vijayananda-gurajala
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

చిత్తూరులో సై అంటే సై

చిత్తూరులో రాజకీయం రసవత్తరంగా మారింది. కూటమికి చెందిన మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు పొందిన నాయకులంతా ఒకవైపు, ప్రజాసేవే పరమావధిగా భావించిన మరో నేత ఒకవైపు పోటీ చేస్తుండడంతో ఇక్కడ పరిస్థితి రంజుగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాల నేతలకు సైతం చిత్తూరు రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా తయారయ్యాయి.చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎం.సీ.విజయానంద రెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ పోటీ చేస్తున్నారు. అయితే కూటమి అభ్యర్థికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, మరో మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, మాజీ ఎమ్మెల్సీ, విజయ సహకార డైరీ చైర్మన్ దొరబాబు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గీర్వాణి, ఆమె భర్త చంద్ర ప్రకాష్, చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాలాజీ, చిత్తూరు మాజీ ఎంపీ ఆది కేశవులు, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ తదితర హేమాహేమీలంతా తీవ్రంగా కృషి చేస్తున్నారు. వీరంతా ఒక ప్రణాళిక ప్రకారం ఇంటింటి ప్రచారాన్ని చేపడుతూ చిత్తూరు నియోజకవర్గం అంతా కలియ తిరుగుతున్నారు.

వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంసీ విజయానంద రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అయితే స్థానిక వైసీపీ నాయకులతోపాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తల బలం ఉండడంతో వారందరితో కలిసి ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా చిత్తూరులో వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డినే టార్గెట్ చేస్తూ ఇంతమంది నాయకులు ఒకటయ్యారా అనే అంశం స్థానికంగా సున్నిత సమస్యగా తయారైంది. ఇదే వైసీపీ అభ్యర్థికి సానుభూతిని కూడా పెంచే పరిస్థితులు కనిపిస్తున్నాయనే విశ్లేషణ రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతుంది. చిత్తూరు నియోజకవర్గంలో ఇద్దరు బలమైన అభ్యర్థులు తల పడుతుండడంతో సోషల్ మీడియా వేదికగా వారి గెలుపోటములపై చర్చ జరుగుతోంది.

ఇరు పార్టీలకు చెందిన సానుభూతిపరులు, అభిమానులు ఆ సోషల్ మీడియాలో బీపీ పెంచుకునే స్థాయిలో విమర్శలు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. కూటమి అభ్యర్థి ఆరవ తరగతి పాసైనట్లు తానే ఎన్నికల అఫిడవిట్ లో అంగీకరించినందున, ఆ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే దీనిపై ఆ పార్టీ సానుభూతిపరులు వైసీపీ నాయకులపై ప్రతి విమర్శలు చేస్తూ వైరల్ చేసుకుంటున్నారు. తాము గెలిస్తే అది చేస్తాం ఇది చేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు కూడా చేపడుతున్నారు. అంతటితో ఆగకుండా గెలుపు ఓటములపై కూడా బెట్టింగులు కట్టుకుంటున్నారు. మొత్తానికి పోలింగ్ దగ్గర పడే సమయానికి చిత్తూరు రాజకీయం మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.