kejrival
జాతీయం రాజకీయం

కేజ్రీవాల్ బరువు ఏం తగ్గలేదు

లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం ఏమీ బాగోలేదని ఆప్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన 4.5 కిలోల బరువు తగ్గిపోయారని చెబుతోంది ఆప్. ఈ మధ్యే ఆయనను తిహార్ జైల్‌కి తరలించారు. దీనిపైనా ఆమ్ ఆద్మీ పార్టీ అసహనం వ్యక్తం చేస్తోంది. అక్కడి అధికారులు ఆయనను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది. అధికారులు మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టి పారేస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తేల్చి చెబుతున్నారు. ఏప్రిల్ 15వ తేదీన వరకూ కోర్టు కేజ్రీవాల్‌ని రిమాండ్‌లో ఉంచేందుకు అనుమతి నిచ్చింది. తిహార్‌ జైల్‌లో జైల్ నంబర్ 2లో ఆయనను ఉంచినట్టు అధికారులు తెలిపారు. కేజ్రీవాల్‌ డయాబెటిక్ పేషెంట్. గత రెండు రోజులుగా ఆయన బాడీలో షుగర్ లెవెల్స్‌ మారుతున్నట్టు కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. షుగర్‌ని కంట్రోల్ చేసేందుకు అధికారులు ఆయనకు ఎప్పటికప్పుడు మందులు ఇస్తున్నారని తెలుస్తోంది. అంతే కాదు. అధికారులు ఆయనకి షుగర్ సెన్సార్‌ని కూడా ఇచ్చారని సమాచారం. షుగర్ లెవెల్స్‌ పడిపోకుండా జాగ్రత్తపడేందుకు అప్పుడప్పుడూ చెక్ చేస్తున్నారు.

ఆయనకి ఇంటి నుంచే ఆహారం తీసుకొస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే చికిత్స అందించేలా ఓ స్పెషల్ టీమ్‌ని కూడా ఏర్పాటు చేసినట్టు తిహార్ జైల్ అధికారులు స్పష్టం చేశారు. భార్య సునీతా కేజ్రీవాల్‌తో అరవింద్ కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. “అరవింద్ కేజ్రీవాల్‌ షుగర్ పేషెంట్. అయినా సరే ఆయన దేశానికి సేవలందించేందుకు ఎక్కువ సమయం కేటాయించేవారు. ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకూ 4.5 కిలోల బరువు తగ్గిపోయారు. ఇది చాలా ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ ఆయన ప్రాణాల్నే ప్రమాదంలో పడేస్తోంది. ఆయనకు ఏమైనా జరిగితే ఈ దేశమే కాదు..ఆ భగవంతుడు కూడా క్షమించడడని అన్నారు.