brs-cong
తెలంగాణ రాజకీయం

కాంగ్రెస్, గులాబీ మధ్య ఎమ్మెల్సీ ఫైట్

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల బీఆర్‌ఎస్‌  ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్‌.నవీన్‌ కుమార్‌ రెడ్డిని  పార్టీ అధినేత కేసీఆర్‌ ఖరారు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకున్నారు. నవీన్‌ కుమార్‌ స్వస్థలం నందిగామ మండలం మామిడిపల్లి. ఆయన ఉమ్మడి పాలమూరు జడ్పీ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు.  స్థానిక సంస్థల కోటాలో మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ తరపున  ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసారు. ఈ కారణంగా ఉపఎన్నిక అనివార్యమయింది. కాంగ్రెస్ అభ్యర్థిని కూడా సీఎం రేవంత్ ఖరారు చేశారు. బుధవారం జరిగిన పాలమూరు ప్రజాదీవెన సభలో   పాలమూరు స్థాని క సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ అభ్యర్థిగా టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, ఎంఎస్ఎన్ ఫార్మా డైరెక్టర్ మన్నె జీవన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.  గత ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చేసిన పనులకు బిల్లులు రాక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

ఎంపీటీసీలు, జడ్పీటీసీల సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ‘‘మీరు జీవన్రెడ్డిని గెలిపిస్తే.. రాష్ట్రానికి, జిల్లాకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ఆయన మంజూరు చేయిస్తారు” అని సీఎం హామీ ఇచ్చారు.  మన్నె జీవన్ రెడ్డి నిన్నామొన్నటి వరూక బీఆర్ఎస్ లో  ఉన్నారు. ఆయన  మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు మన్నె శ్రీనివా్‌సరెడ్డి సోదరుడి కుమారుడు, జీవన్‌రెడ్డి గతంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మునిసిపాలిటీలు, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపులో కీలకపాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో మన్నె శ్రీనివా్‌సరెడ్డికి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వడంతో.. ఆయన ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత జీవన్‌రెడ్డికి టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం దక్కింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పోటీకి ఆసక్తి చూపినప్పటికీ బీఆర్‌ఎస్‌ సిట్టింగులకే టికెట్లు ఇవ్వడంతో పార్టీ అభ్యర్థుల కోసం పనిచేశారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం కోల్పోయి.. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

అయినప్పటికీ  బీఆర్‌ఎస్‌ మహబూబ్‌నగర్‌ ఎంపీ టికెట్‌ తిరిగి మన్నె శ్రీనివా్‌సరెడ్డికే కేటాయించారు.  మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 4న నామినేషన్లు ప్రారంభమయ్యాయి. మార్చి 11 వరకు నామపత్రాలను దాఖలు చేయవచ్చు. నామినేషన్లను మార్చి 12న పరిశీలించనున్నారు. ఉపసంహరణకు గడువు మార్చి 14. ఈ నెల 28న పోలింగ్‌ జరుగనుంది. ఏప్రిల్‌ 2న ఓట్లను లెక్కిస్తారు. 2021 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కశిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు.  మొత్తం ఓట్లు 1445 ఉంటే బీఆర్ఎస్ తరపున పార్టీ బీ ఫారం మీద గెలిచింది 1006 మంది ఉన్నారు. వివిధ కారణాల చేత అనర్హత వేటు, మరణించిన వారు పోగా 850 పై చిలుకు ప్రజాప్రతినిధులు బీఅర్ఎస్ పార్టీ వారు ఉన్నారు. అందరూ బీఆర్ఎస్ కు ఓటేస్తే ఆ పార్టీ అభ్యర్థి గెలుస్తారు. కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది. అందుకే పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.