పులివెందుల సభలో వేలాది మంది ముందు సొంత చెల్లిని టార్గెట్ చేసిన సీఎం జగన్ పెద్ద కలకలమే రేపారు. దానిపై ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని షర్మిల కూడా అన్నకి కౌంటర్ ఇచ్చారు. ఇంత కాలం లేనిది జగన్ సొంతవారిపై డైరెక్ట్ ఎటాక్‌కి దిగడంతో వైఎస్ అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు తమవారికి మద్దతుగా అటు షర్మిల భర్త బ్రదర్ అనిల్‌తో పాటు జగన్, అవినాష్‌రెడ్డిల సతీమణిలు కూడా ప్రచారబరిలోకి దిగడంతో ఆ కుటుంబయుద్దం ఏ టర్న్ తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతుంది. పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో ఉన్నారు. అన్న జగన్‌పై యుద్దం ప్రకటించి కడప ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న షర్మిలకు మద్దతుగా ఆమె భర్త బ్రదర్ అనిల్‌కుమార్ కూడా ఇప్పుడు ప్రచార రంగంలోకి దిగారు. క్రైస్తవ మత ప్రబోధుకుడిగా పేరు తెచ్చుకున్న షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కుమార్.. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా తిరిగి వైసీపీకి మద్దతుగా క్రిస్లియన్లను ఏకం చేయడంలో సక్సెస్ అయ్యారు .. ఇప్పుడు ఆయనే వైసీపీకి వ్యతిరేకంగా క్రిస్టియన్ ఓటర్లను ప్రభావితం చేయడానికి సమావేశాలు నిర్వహిస్తున్నారు.
షర్మిలకు మద్దతుగా కడప జిల్లాలో పాస్టర్లు, క్రైస్తవులతో సమావేశమవుతున్నారు. కడపలోని పలు చర్చిల్లో మత ప్రార్థనల్లో పాల్గొంటున్న ఆయన ధైర్యంగా ఉంటే ఏసుక్రీస్తు అండగా ఉంటారని పిలుపునిచ్చారు. క్రిస్టియన్ ఓటుబ్యాంకుపై బ్రదర్ అనీల్ ప్రభావం ఏ మేరకుంటుందో గత ఎన్నికల సమయంలో చూశారు వైసీపీ అధ్యక్షుడు. అనీల్ గుబులు జగన్‌లో కనిపిస్తుందని వైసీపీ శ్రేణులే అంటున్నారు. సీఎం అనుమానాలు నిజం చేసేవిధంగా బ్రదర్ అనిల్‌కుమార్ క్రిస్టియన్, మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రొద్దుటూరులో ఆయన పాస్టర్లతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. బహిరంగంగా ఓట్లు అడగకపోయినప్పటికీ పాస్టర్లు మాత్రం మనమంతా హస్తం గుర్తుకు ఓటేయాలని క్రైస్తవులను కోరడం విని పించింది. మరోవైపు తమ భర్తలకు మద్దతుగా జగన్, అవినాష్‌రెడ్డిల భార్యలు ప్రచారం మొదలుపెట్టారు. సీఎం జగన్ సతీమణి భారతి పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం ప్రారం భించారు. తన భర్త పోటీ చేస్తున్న ఆ సెగ్మెంట్లోని తొండూరు మండలం ఇనగనూరు నుంచి ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. ఆమె వెంట అవినాష్‌రెడ్డి సతీమణి సమత కూడా పాల్గొంటున్నారు.
సమత ఎన్నికల ప్రచారంలో కనిపించడం ఇదే మొదటి సారి. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా జగన్, ఎంపీగా అవినాష్‌రెడ్డిని గెలిపించాలని వారిద్దరు అభ్యర్ధిస్తున్నారు.. ఆ క్రమంలో సంక్షేమ పథకాలే తమను గెలి పిస్తాయని భారతి ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరందని ప్రచార హడావుడితో వైఎస్ అభిమానుల్లో గందరగోళం కనిపిస్తుంది. దానికి తోడు అటు జగన్‌ని ఉద్దేశించి వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ షర్మిలను టార్గెట్ చేస్తూ అవినాష్ తల్లి వైఎస్ లక్ష్మిలు లేఖాస్త్రాలు సంధిస్తూ వివేకా సెంటిమెంట్‌ను మరింత రాజేస్తున్నారు. ఆ గుబులుతోనే సునీత ప్రచారంలో వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగుతున్నాయంటున్నారు. తాజాగా పులివెందుల మండలంలో తాజాగా సునీత కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్ద రంగాపురంలో ఆమె ప్రచారాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
వివేకా హత్య గురించి ఇక్కడ మాట్లాడవద్దని వైసీపీ కార్యకర్తల ఆందోళన చేపట్టగా ఎందుకు వివేకా హత్య గురించి మాట్లాడకూడదని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.మొత్తమ్మీద వైఎస్ కుటుంబం నిట్టనిలువునా చీలిపోవడం వైఎస్ అభిమానుల్లో తీవ్ర గందరగోళానికి కారణమవుతోంది. వైఎస్ వివేకాతో సాన్నిహిత్యం ఉన్న జిల్లా నేతలు ఈ ఎన్నికల్లో ఎటు మొగ్గు చూపాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నారంట. మరి ఈ ఫ్యామిలీ వార్ ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో చూడాలి.