మానవాళిపై కోవిడ్ మూడో వేవ్ పంజా విసురుతున్నది. థర్డ్ వేవ్ కేసులు అమెరికాలో నమోదు కావడం గమనార్హం. గత 25 రోజుల్లో కొత్త కేసులు 350 శాతం పెరిగాయి. అయితే, ఈ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ మందగించింది. ఆసియా ఖండంలో ఇండోనేషియా థర్డ్‌వేవ్‌కే ప్రధాన కేంద్రంగా మారింది.
ఇక మహమ్మారి వెలుగు చూసిన తర్వాత స్పెయిన్‌లో తొలిసారి 44 వేల కేసులు రికార్డయ్యాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఇన్‌ఫెక్షన్లు సోకిన దేశాల్లో ఐదో స్థానంలో ఉన్న స్పెయిన్‌లో సగానికి పైగా జనాభా మహమ్మారి బారిన పడ్డారు.
బ్రిటన్, అమెరికాల్లో రెట్టింపు ఇన్‌ఫెక్షన్లు
స్పుత్నిక్- వీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన రష్యాలో ప్రజలు వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా లేరు. ఇక కేసులు పెరుగుతున్న ఫ్రాన్స్‌ను రెడ్ లిస్ట్‌లో చేర్చినట్లు బ్రిటన్ ప్రకటించింది. బ్రిటన్, అమెరికాల్లో 11 రోజుల్లో రెట్టింపు కేసులు నమోదయ్యాయి. ఇక ఇండోనేషియాలో మూడు రెట్లు ఎక్కువగా కొత్త కేసులు బయటపడుతున్నాయి.
19 అమెరికా రాష్ట్రాల్లో కొత్త కేసులు
48 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ జరిగినా అమెరికాలోని 50కి 19 రాష్ట్రాల్లో కొత్తగా రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో లాస్ ఏంజిల్స్, దక్షిణ కాలిఫోర్నియాల్లో ఇండోర్‌ల్లోనూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. అధికారులు. గత నెల 16 నుంచి ఇక్కడ మాస్క్‌ల వాడకం రద్దు చేశారు.
16 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయించుకున్నా..
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం అమెరికాలో 16 కోట్ల మంది వ్యాక్సిన్లు వేసుకున్నారు. ఇది దేశ జనాభాలో సుమారు 48 శాతం. 10 కోట్ల మందికి మహమ్మారి ముప్పు పొంచి ఉందని మిన్నెసోటా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇన్‌ఫెక్షన్ డిసీజ్ రీసెర్చ్ అండ్ పాలసీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ మిఖైల్ ఓస్టర్‌హోల్మ్ వ్యాఖ్యానించారు.
అమెరికాలో మందగించిన వ్యాక్సినేషన్
అమెరికాలో రోజూ 5.30 లక్షల వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఏప్రిల్‌లో 33 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశారు. గత కొన్ని వారాలుగా మిస్సౌరి, ఆర్కాన్సాస్, నెవడ రాష్ట్రాలు ఇన్‌ఫెక్షన్లకు న్యూ హాట్‌స్పాట్లుగా నిలిచాయి. గత నెలలో ప్రతి రోజూ 8000 కేసులకు దిగి వచ్చిన కరోనా.. తాజాగా 30 వేల మందికి పైగా సోకుతున్నది.
బ్రిటన్ రెడ్ లిస్ట్‌లో ఫ్రాన్స్
న్యూ బేటా వేరియంట్ వైరస్ వెలుగు చూడటంతో ఫ్రాన్స్‌ను రెడ్‌లిస్టులో ఉంచేందుకు బ్రిటన్ కసరత్తు చేస్తున్నది. ఫ్రాన్స్ నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తున్నది. ఫ్రాన్స్ నుంచి వచ్చే వారిని హోటల్ గదుల్లో క్వారంటైన్ చేస్తున్నది.
సౌతాఫ్రికాలో తొలి బేటా కేసు.. ఆసియా కేంద్రం ఇండోనేషియా
దక్షిణాఫ్రికాలో తొలి బేటా వేరియంట్ బయటపడింది. ఇక ఆసియా ఖండంలో తాజా హాట్‌స్పాట్‌గా ఇండోనేషియా ఉంది. భారత్‌లో కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. గురువారం భారత్‌లో 39,071 కొత్త కేసులు నమోదైతే, ఇండోనేషియాలో 56,757 మందికి కరోనా సోకింది.
స్పెయిన్‌లో తొలిసారి 44 వేల కేసులు
స్పెయిన్‌లో తొలిసారి ఈ నెల 13న 43,960 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక రోజులు 44 వేల కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. సెకండ్ వేవ్‌లో ఒక రోజులో జనవరి 15న 35,378 కేసులు రికార్డయ్యాయి. ఫిబ్రవరి నుంచి కేసులు తగ్గినా జూలైలో క్రమంగా పెరుగుతున్నాయి.
54 శాతం మంది రష్యన్లు వ్యాక్సిన్‌కు దూరం
వ్యాక్సినేషన్‌కు తాము దూరం అని రష్యన్లు తేల్చేస్తున్నారు. గత మంగళవారం రష్యాలో 24,702 కేసులు రికార్డయ్యాయి. 54 శాతం మంది ప్రజలు వ్యాక్సినేషన్‌కు వెనుకంజ వేస్తున్నారు. కొన్ని వారాలుగా కొత్తగా డెల్టా వేరియంట్ కేసులు రికార్డవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా కొవిడ్ బారిన పడిన దేశాల్లో రష్యా ఐదవది.