దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందా లేదా అన్నది తెలుసుకునేందుకు రానున్న వంద రోజులు కీలకమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచమంతా కరోనా థర్డ్ వేవ్ వైపు మల్లుతున్నదని, కొన్ని దేశాల్లో పరిస్థితి దారుణ స్థితికి చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గురువారం చేసిన హెచ్చరికను తేలికగా తీసుకోవడం లేదని చెప్పింది. కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని అవకాశాలను పరిశీలించాలని ప్రధాని మోదీ తమకు చెప్పినట్లు నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు. మన జనాభాకు ఇంకా కరోనా ముప్పు తొలగలేదని, సహజ హెర్డ్ ఇమ్యూనిటీకి మనం ఇంకా చేరలేదని చెప్పారు. అందుకే నిరంతర వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టినట్లు వెల్లడించారు.
కరోనా థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ అన్నది ముఖ్యం కాదని వైరస్ వ్యాప్తి తీవ్రత ముఖ్యమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ తెలిపారు. కరోనా పరిస్థితిని మనం ఎలా నిర్వహించగలుగుతున్నాం అన్న దానిపై వేవ్స్ ఆధారపడి ఉంటాయని చెప్పారు. ఆంక్షల సడలింపు నేపథ్యంలో మాస్కులను ధరించడంపట్ల ప్రజలు నిర్లక్షం వహించడం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. దేశంలోని 47 జిల్లాల్లో కరోనా పాజిటివ్ రేటు పది శాతానికిపైగా ఉన్నదని ఆయన వెల్లడించారు.