kavitha-ED
తెలంగాణ రాజకీయం

కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ..

ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు సోమవారం రానుంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సుదీర్ఘంగా ఈడీ, కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. పూర్తి వాదనల తర్వాత తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లుగా జడ్జి తెలిపారు. సోమవారం తీర్పు వెలువరిస్తామన్నరు. కుమారుడి పరీక్షల కారణంగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన రెండో పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది.  కవిత తరపున కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.  కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, అందుకే బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు.  పరీక్షల సమయంలో పిల్లలకు తల్లి మోరల్ సపోర్ట్ ఉండాలని అన్నారు. ప్రధాని మోదీ చాలా సందర్భాల్లో పిల్లల పరీక్షల సన్నద్ధతపై లెక్చర్ ఇచ్చారని ప్రస్తావించారు.  తల్లి అరెస్ట్ తనయుడిపై ప్రభావం ఉంటుందన్నారు. తండ్రి ఉన్నాడు కానీ న్యాయ పోరాటంలో ఉన్నాడని తెలిపారు. కవిత కొడుకు భయాందోళన చెందుతున్నాడని, అతనికి తన తల్లి సపోర్ట్‌ అవసరమని చెప్పారు.

కవిత ఒక మహిళగా, ప్రజా ప్రతినిధిగా బెయిల్‌ పొందవచ్చని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మేరకు ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జడ్జిమెంట్‌ను కూడా అభిషేక్‌ సింఘ్వీ కోర్టుకు చూపించారు. కవితకు బెయిల్‌ ఇవ్వొదని ఈడీ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. కవిత లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నారని.. ఇండో స్పిరిట్ ద్వారా వ్యాపారంలో భాగస్వామ్యమయ్యారని తెలిపింది. కవిత తన ఫోన్లలో డేటాను ఫార్మాట్ చేశారని ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాతే డేటా ఫార్మాట్‌ చేశారని కోర్టుకు తెలిపింది.  డిజిటల్ ఆధారాలు లేకుండా చేశారని పేర్కొంది. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని ఈడీ ఆరోపిస్తుంది. ఈ కేసులో మరికొంతమందిని ప్రశ్నిస్తున్నామని.. ఈ సమయంలో బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టుకు వాదించింది. లిక్కర్‌ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ అరెస్ట్‌ చేసింది.  మార్చి 16న ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా, ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడురోజులకే అనుమతించింది.

కస్టడీ ముగియడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్‌ 9వ తేదీ వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించడంతో ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్ లభించడంతో కవితకు కూడా మధ్యంతర బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆశిస్తున్నారు.  అయితే బెయిల్ ను ఈడీ తీవ్రంగా వ్యతిరికించడంతో కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ ఏర్పడింది.