తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నలుగురు అనుమానితులను తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వారిని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. విజయవాడలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తున్న టైంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గులకరాళ్లతో దాడి చేశారు. ఈ రాయి తగిలి ఆయన నుదిటిపై గాయమైంది. దీనిపై అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు కట్టిన పోలీసులు ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు విజయవాడ పశ్చిమ డీసీపీ హరికృష్ణ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ వేశారు. ఇందులో ఆరు టీంలు పని చేస్తున్నాయి. వీళ్లంతా ఆధారాల కోసం అన్వేషిస్తున్నాయి. ఎటు నుంచి దాడి జరిగింది. ఎంత దూరంలో ఉండి ఎటాక్ చేశారనే కోణంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడకు వచ్చిన జనం తీసిన వీడియోలను కూడా పరిశీస్తున్నారు. వీళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
అనుమానితులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నపోలీసులు కేసు దర్యాప్తు రెండు మూడు రోజుల్లో కొలిక్కి వస్తుందని చెబుతున్నారు. అదుపులో ఉన్న నిందితుల్లో రౌడీషీటర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దాడి జరిగిన ప్రాంతంలోని అన్ని చోట్ల ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. దాడి జరిగిన టైంలో కరెంటు లేకపోవడం దర్యాప్తుకు ప్రధాన అడ్డంకిగా మారిందంటున్నారు పోలీసులు. రోడ్‌షో జరిగిన ప్రాంతంలో ఉన్న పాఠశాల నుంచే రాయి విసిరినట్టు నిర్దారించిన పోలీసులు అక్కడ ఉన్న వారిపై ఆరా తీస్తున్నారు. అంత దూరం నుంచి జగన్‌కు తగిలేలా రాయి ఎలా విసిరారనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. క్యాట్‌బాల్ ఉపయోగించారా లేదా ఎయిర్ గన్ వాడారా అనేది పరిశీలిస్తున్నారు. అదే టైంలో ఆ ప్రాంతంలో జరిగిన ఫోన్ సంభాషణలపై కూడా పోలీసులు ఫోకస్ చేశారు. దాడి జరిగిన ప్రాంతంలో ఇన్‌కమింగ్, ఔట్‌గౌయింగ్ కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. ఒకే నెంబర్ నుంచి ఎక్కువ కాల్స్ వెళ్లినా, వచ్చినా వాటిపై ఆరా తీస్తున్నారు. ఇలా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న అధికారులు… అతి త్వరగా ఈ కేసు నిందితులను పట్టుకోవాలని చూస్తున్నారు.