దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రదానోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న పురస్కరాలను ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. కాగా.. పలు రంగాల్లో అసాధారణ సేవలందించిన వారికి భారత ప్రభుత్వం భారతరత్నను ప్రదానం చేస్తోంది. అయితే, ఈ ఏడాది ఐదుగురు ప్రముఖులకు మూడు విడతల్లో అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది.ఈ ఏడాదికి బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్, బీజేపీ అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ప్రధాని చౌదరీ చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారతరత్నను ప్రకటించారు. ఒకే సంవత్సరంలో ఎక్కువమందికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడం ఇదే తొలిసారి.ఇందులో నలుగురికి మరణానంతరం ఈ అవార్డు లభించగా.. నేడు వారి కుటుంబసభ్యులకు పురస్కారాన్ని ప్రదానం చేశారు.
కర్పూరీ ఠాకుర్ తరఫున ఆయన కుమారుడు రామ్‌నాథ్, చౌదరీ చరణ్ సింగ్ తరఫున ఆయన మనవుడు జయంత్ సింగ్, స్వామినాథన్ తరఫున అవార్డును కుమార్తె నిత్యా రావు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రదాని మోదీ, అమిత్ షా పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.కాగా.. ఎల్‌కే ఆడ్వాణీ అనరోగ్య సమస్యలతో బాధపడుతూ అవార్డు ప్రదానోత్సవానికి హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆడ్వాణీ ఇంటికెళ్లి ‘భారతరత్న’ ను ప్రదానం చేయనున్నారు.తెలుగు ఠీవి అయిన పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని గడిచిన నెల 9న ప్రకటించింది కేంద్రం. దేశాన్ని మలుపు తిప్పిన నాయకుడిగా పీవీ నరసింహారావుకు ఈ దేశ ప్రస్థానంలో కీలకమైన స్థానం ఉంది. 1991లో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్థికరంగ నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు పీవీ నరసింహారావు. పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన పీవీ నరసింహారావు దేశానికి పలు హోదాల్లో సేవలు అందించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ఎంపీగా, అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నో ఏళ్లు బాధ్యతలు నిర్వర్తించారు పీవీ నరసింహా రావు. దేశం ఆర్థికంగా పురోగమించడానికి ఆయన దార్శనిక నాయకత్వం ఉపయోగపడింది. దేశాభివృద్ధికి పీవీ నరసింహారావు పటిష్ఠమైన పునాదులు వేశారు. సరళీకరణ విధానాలతో ప్రపంచ మార్కెట్లకు పీవీ తలుపులు తెరిచారు. భారత విదేశాంగ విధానానికి, భాషకు, విద్యారంగానికి ఆయన సేవలు అపారమైనవని భారత రత్న ప్రకటించిన సందర్భంగా ప్రధాని మోదీ కొనియాడారు.