ambati-cricketer
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

రాయుడు… పాపం… రాయుడు

ఎన్నికల ముందు వరకూ హడావిడి చేసిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఎన్నికలు సమీపించే సమయంలో కనిపించకుండా వెళ్లిపోయాడు. అంబటి రాయుడు అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నాడు? ఎందుకు ఆగిపోయాడు? ఇది మనకు పడదు అని భావించాడా? ఏపీ రాజకీయాలపై విసుగుచెంది వెళ్లిపోయాడా? అన్నది మాత్రం తెలియరాలేదు. కానీ అంబటి రాయుడు ఊసే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపించడం లేదు. ఆయన అలా వచ్చి అలా వెళ్లిపోయాడు. క్రికెట్ లో వచ్చి తొలి బంతికే డక్ అవుట్ అయినట్లు రాయుడు కూడా రాజకీయాల్లో తొలి సీజన్ కే చాపచుట్టేశారన్న కామెంట్స్ వినపడు తున్నాయి అంబటి రాయుడు అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. చివరకు ఐపీఎల్ కు కూడా తాను గుడ్ బై చెప్పినట్లు ప్రకటించి వైసీపీ అధినేత జగన్ ను కలిశాడు. వైసీపీలో చేరిపోయారు. గుంటూరు ప్రాంతంలో ఆయన పర్యటించాడు. దీంతో గుంటూరు పార్లమెంటు నియోజవకర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని భావించారు. గుంటూరులో దాదాపు రెండు నెలల పాటు అన్ని వీధులు తిరిగాడు.

అందిరతో మమేకమయ్యారు. రాయుడు అలా జనంలో తిరగడాన్ని చూసిన వారు ఇక రాజకీయాల్లోనూ రఫ్ ఆడిస్తారనుకున్నారు. కానీ ఉన్నట్లుండి తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతలోనే ఏమైందన్న సందేహాలు ప్రతి ఒక్కరికీ కలిగాయి.  అయితే దుబాయ్ లో జరిగే ఇంటర్నేషనల్ లీగ్‌లో ఆడేందుకే తాను రాజీనామా చేశానంటూ రాయుడు ట్వీట్ చేసి కొంత వరకూ అనుమానాలకు తెరదించేశాడు. మరోసారి బ్యాట్ చేతపట్టాలంటే రాజకీయంలో ఉండకూడదని అనుకున్న రాయుడు ఆ నిర్ణయం తీసు కున్నారని అందరూ సర్ది చెప్పుకున్నారు. కానీ ఉన్నట్లుండి ఒకరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యాడు. దాదాపు మూడు గంటల పాటు పవన్ తో రాయుడు లంచ్ మీటింగ్ లో పాల్గొన్నాడు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించారంటూ కథనాలు ప్రచురితమయ్యాయి. రాయుడు జనసేన తరుపున మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఏపీలో రాయుడును చూడటం అదే చివరి సారి. A అప్పటి నుంచి రాయుడు కనిపించడం లేదు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. కానీ రాయుడు అడ్రస్ మాత్రం లేకుండా పోయింది. అసలు రాయుడు ఎందుకు వచ్చినట్లు? ఎందుకు వెళ్లినట్లు? ఇటు వైసీపీ అటు జనసేనతో ఎందుకు సమాలోచనలు జరిపినట్లు? ఐపీఎల్ లో జట్లు మారినట్లు ఇలా పార్టీలు మారితే వర్క్ అవుట్ అవుతుందని భావించాడా? లేదా? పాలిటిక్స్ తనకు వర్క్ అవుట్ కాదని కిట్ ను సర్దుకుని వెళ్లిపోయాడా? అన్న చర్చ రాయుడు అభిమానుల్లో జరుగుతుంది. మొత్తం మీద రాయుడు మాత్రం క్రికెట్ గేమ్ తరహాలోనే రాజకీయ మైదానంలోకి అలా వచ్చి అలా వెళ్లిపోయాడన్న కామెంట్స్ మాత్రం బాగానే వినిపిస్తున్నాయి. దీనికి రాయుడు సమాధానం చెప్పాలి.