గతసారి తెలుగుదేశం పార్టీకి ఎదురైన పరిణామాలే.. ఇప్పుడు వైసీపీకి దాపురించాయి. చంద్రబాబుకు సొంత కుటుంబం నుంచే సెగలు తగిలాయి నాడు. జూనియర్ ఎన్టీఆర్ అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు. ఆయన మామ నార్నే శ్రీనివాసరావు టిడిపికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. వైసీపీలో చేరి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. టిడిపిలో చాలామంది నాయకుల కుటుంబాల్లో చీలిక తెచ్చి వైసీపీ లబ్ధి పొందింది అన్న ప్రచారం ఉంది. నాటి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు వైసీపీలో చేరి ఎంత డ్యామేజ్ చేశారో తెలియంది కాదు.అయితే ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అలానే ఉంది. సీఎం జగన్ కుటుంబంలోనే భారీగా చీలిక వచ్చింది. ఆ కుటుంబం అడ్డగోలుగా చీలిపోయింది. చెల్లెలు షర్మిల, సునీత జగన్ ను వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి ఇబ్బంది పెడుతున్నారని జగన్ కూడా చెప్పుకొస్తున్నారు. వైయస్ కుటుంబంలో సగం మంది జగన్ వెంట ఉండగా.. మిగతా వారు షర్మిల వెనుక నిలబడ్డారు. దీంతో సగటు వైఎస్ కుటుంబ అభిమాని బాధపడు తున్నాడు. ఎటు ఉండాలో తెలియక సతమతమవుతున్నాడు.
ఈ పోరాటంలో ఆ కుటుంబం ఎక్కడ నవ్వుల పాలవుతుందోనని ఆందోళన చెందుతున్నాడు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు సొంత అల్లుడు.. మామ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆయనను గెలిపించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. ఆయన వ్యక్తిత్వం విషయంలో చాలా విషయాలు బయట పెట్టాడు. ఇప్పుడు ఇదే వైరల్ గా మారింది. కొద్దిరోజుల కిందట విశాఖకు చెందిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కుమారుడు కూడా ఇలానే వ్యాఖ్యానించాడు. తన తండ్రిని గెలిపించవద్దని నేరుగా ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. మరోవైపు వైసీపీలోకి వెళ్లి జగన్ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలని ముద్రగడ పద్మనాభం ప్రయత్ని స్తున్నారు. తాజాగా ఆయన కుమార్తె సైతం సోషల్ మీడియాలో తండ్రి వైఖరిని తప్పు పట్టడం విశేషం. పైగా తన తండ్రి ప్రత్యర్థులైన పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని, ఆయనకే తమ మద్దతు అని ప్రకటించడం విశేషం. అయితే ఎన్నడూ లేని విధంగా వైసీపీ నేతలకు కుటుంబ పోటు ఎదురు కావడం మాత్రం ఇబ్బందికర పరిణామమే. గత ఎన్నికలకు ముందు టిడిపికి ఎదురైన పరిణామాలే.. ఇప్పుడు వైసీపీకి ఎదురు కావడం విశేషం.
నోటి దురుసు నేతలకు ఇక్కట్లే
ఏపీ రాజకీయాలు అంటేనే ఒక రకమైన అపవాదు ఉంది. నోరు తెరిస్తే బూతులు, తిట్ల దండకానికి నేతలు దిగుతారన్న కామెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా వైసిపి మంత్రులు, మాజీ మంత్రుల మాటలు వివాదాస్పద మయ్యాయి. అలాగని ప్రతిపక్ష నేతలు ఏం తక్కువ కాదు. వారిలో కూడా చాలామంది తిట్లదండకంలో ఆరితేరిన వారే. అయితే రాజకీయాలంటేనే ఏహ్య భావం కలిగేలా.. ఏపీలో కొందరు నేతలు మాటల తీరు కొనసాగడం విచారకరం. అధినేతల తీరుతోనే, వారిని ఆకట్టుకోవాలని చాలామంది బూతులను ఆశ్ర యించడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ నేతల నోటి దురుసు ఈ ఎన్నికల్లో కొంప ముంచుకున్నట్లు తెలుస్తోంది.అధికార వైసీపీలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు గత ఐదేళ్లుగా ఎన్నో రకాలుగా వివాదాస్పద మయ్యారు. వారు వాడిన భాష ఇబ్బందికరంగా ఉండేది. అయితే అప్పుడే కాదు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా అదే భాష వాడుతుండడం వారికి ప్రతికూలంగా మారుతుంది. ముఖ్యంగా గుడివాడ నుంచి పోటీ చేస్తున్న కొడాలి నాని, నగిరి నుంచి బరిలో దిగిన మంత్రి రోజా, నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్, సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నా అంబటి రాంబాబు, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, వల్లభనేని వంశీ వంటి వారికి డేంజర్ బెల్స్ మోగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే వారు వాడిన భాష వైసిపి శ్రేణులకు ఫ్యాషన్ గా అనిపిస్తుంది. అబ్బో గొప్ప మాటలుగా వారు అభివర్ణిస్తుంటారు. వారిని హీరోలుగా చూస్తుంటారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. తటస్తులు, ఏ పార్టీతో సంబంధం లేని వారు, విద్యాధికులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు.. వీరు ఉపయోగించే భాషను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సభ్య సమాజంలో అటువంటి వారికి స్థానం లేదని చెబుతున్నారు. అయితే వీరు మాట్లాడే మాటలు నియోజకవర్గంలో వారికి ప్రయోజనం చేకూరుస్తాయి కానీ.. రాష్ట్రస్థాయిలో మాత్రం వారి పార్టీ విజయానికి గండి కొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారి వ్యాఖ్యలు రోజురోజుకు శృతిమించడం, అవే బూతులు తిడుతుండడంతో సొంతవారికి సైతం రుచించని పరిస్థితి. ఇప్పటికే ఈ తరహా వ్యాఖ్యలు చేసే నాయకులు ఎదురీతున్నట్లు తెలుస్తోంది. సర్వేల్లో కూడా ఇదే స్పష్టమవుతోంది. కేవలం నోటి దురుసు మూలంగానే.. వీరంతా ఓడిపోతున్నారని తెలియడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. జూన్ 4న తమ మాటలతో జేజేతులా రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నాం అన్న బాధ వారిలో వ్యక్తం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.