టీడీపీ రెండో జాబితాలో సీనియర్లకు షాక్ తగిలింది. 34 మందితో విడుదలైన రెండో జాబితాలో పలువురు సీనియర్లకు సీటు దక్కలేదు. సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, కళావెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా, కేఎస్ జవహర్ తో పాటు పలువురు సీనియర్ల పేర్లు రెండో జాబితాలో లేవు. వీరి పోటీపైన గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థులు, సెకండ్ లిస్టులో 34మంది టికెట్లు కేటాయించింది టీడీపీ. గంటా శ్రీనివాసరావును చీపురుపల్లీలో పోటీ చేయాలని చంద్రబాబు కోరుతున్నారు. అయితే అక్కడ పోటీ చేయడంపై గంటా వెనుకడుగు వేస్తున్నారు. తనకు భీమిలి నియోజకవర్గం కావాలంటున్నారు. ఈ సీటుపై ఎటూ తేలకపోవడంతో పెండింగ్ లో పెట్టారు. మాడుగులలో గవిరెడ్డి రామానాయుడుకు, పివిజి కుమార్ కు నిరాశే ఎదురైంది. అక్కడ పైలా ప్రసాద్ కు చాన్సిచ్చారు. వైసీపీకి రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంకు సత్యవేడు టికెట్ ఇచ్చింది టీడీపీ. విజయవాడ వెస్ట్ లో జలీల్ ఖాన్ కు టికెట్ దక్కలేదు. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టికెట్ దక్కించుకున్నారు. రెండో జాబితాల్లోనూ తమకు కచ్చితంగా టికెట్ దక్కుతుందని సీనియర్లు భావించారు.
అయితే, వారికి సెకండ్ లిస్టులోనూ నిరాశే ఎదురైంది. మూడో జాబితాలో అయినా తమకు టికెట్ వచ్చే అవకాశం ఉందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా 14 సీట్లను పెండింగ్ లో పెట్టింది. రెండో జాబితాలో ఏడుగురు మహిళలకు చోటు కల్పించింది టీడీపీ. 35ఏళ్ల లోపు వారిలో ఇద్దరు, 75ఏళ్లు పైబడిన వారిలో ఇద్దరు లిస్టులో ఉన్నారు. టీడీపీ సెకండ్ లిస్ట్ లో పీహెచ్ డీ చేసిన వారు ఒకరు, పీజీ చదువుకున్న వారు 11మంది, 10లోపు చదువుకున్న వారు ఐదుగురు ఉన్నారు. ఇక పొత్తులో భాగంగా గాజువాక టికెట్ టీడీపీకే దక్కింది. గాజువాక సీటును టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ కు కేటాయించారు. మరోవైపు రెండో జాబితాలోనూ ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ నేతల పేర్లు కనిపించలేదు. గెలుపే ప్రామాణికంగా, సర్వేలు, ప్రజాభిప్రాయసేకరణ, పార్టీ పరంగా అంతర్గతంగా జరిగిన అనేక సర్వేల ఆధారంగానే రెండు జాబితాల్లోనూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొనసాగించింది టీడీపీ. రెండు జాబితాల్లోనూ టికెట్ దక్కక తీవ్ర నిరాశలో ఉన్న వ్యక్తుల్లో గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేఎస్ జవహర్ ప్రధానంగా ఉన్నారు. ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు కూడా టిక్కెట్ ఖారరు చేయలేదు.
ఎంపీలుగా అవకాశమా..
శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి కళా వెంకట్రావుకు రెండో జాబితాలో సైతం చోటు దక్కలేదు. ఆయన ఎచ్చెర్ల టిక్కెట్టును ఆశిస్తున్నారు. విజయనగరం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి సైతం నిరాశే ఎదురయింది. ఆమె ఎస్.కోట టికెట్ ఆశిస్తున్నారు. విశాఖ జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి లకు టిక్కెట్లు ప్రకటించలేదు. గంటా శ్రీనివాసరావు భీమిలి అసెంబ్లీ టికెట్ ఆశిస్తుండగా.. బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమాకు సైతం ఈసారి కూడా చుక్కెదురు అయ్యింది. ఆయన మైలవరం లేదా పెనమలూరు టికెట్ ఆశిస్తున్నారు. సర్వేపల్లి సీటును మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు సైతం ప్రకటించలేదు. అటు నెల్లూరు సిటీ టికెట్ మాజీమంత్రి నారాయణ ఆశిస్తున్నారు. ఆయన పేరును సైతం ప్రకటించలేదు.అయితే చాలామంది సీనియర్ల పేర్లు ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు కళా వెంకట్రావు కుటుంబాన్ని పక్కన పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. చీపురుపల్లి నుంచి కిమిడి నాగార్జున టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈసారి చీపురుపల్లి నుంచి గంటా శ్రీనివాసరావు పోటీలో పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. అదే సమయంలో విజయనగరం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని కళా వెంకట్రావుకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆ సీటును బిజెపికి కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. విజయనగరం ఎంపీ సీటు విషయంలో స్పష్టత రాకపోవడం వల్లే.. ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా కళా వెంకట్రావు పేరు ప్రకటించలేదని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు గంటా శ్రీనివాసరావు పేరును ఇంతవరకు ప్రకటించలేదు. ఆయన భీమిలి అసెంబ్లీ స్థానాన్ని కోరుతుండగా.. చంద్రబాబు మాత్రం చీపురుపల్లిలో పోటీ చేయాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అందుకు గంటా సమ్మతించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు మరోసారి గంటా చంద్రబాబును కలిశారు.
ఇప్పుడు సైతం చంద్రబాబు గంటాను చీపురుపల్లి నుంచి పోటీకి సిద్ధంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విషయంలో సైతం చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పెందుర్తి సీటును జనసేన పొత్తులో భాగంగా కోరుతోంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే అక్కడ అభ్యర్థి విషయంలో స్పష్టత రాలేదని తెలుస్తోంది. మొత్తానికైతే రెండో జాబితాలో సైతం చోటు దక్కని సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇంకా టిడిపిలో కేవలం 16 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండడంతో.. ఆశావహుల్లో ఒక రకమైన టెన్షన్ కనిపిస్తోంది.