ఒక్కో బీచ్ కు రూ.2.50 కోట్ల వ్యయం
తూర్పు తీర ప్రాంత నగరం విశాఖను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విశాఖలోని రుషికొండ-భోగాపురం ప్రాంతాల మధ్యన కొత్తగా 10 బీచ్ లు ఏర్పాటు చేస్తోంది. ఏపీ టూరిజం డెవలప్ మెంట్ సంస్థ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా, ఒక్కో బీచ్ ను రూ.2.50 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు.
విశాఖ పోర్టు యాజమాన్యం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అందించే నిధులను ఉపయోగించి తొలిదశలో 5 బీచ్ లను సిద్ధం చేస్తారు. మిగిలిన 5 బీచ్ లను రెండో దశలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ బీచ్ లలో ఫుడ్ కోర్టులు, నడక మార్గాలు, ఫిట్ నెస్ పరికరాలు, పిల్లల క్రీడా పార్కులు, బాత్రూంలు, సురక్షిత స్విమ్మింగ్ జోన్లు, తాగునీటి సదుపాయం, వాచ్ టవర్, సీసీ టీవీ కంట్రోల్ రూం, ఫస్ట్ ఎయిడ్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు.