జాతీయం ముఖ్యాంశాలు

మళ్లీ ‘బండ’ పడింది!

  • వంటగ్యాస్‌ సిలిండర్‌పై పెంపు
  • హైదరాబాద్‌లో రూ.952కి చేరిన ఎల్పీజీ ధర
  • ఏడాదిలో రూ.320కు పైగా పెరిగిన వంటగ్యాస్‌
  • వాణిజ్య సిలిండర్‌పై ఇటీవల రూ.43 వడ్డింపు
  • రూ.1,793కు చేరిన కమర్షియల్‌ ఎల్పీజీ ధర
  • మోదీ ఏడేండ్ల పాలనలో గ్యాస్‌పై రూ.538 వడ్డింపు
  • పాట్నాలో రికార్డు స్థాయిలో రూ. 974.50కు చేరిన వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర
  • గ్యాస్‌ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. 14.2 కిలోల సబ్సిడీ, సబ్సిడీయేతర వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరను చమురు కంపెనీలు రూ.15 చొప్పున పెంచేశాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.952కు చేరుకున్నది. గతేడాది నవంబర్‌లో రూ.631.5గా ఉన్న సిలిండర్‌ ధర.. 11 నెలల వ్యవధిలోనే ఏకంగా రూ.320.50 పెరిగింది. పాట్నాలో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రికార్డు స్థాయిలో రూ. 974.50కు చేరింది. ఇక, 5 కిలోల సిలిండర్‌ ధరను రూ. 502గా నిర్ణయించారు. తాజా పెంపు బుధవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు చమురు కంపెనీలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ ఆధారంగా ఈ పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్టు వెల్లడించాయి.
  • ఏడాదిలో రూ. 300కు పైగా వడ్డింపు
    ఇండ్లల్లో వినియోగించే సిలిండర్‌ ధరలు గత ఏడాది కాలంలో విపరీతంగా పెరిగాయి. గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ అక్టోబర్‌ మధ్యలో ఒక్కో సిలిండర్‌ ధర రూ.320.50 వరకు పెరుగడం సామాన్యులకు గుదిబండలా మారింది. 2020 జూలై 1 నుంచి 2020 నవంబర్‌ చివరి వరకూ హైదరాబాద్‌లో 14.2 కిలోల ఎల్పీజీ ధర రూ.631.5గా ఉండేది. అయితే 2020 డిసెంబర్‌ 1న దీనిపై రూ.50ను కంపెనీలు వడ్డించాయి. దీంతో సిలిండర్‌ ధర రూ.681.50కు చేరింది. ఆ తర్వాత పలు దఫాల్లో ధరలను పెంచడంతో ప్రస్తుతం ఒక్కో ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.952కు చేరింది.

మూడు నెలల్లో నాలుగోసారి
గడిచిన మూడు నెలల్లో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచడం ఇది నాలుగోసారి. జూలైలో ఒక్కో సిలిండర్‌పై రూ. 25.50, ఆగస్టు 17న రూ. 25, సెప్టెంబర్‌ 1న రూ. 25ను పెంచారు. మరోవైపు, 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై అక్టోబర్‌ 1న రూ. 43ను పెంచారు. దీంతో ఢిల్లీలో వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్‌ ధర రూ. 1,793కు చేరింది.

మళ్లీ భగ్గుమన్న పెట్రోలు, డీజిల్‌
దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి. లీటరు పెట్రోల్‌పై 30 పైసలు, లీటరు డీజిల్‌పై 35 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ. 102.94, లీటరు డీజిల్‌ రూ. 91.42కు చేరుకున్నది. ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 108.96గా ఉండగా, లీటరు డీజిల్‌ ధర రూ. 99.17కు చేరింది. గడిచిన మూడు వారాల్లో పెట్రోల్‌ రేటును పెంచడం ఇది ఏడోసారి కాగా, డీజిల్‌ రేటును పెంచడం ఇది పదోసారి.

మోదీ ఏడేండ్ల పాలనలో వంటింట్లో మంట పెరిగిందిలా..

  • తొలిసారిగా అధికారంలోకి వచ్చిన సమయంలో (2014 జూన్‌లో) సిలిండర్‌ ధర రూ. 414
  • రెండోసారి అధికారంలోకి వచ్చిన సమయంలో (2019 జూన్‌లో) సిలిండర్‌ ధర రూ. 500
  • ప్రస్తుతం (2021 అక్టోబర్‌ 6) సిలిండర్‌ ధర రూ. 952
  • మొత్తంగా ఏడేండ్ల పాలనలో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలో పెరుగుదల రూ. 538