revant-ktr
తెలంగాణ రాజకీయం

రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ

రాష్ట్రంలో నేతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని.. పదేళ్ల తర్వాత సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభం నెలకొందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Ktr) మండిపడ్డారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి  ఆయన గురువారం లేఖ రాశారు. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా.? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విధానాలు చేనేత పరిశ్రమను నమ్ముకున్న వాళ్ల బతుకులు ఆగమయ్యేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డర్లు నిలిపేసిందని.. గతంలో మాదిరిగా వారికి చేతినిండా ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వాలి. ‘చేనేతమిత్ర’ వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టింది. గత ప్రభుత్వంపై కోపంతో నేతన్నల పొట్ట కొట్టొద్దు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు అత్యంత బాధాకరం. వస్త్ర పరిశ్రమను ఆదుకోకుంటే సర్కారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.’ అంటూ కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.’రాష్ట్రంలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా.?. కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా.?. బీఆర్ఎస్ హయాంలో నేతన్నలకు చేతి నిండా పని కల్పిస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సమైక్య రాష్ట్రంలో నాటి సంక్షోభం నెలకొంది.

గత ప్రభుత్వంలానే నేతన్నలకు చేతి నిండా పని కల్పించాలి. ప్రస్తుతం అందుతున్న అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలి. బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇవ్వడం సహా ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.’ అని కేటీఆర్ లేఖలో డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ హయాంలో ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా అయ్యే రాజీవ్ విద్యా మిషన్, సర్వశిక్షా అభియాన్ కార్యక్రమాల ఆర్డర్లను రాష్ట్రంలోని నేతన్నలకు ఇచ్చి చేతినిండా పని కల్పించాం. సంప్రదాయ వృత్తిని కొనసాగిస్తూనే పోటీని తట్టుకునేలా వారిని తీర్చిదిద్దేందుకు తోడ్పాటు అందించాం. మగ్గాల ఆధుకనికీకరణ, రుణాల మాఫీ, మార్కెట్ తో అనుసంధానం వంటి ఆల్ రౌండ్ అప్రోచ్ తో ముందుకు సాగింది. ఈ విధానాలతో కార్మికులకు ఊరట లభించింది. చేనేతలకు బతుకమ్మ చీరల ఆర్డర్లతో వారికి చేతినిండా పని దొరికింది. వాటితో పాటు రంజాన్, క్రిస్మస్ వేడుకల్లో ఇచ్చే వస్త్రాల ఆర్డర్లు కూడా ఇవ్వడంతో మరింత ఉపాధి పెరిగింది. గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను భేషజాలకు వెళ్లకుండా కొనసాగించాలి’ అని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.మరోవైపు, నల్గొండ జిల్లాలోని నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని మంచి నీటి ట్యాంకులో పడి 30 కోతులు మృతి చెందిన ఘటనపై కేటీఆర్ స్పందించారు.

తెలంగాణ మున్సిపల్ శాఖలో ఇదో సిగ్గుమాలిన పరిస్థితిగా ఆయన పేర్కొన్నారు. మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపరచడం, సరిగా నిర్వహించడం ద్వారా ఇలాంటి ఇబ్బందులను తొలగించవచ్చని అన్నారు. కానీ ఈ తరహా చర్యలను అనుసరించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యం కంటే రాజకీయాలకు ప్రాధాన్యతను ఇవ్వడం వల్లే పాలన అస్తవ్యస్తంగా మారిందని ట్విట్టర్ లో కేటీఆర్ విమర్శించారు