ఆంధ్రప్రదేశ్ రాజకీయం

అవును.. జగన్ అన్నట్లుగానే దేశం మొత్తం ఏపీ వైపే చూసింది..

 వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగా యావత్ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది..! అదేంటి ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోయింది కదా.. ఇక చూడటమేంటి..? ఇదేం విడ్డూరమనే
సందేహాలు వచ్చాయ్ కదా..! అక్కడికే వస్తున్నా ఆగండి..! ఇంకెందుకు ఆలస్యం.. మీ సందేహాలన్నింటికి క్లియర్ కట్‌గా సమాధానాలు దొరకాలంటే … ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన ఐప్యాక్ టీమ్‌ను అభినందించడానికి వైఎస్ జగన్ ఆఫీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన జగన్.. ‘మనం గెలుస్తున్నాం.. ఎంతలా అంటే దేశం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ఎన్నికల ఫలితాలు ఉంటాయి. ఇక పీకే (ప్రశాంత్ కిషోర్) మాటలు మనం పట్టించుకోనక్కర్లేదు’ అని చెప్పుకొచ్చారు. అది కూడా బల్లగుద్ధి మరీ జగన్ పదే పదే చెప్పారు. ఇక అధినేతే చెప్పాక మనదేముంది అని మంత్రులు, అభ్యర్థులు ఎంత హడావుడి చేశారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వైసీపీ కార్యకర్తలు అయితే సోషల్ మీడియా వేదికగా జగన్ మాటలను పట్టుకుని సినిమా రేంజిలో గ్రాఫిక్స్, డైలాగ్స్ జోడించి నానా రచ్చ రచ్చే చేశారు. సీన్ కట్ చేస్తే అట్టర్ ప్లాప్!
అవును దేశం చూసిందిగా!
వైఎస్ జగన్ అన్నట్లుగానే దేశం మొత్తం ఏపీ వైపే చూసింది.. ఎలాగంటే ఇంత ఘోరాతి ఘోరంగా పార్టీ ఓడిపోయిందేంటి..? అని దేశమంతా చూసింది. జగన్ అనుకోవడం.. ఇలా జరిగిపోవడం ఇది కూడా దేవుడి
స్క్రిప్టేనేమో సుమీ!. వాస్తవానికి జగన్ ఈ మాట అన్నప్పుడే భారతదేశం సంగతి అటుంచి.. తెలుగుదేశం సంగతి చూడండి అని పెద్ద ఎత్తునే కౌంటర్లు వచ్చాయి. ఇప్పుడు అటు దేశం.. ఇటు తెలుగు దేశం రెండూ
ఏపీవైపు గట్టిగానే చూశాయ్. చూశారుగా.. ఇదీ దేశం మొత్తం ఏపీ వైపు చూడటమంటే.. అర్థమైందా రాజా!