బీజేపీ నేత, హర్యానా డిప్యూటీ స్పీకర్ రణ్‌బీర్ గంగ్వా వాహనంపై దాడిచేసి ధ్వంసం చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 100 మందికిపైగా రైతులపై హర్యానా పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. సెక్షన్ 124-ఎ పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొని గంటలు కూడా కాకముందే రైతులపై దేశద్రోహం కేసులు నమోదు చేయడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 11న సిర్సా జిల్లాలో ఆందోళన చేస్తున్న రైతులు డిప్యూటీ స్పీకర్ కారుపై దాడి చేసి ధ్వంసం చేసినట్టు ఆరోపణలున్నాయి. అదే రోజు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
దేశద్రోహం కేసుతోపాటు ‘హత్యాయత్నం’ కేసు కూడా రైతులపై నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైన వారిలో రైతు నేతలు హర్‌చరణ్ సింగ్, ప్రహ్లాద్ సింగ్ కూడా ఉన్నారు. రైతులపై దేశద్రోహం కేసులు నమోదు చేయడాన్ని సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండించింది. సెక్షన్ 124-ఎను వలస చట్టంగా అభివర్ణించిన సుప్రీంకోర్టు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఈ చట్టం అవసరం ఉందా? అని ప్రశ్నించిన కొన్ని గంటల్లోనే వీరిపై అదే సెక్షన్ కింద కేసులు నమోదు కావడం గమనార్హం.