kalyana-tdp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

అనంత జిల్లాలో టీడీపీకి భారీ షాక్

అనంతపురం జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. కళ్యాన్‌దుర్గం టికెట్ విషయంలో విభేదాలు కారణంగా కీలకమైన నేత టీపీడీని వీడిపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన ఉమా మహేశ్వర్‌నాయుడు పార్టీలో చేరారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం టిడిపిలో బలమైన క్యాడర్ ఉంది. అభ్యర్థులు ఎవరు వచ్చిన ఆ నియోజకవర్గానికి క్యాడర్ మాత్రం చెక్కు చెదరలేదు. తెలుగుదేశం పార్టీకి ఆ నియోజకవర్గంలో కార్యకర్తలే ప్రధాన బలం. అలాంటి నియోజకవర్గంలో గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నేతల వర్గ విభేదాలు నాయకుల మధ్య పోరుతో క్యాడర్ రెండుగా చీలిపోయింది. 2019 ఎన్నికల్లో కళ్యాణదుర్గం అభ్యర్థిగా మాదినేని ఉమామహేశ్వర నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి వైకాపా నేత మంత్రి ఉషశ్రీ చరణ్ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో కళ్యాణదుర్గంలో టిడిపి రెండు వర్గాలు చీలిపోయింది. ఈ వర్గ పోరుకు చెక్ పెడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు వర్గాలకు చెక్ పెట్టారు.

అప్పటి వరకు ఇన్చార్జిగా ఉన్న ఉమామహేశ్వర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతు రాయ చౌదరినీ కాదని మూడో వ్యక్తికి టికెట్ ఇచ్చారు. అమిలినేని సురేంద్రబాబును తీసుకొచ్చి కళ్యాణ్ దుర్గం కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. టీడీపీ అధినాయకత్వం తీసుకన్న నిర్ణయంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఉమామహేశ్వర నాయుడు గత కొద్ది కాలంగా పార్టీకి ఆంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. పలు మార్లు అనుచరులతో సమావేశమై చర్చించారు. ఒకానొక దశలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేయాలనే ఆలోచనకు వచ్చారు. ప్రస్తుతం పార్టీలో తనకు అవమానం జరిగిందని భావిస్తున్న మాదినేని ఉమామహేశ్వర నాయుడు పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చారు. నిన్న అర్ధరాత్రి సమయంలో మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఇంటికి కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థి ఎంపీ తలారి రంగయ్య, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఇతర వైసిపి నేతలు వెళ్లారు. ఉమా మహేశ్వర నాయుడుని వైసిపిలోకి రావాలని ఆహ్వానించారు.2024 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

ఈ సందర్భంగా ఆయన కీలక కామెంట్స్ చేశారు. ” పార్టీ జెండా కూడా ముట్టుకోని వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చి అవమానపరిచారు. అనుచరులు, కార్యకర్తలు తీవ్ర ఆవేదనకు గురయ్యాం. నాకు జరిగిన అన్యాయాన్ని అధికార పార్టీ గుర్తించింది. నా సేవలు ఆ పార్టీకి కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారా సమాచారం అందింది. నా అనుచరులు కార్యకర్తలతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తాను” అని చెప్పుకొచ్చారు. “40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉన్న నాయకుడిగా కార్యకర్తగా పనిచేశాను. నన్నునమ్మించి చంద్రబాబు మోసం చేశారు. ఆస్తులు కూడా పోగొట్టుకున్నాను. పార్టీ కోసం ఎనలేని సేవలు చేశాను. కష్టాన్ని గుర్తించలేని పార్టీలో ఇమడలేక పోతున్నాను.” తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు తాజాగా వైసిపిలోకి  వెళ్లడంతో పార్టీ క్యాడర్ ఎవరి వైపు నిలుస్తుందో అనే చర్చ నడుస్తోంది.

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేసిన క్యాడర్ మాత్రం టీడీపి ఎమ్మెల్యే అభ్యర్థులకు బలంగా సహకరిస్తూ వచ్చారు. ఆయన పదేళ్లుగా అక్కడ ఉన్నందున ఇది కొంత వరకు ప్రభావం చూపే ఛాన్స్ ఉందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. చరిత్ర చూసుకుంటే మాత్రం కేడర్‌ అంత తొందరగా వెళ్లేందుకు ఆసక్తి చూపబోరని అంటున్నారు.