్డిని ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విధులకు ఆటకం కలుగజేయడంతో పాటు పౌరుష పదజాలాలతో మాట్లాడటంతో పాటు దూషించారని డీసీ ఫిర్యాదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ రాహుల్ దేవ్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.