కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌భీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్‌లను నియమించారు. హైపవర్డ్ కమిటీ ఈ ఇద్దరినీ కమిషనర్లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కేరళకు చెందిన జ్ఞానేశ్ కుమార్, పంజాబ్‌కి చెందిన సుఖ్‌భీర్ సింగ్ సంధుని ఎంపిక చేసినట్టు అధిర్ రంజన్ చౌదరి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అరుణ్ గోయల్, అనూప్ చంద్ర పాండే రాజీనామాతో కమిషనర్ల పోస్ట్‌లు ఖాళీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషనర్ల నియామకానికి కేంద్రం ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ని నియమించింది. ఈ ప్యానెల్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధురి కూడా ఉన్నారు. ఆయనే అధికారికంగా ఈ కమిషనర్ల పేర్లని ప్రకటించారు. “కేరళకి చెందిన జ్ఞానేశ్ కుమార్, పంజాబ్‌కి చెందిన సుఖ్‌భీర్ సింగ్ సంధుని ఎన్నికల కమిషనర్లుగా నియమించాం” వెల్లడించారు. నిజానికి మార్చి 15వ తేదీన సాయంత్రం 6 గంటలకు సెలెక్షన్ కమిటీ సమావేశమవ్వాల్సి ఉంది. కానీ…ఈ భేటీని రీషెడ్యూల్ చేశారు. ప్రధాని నేతృత్వంలో సమావేశం జరిగింది.
కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ఐదుగురి పేర్లని ప్రతిపాదించింది. వీళ్లలో ఇద్దరి పేర్లని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. మరి కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకుచీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కి ఈ ఇద్దరు కమిషనర్లు పూర్తి స్థాయిలో సహకరించనున్నారు. అయితే…ఈ ప్రకటన చేసిన తరవాత అధిర్ రంజన్ చౌధురి మోదీ సర్కార్‌పై మండి పడ్డారు. సెలెక్షన్ కమిటీ నుంచి చీఫ్ జస్టిస్‌ని తొలగించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆయన స్థానంలో కేంద్రమంత్రిని తీసుకోవడంపై విమర్శలు గుప్పించారు. సెలక్షన్ కమిటీ CJI ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. కమిటీలో ఎక్కువగా అధికార పార్టీకి చెందిన వాళ్లే ఉన్నారని, వాళ్లు అనుకున్నదే చెల్లుతుందని అన్నారు. సుఖ్‌భీర్ సింగ్ సంధు గతంలో ఉత్తరాఖండ్ చీఫ్‌సెక్రటరీగా పని చేశారు. NHAIకి ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. జ్ఞానేశ్ కుమార్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సెక్రటరీగా పని చేశారు. “ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం మా పార్టీ తరపున 212 పేర్లను ప్రతిపాదించాం.
ఈ లిస్ట్‌ని షార్ట్‌లిస్ట్ చేయాలని అడిగారు. కానీ ఆ అవకాశం ఇవ్వనేలేదు. నిన్న రాత్రికి ఢిల్లీకి వచ్చాను. ఇవాళ మధ్యాహ్నం మీటింగ్ పెట్టారు. ఒక్కరోజులో అంత మంది పేర్లని పరిశీలించి ఎలా ఎంపిక చేయగలను. మీటింగ్‌కి సరిగ్గా పది నిముషాల ముందు ఆరుగురు పేర్లని ఇచ్చారు. అందులో ఇద్దరిని ఎంపిక చేయమన్నారు. అది ఎలా కుదురుతుంది”
– అధిర్ రంజన్ చౌధురి, కాంగ్రెస్ సీనియర్ నేత