తెలుగు రాష్ట్రాల్లో కీలక పార్లమెంట్ స్థానాల నుంచి బరిలోకి దిగుతున్న ఇద్దరు ఎంపీ అభ్యర్థుల ఆస్తులు వివరాలు ఆసక్తికరంగా మారాయి. దేశంలో అత్యంత ధనవంతులైన ఎంపీ అభ్యర్థులు జాబితాలో ఆ ఇద్దరు నేతలు చేరిపోయారు. పార్లమెంట్ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తమ తమ ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ఆస్తులు కలిగిన ఎంపీ అభ్యర్థిగా గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ టాప్ ప్లేస్ లో ఉన్నారు. అలాగే, రంగారెడ్డి జిల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సైతం ఆ తర్వాత స్థానంలో నిలిచారు.
రూ.5,785 కోట్ల ఆస్తులతో టాప్‌లో పెమ్మసాని
గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్‌ఆర్‌ఐ పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఈయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న ఆయన ఆస్తులు చూస్తే షాక్ అవ్వాల్సిందే. మొత్తంగా రూ.5,785 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్టు ఆయన ప్రకటించారు. 37 పేజీల అఫిడవిట్‌లో పెమ్మసాని తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. అమెరికాలో వివిధ రూపాల్లో రూ.28.93 కోట్ల పెట్టుబడులు ఉన్నట్టు అఫిడవిట్‌లో పెమ్మసాని పే ర్కొనగా.. జేపీ మోర్గాన్ వంటి బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నాయి. పెమ్మసాని పేరు మీద రూ.519 కోట్లు, ఆయన సతీమణి కోనేరు శ్రీరత్న పేరుతో మరో రూ.519 కోట్లు అప్పులు ఉన్నాయి. పెమ్మసాని కుటుంబానికి చరాస్తులు అధికంగా ఉన్నాయి.
పెమ్మసాని పేరు మీద రూ.2,316 కోట్ల విలువైన చరాస్తులు ఉండగా, ఆయన భార్య శ్రీరత్న పేరుతో రూ.2,289 కోట్లు, పిల్లల్లో ఒకరి పేరుతో రూ.496 కోట్లు, మరొకరి పేరుతో రూ.496 కోట్లు ఉన్నాయి. స్థిరాస్తులు పెమ్మసాని చంద్రశేఖర్ పేరుతో రూ.69.33 కోట్లు, భార్య పేరుతో రూ.25 కోట్లు ఉన్నాయి. పెమ్మసానికి 181 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆయన సతీమణికి 2.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి.
కుటుంబం పేరుతో రూ.4.20 లక్షల విలువైన 5.5 కేజీల వెండి ఆభరణాలు ఉన్నాయి. సొంతంగా మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, సీ క్లాస్, టెస్లా మోడల్ ఎక్స్ క్లాస్, రోల్స్ రాయిస్ ఘోస్ట్, టొయోటా ఫార్చునర్ కార్లు ఉన్నాయి. వీటి విలువ రూ.6.11 కోట్లుగా ఉంది. ఇదే స్థానానికి ఎమ్మసాని చంద్రశేఖర్ సోదరుడు రవిశంకర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన ఆస్తులు విలువ కూడా రూ.1,555 కోట్లు కావడం గమనార్హం.
కొండా విశ్వేశ్వరరెడ్డి ఆస్తులు రూ.4,490 కోట్లు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ లో తన కుటుంబం పేరిట రూ.4,490 కోట్ల ఆస్తులున్నట్లు ఆయన ప్రకటించారు. కొండా దంపతులు, వారి పిల్లల పేరు మీద ఒక్క వాహనం కూడా లేదు. విశ్వేశ్వరరెడ్డి పేరు మీద రూ.1,178.72 కోట్లు ఆస్తులు ఉండగా, ఆయన భార్య సంగీత రెడ్డి పేరుతో రూ.3,203.90 కోట్లు ఉన్నాయి. ఆయన కుమారు వీరజ్ మాధవరెడ్డి పేరున రూ.107.44 కోట్లు ఆస్తులు ఉన్నాయి. కొండా వద్ద రూ.3 లక్షలు, ఆయన భార్య వద్ద రూ.6 లక్షల నగదు మాత్రమే ఉంది. ఆయన పేరు మీద వివిధ బ్యాంకుల్లో రూ.17.69 కోట్ల అప్పులున్నట్టు పేర్కొన్నారు. విశ్వేశ్వరరెడ్డి వద్ద రూ.60 లక్షలు, ఆయన భార్య వద్ద రూ.10.44 లక్షలు విలువైన ఆభరణాలు, వజ్రాలు ఉన్నాయి. కొండా పేరుతో చేవెళ్లలో మూడు ఎకరాలు, ధర్మసాగర్‌లో 43.26 ఎకరాలు, చేవెళ్ల మండలం కమ్మెటలో రెండు ఎకరాలు, కుమ్మెరలో 21.13 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది.